జీవితంలో ఒక్కసారే అవకాశం.. మళ్లీ మీ ముందుకు రాని సదావకాశం.. 405 గజాల్లో వాటర్ ఫ్రంట్ విల్లాస్.. ధర అంటారా.. కేవలం రూ.2.90 కోట్లకే.. అంటూ అరబిందో తత్వా సంస్థ.. పటాన్‌చెరులోని పెద్దకంజర్లలో.. సాన్సా కౌంటీలో ప్రీలాంచ్ అమ్మకాల్ని ఆరంభించింది. ఇప్పుడైతే కేవలం కొన్ని విల్లాలే అందుబాటులో ఉన్నాయట. మరోసారి ధర పెంచితే కనీసం రూ.4.3 కోట్లను చేస్తుందట. ఇలాంటి ప్రకటనను చూస్తే ఎలాంటి వారికైనా ఆశ కలుగుతుందా లేదా చెప్పండి. ఇండియాలోనే అతిపెద్ద ఇంటీగ్రేటెడ్ టౌన్‌షిప్పులో ఇంత బహిరంగంగా ప్రీలాంచ్‌లో విల్లాల్ని విక్రయిస్తుంటే.. తెలంగాణ రెరా అథారిటీ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఈ సంస్థ బదులు మరే ఇతర సంస్థ ప్రీలాంచ్‌లో విల్లాల్ని విక్రయిస్తే ఆయా సంస్థను రెరా అథారిటీ ముప్పుతిప్పలు పెడుతుంది. మరి, అరబిందో సంస్థను ఎందుకు వదిలేసిందో తెలుసా?
తెలంగాణ రెరా అథారిటీ నుంచి ఏ ఫేజుకైతే అనుమతి తీసుకున్నారో.. దానికి సంబంధించిన విల్లాల్ని విక్రయించకుండా.. అసలు రెరా నుంచి అనుమతి తీసుకోకుండా రెండు మరియు మూడో ఫేజు విల్లాలకు సంబంధించిన విల్లాల్ని ఈ సంస్థ విక్రయస్తోంది. సెకండ్ ఫేజులో ప్రీలాంచ్‌లో భాగంగా.. 300 గజాల్లో 3900 చదరపు అడుగుల విల్లాను విక్రయిస్తోంది. తాజాగా మూడో ఫేజు ప్రీలాంచ్‌లో భాగంగా.. 405 గజాల్లో 4700 చదరపు అడుగుల విల్లాను రూ.2.90 కోట్లకే అమ్ముతోంది. ఈ సంస్థ కొనుగోలుదారులకు ఎక్కడ్లేని ఆశను కలిగిస్తోంది. ఇక నుంచి రేటు పెంచాల్సి వస్తే.. విల్లా రేటు సుమారు రూ.4.3 కోట్లకు అమ్ముతుందట. దీంతో కొందరు కొనుగోలుదారులకు ఎక్కడ్లేని అత్యాశ కలుగుతోంది. మరి, రియాల్టీ సంస్థలు ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ధరల పెరుగుదల గురించి ప్రస్తావించడం ఎంతవరకూ కరెక్టు? ప్రీలాంచ్‌లో అమ్మడమే తప్పు.. పైగా ధర పెంపుదల గురించి బహిరంగంగా విక్రయిస్తుంటే.. టీఎస్ రెరా అథారిటీ ఎందుకు పట్టించుకోవట్లేదని కొందరు కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. రెరా అనుమతి లేకపోయినా విల్లాల్ని అమ్ముకునే సదుపాయాన్ని ఈ సంస్థకేమైనా కల్పించారా అని అడుగుతున్నారు. ఇప్పటికైనా రెరా అథారిటీ అరబిందో తత్వా హోమ్స్ హౌసింగ్ సొసైటీ చేస్తున్న ప్రీలాంచ్ అమ్మకాల్ని అరికట్టాలి, లేకపోతే, ఇదే ట్రెండ్ ప్రతి టౌన్‌షిప్పులోనూ దర్శనమిచ్చే అవకాశముంది.
ఎవరీ అరబిందో ..
సాన్సా కౌంటీ ప్రాజెక్టును నిర్మించేదెవరో తెలుసా? ఆరో రియాల్టీగా పేరు మార్చిన అరబిందో రియాల్టీ సంస్థ.. ఈ ఇంటీగ్రేటెడ్ టౌన్‌షిప్పును ప్రాజెక్టును డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో రియాల్టీ కంపెనీ ఎండీ అయిన శరత్ చంద్రారెడ్డి ముఖ్యభూమిక పోషించిన విషయం తెలిసిందే.