2009లో ఓ సంస్థ దాదాపు ఏడు వేల కోట్ల మేరకు అవకతవకలకు పాల్పడటంతో.. గ్లోబల్ కార్పొరేట్ కమ్యూనిటీ దిగ్భ్రాంతికి గురైంది. సుమారు రూ.700 కోట్ల నగదును ఓ వ్యక్తికి అందజేయడంతో.. ఆయా సొమ్మును లెక్కల్లో ఎలా చూపించాలో తెలియక.. మేనేజ్ చేయలేక.. తప్పుల మీద తప్పులు చేస్తూ ఒక్కసారిగా చేతులెత్తేశాడా సంస్థ ఛైర్మన్. అంటే, ఒక సంస్థ నిలదొక్కుకోవడానికి ఎంతోకొంత నగదు నిల్వలు ఉండాలని నిపుణులు సైతం చెబుతుంటారు. మరి, అరబిందో రియాల్టీ సంస్థ ఎండీ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్‌గా మారడం వల్ల ఆయా రియల్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆయన నిర్ణయం రియల్ ప్రాజెక్టులకు సానుకూలంగా మారుతుందా? లేక ప్రతికూలంగా మారే ప్రభావముందా?
రియల్ ఎస్టేట్ రంగమంటే నమ్మకంతో కూడుకున్న వ్యాపారం. అందుకే కొందరు కొనుగోలుదారులు.. తమకు నమ్మకమున్న కంపెనీ, ఏదైనా ఒక ప్రాజెక్టును అరంభిస్తుందని ముందే తెలిస్తే.. వెంటనే అందులో ఫ్లాట్లను బుక్ చేస్తారు. బంధుమిత్రులతో కూడా కొనిపిస్తారు. ఈ క్రమంలో అరబిందో సంస్థ అతి తక్కువ సమయంలో కొనుగోలుదారుల నమ్మకాన్ని సంపాదించింది. అందుకే మాదాపూర్‌లోని కొహీనూర్ ప్రాజెక్టులో బయ్యర్లు భారీగానే ఫ్లాట్లను కొన్నారు. ఆతర్వాత కొండాపూర్‌లోని రీజెంట్‌లోనూ అమ్మకాలు మెరుగ్గా జరిగాయి. అయితే, లిక్కర్ స్కాంలో అరబిందో రియాల్టీ ఎండీ శరత్‌చంద్రారెడ్డి పేరు ఉండటంతో బయ్యర్లంతా ఆశ్చర్యపోయారు. నాలుగైదు అంచెల భద్రతా వ్యవస్థను పాటించే ఓ బడా వ్యక్తి.. ఇంత చీప్‌గా లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నాడేమిటని విస్తుపోయారు. ఆతర్వాత రీజెంట్, పర్ల్‌లో అమ్మకాలు తగ్గాయని సమాచారం.
సాధారణంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో బిల్డర్ ఒక ప్రాజెక్టును ఆరంభించే ముందు.. మొత్తం ప్రాజెక్టు విలువలో దాదాపు 30 శాతం పెట్టుబడి పెడతాడు. ఆ తర్వాత ఆర్థిక సంస్థల రుణాలు, అమ్మకాల ద్వారా వచ్చే మొత్తంతో ప్రాజెక్టును పూర్తి చేస్తాడు. అరబిందో రియాల్టీ సంస్థ ఎండీ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల.. అప్పటివరకూ ఆయా సంస్థ మీద ఉన్న మంచి పేరు కాస్త గంగలో కలిసింది.
సొమ్ము కట్టమంటూ ఫోన్ల మీద ఫోన్లు!
అరబిందో సంస్థ నిన్నటివరకూ.. కొహీనూర్, రీజెంట్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన్నవారు చెల్లించే సొమ్ము గురించి పెద్దగా అడిగేది కాదు. నిర్మాణ ప్రగతిని బట్టి చేయాల్సిన చెల్లింపుల గురించి బయ్యర్ల వెంట పడేది కాదు. కానీ, ఇప్పుడేమో పరిస్థితి మారిపోయింది. కొనుగోలుదారులు రూ.5 లక్షలు బకాయి ఉన్నా.. కట్టమని ఫోన్ చేసి విసిగిస్తున్నారు. ఆలస్యమైతే చాలు.. కట్టమంటూ వెంట పడుతున్నారు. దీంతో, బయ్యర్లు షాక్ అవుతున్నారు. ఎందుకిలా రూ.5 – 10 లక్షల కోసం వేధిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోమ్మంటూ ఉద్యోగులెంతో వినయంగా చెబుతుండటం గమనార్హం. అంటే, దీన్ని అరబిందో రియాల్టీ నగదు నిల్వలు లేక ఇబ్బంది పడుతోందా? అమ్మకాల నుంచి రావాల్సిన సొమ్ము రాక.. కొత్త ఫ్లాట్లు అమ్ముడు కాక.. ఆర్థిక సంస్థల్నుంచి రుణాలు రాక సమస్యల్లో చిక్కుకుందా? వంటి సందేహాలు కలుగుతున్నాయి. బయట్నుంచి చూస్తే కొహినూర్ ప్రాజెక్టు స్ట్రక్చర్ పూర్తయినట్లు కనిపిస్తుంది. ప్లంబింగ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రీకల్, లప్పం ఫినిషింగ్, ఫ్లోరింగ్ వంటి అంతర్గత పనులింకా పూర్తి కావాల్సి ఉందని సమాచారం. ఈ పనులు సక్రమంగానే జరుగుతాయా? లేవా? అని కొందరు కొనుగోలుదారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
పెద్ద తలకాయలు బయటికి?
శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిపోవడంతో లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉన్న పెద్ద తలకాయలన్నీ బయటికొచ్చే అవకాశముంది. ఏయే నాయకుడు ఏయే సందర్భాల్లో ఈ లిక్కర్ స్కాంలో కీలక పాత్రను పోషించారు? ఎవరెవరికీ ముడుపులు అందాయి? వాటిని ఎక్కడ అందజేశారు? ఇలా ప్రతి అంశం గురించి శరత్ చంద్రారెడ్డి చెప్పే అవకాశముంది.
అరబిందోకు ప్రభుత్వ సహకారం లభిస్తుందా?
వాస్తవానికి అరబిందో సంస్థ ముందునుంచీ రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాల్ని కొనసాగించింది. అందుకే, ఆయా కంపెనీ మాదాపూర్‌లోని కీలక ప్రాంతాల్లో ప్రాజెక్టుల్ని చేపట్టడానికి అవసరమయ్యే భూముల్ని దక్కించుకుందనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ అంశంలో ప్రభుత్వ పెద్దలు అరబిందో సంస్థకు సహకరించారని వార్తలు వినిపించాయి. కొండాపూర్‌లోని రీజెంట్ ప్రాజెక్టు స్థలానికి కావాల్సిన ఎన్వోసీలు, అనుమతులన్నీ వెంటవెంటనే ఇచ్చేశారని స్థానిక సంస్థల అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కాంలో అప్రూవర్‌గా మారిపోవడంతో.. అరబిందో రియాల్టీ సంస్థకు ప్రభుత్వం నుంచి ఏమేరకు సహాయం లభిస్తుందనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో, ఈ ప్రాజెక్టుల పురోగతి మీద ప్రతికూల ప్రభావం పడుతుందా అని బయ్యర్లు ఆరా తీస్తున్నారు. మరి, ఈ లిక్కర్ స్కాం రానున్న రోజుల్లో ఎటువైపు మళ్లుతుందోనని నగర రియల్ రంగం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.