Categories: LATEST UPDATES

బెంగళూరా.. భాగ్యనగరమా?

రియల్ పెట్టుబడులకు ఏ నగరం ఉత్తమం?

దేశంలో ఢైనమిక్ సంస్కృతులకు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు, వేగంగా దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ కు అటు బెంగళూరు ఇటు హైదరాబాద్ పోటీ పడుతున్నాయి. ఈ రెండు నగరాల్లో ఇటీవల కాలంలో స్థిరమైన పెరుగుదల ఉన్నప్పటికీ, జీవన వ్యయంలో మాత్రం రెండు నగరాల మధ్యా అంతరం చాలానే ఉంది. బెంగళూరు, హైదరాబాద్ లో జీవన వ్యయం పోల్చి చూసే సందర్భంలో ఆస్తి వ్యయాలు కీలకపాత్ర పోషిస్తాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా చూస్తే ఇటీవల కాలంలో ఈ రెండు నగరాలూ గణనీయమైన వృద్ధి సాధించాయి. బలమైన ఆర్థిక వ్యవస్థ, విస్తరిస్తున్న జాబ్ మార్కెట్లు, పెరుగుతున్న కొనుగోలుదారులు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే, రెండు నగరాల రియల్ ఎస్టేట్ మార్కెట్ల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.

బెంగళూరులో రెసిడెన్షియల్, కమర్షియల్ రియ్ ఎస్టేట్ రెండింటికీ మంచి డిమాండ్ ఉంది. దీంతో అక్కడ ధరలు పెరిగాయి. మరోవైపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు కావాల్సిన ప్రదేశం. ఎందుకంటే ఇది పెట్టుబడిదారులు, ఇంటి యజమానులకు మరింత సహేతుకమైన ధర అవకాశాలు అందిస్తుంది. బెంగళూరు విషయానికి వస్తే.. బలమైన ఆర్థిక వ్యవస్థ, ఇళ్లకు అధిక డిమాండ్, అందుబాటులో ఉండే భూమి పరిమితంగా ఉండటం వంటి అంవాలు అక్కడ రియల్ ఎస్టేట్ ఖరీదుగా మారడానికి కొన్ని ప్రధాన కారణాలు. అదే హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా రియల్ ధరలు బాగానే పెరిగాయి. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల రియల్ ధరలతో ఇక్కడ కొన్ని ప్రాంతాల ధరలు దాదాపు సరిసమానంగా ఉంటాయి. ఉదాహరణకు బెంగళూరులోని వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీలో రియల్ ధరలు, హైదరాబాద్ లోని గచ్చిబౌలి, మాదాపూర్ రియల్ ధరలతో సమానంగా ఉన్నాయి. హైదరాబాద్ రియల్ మార్కెట్ స్థిరంగా మారడంతో ఇక్కడ కూడా ధరల పెరుగుదల క్రమంగా ఉంటుంది.

ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు బెంగళూరే మొదటి ప్రాధాన్యతగా ఉంది. ఆ నగరంలో పెట్టుబడి పెట్టడానికే చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. రాబోయే కాలంలో బెంగళూరు మరింతగా అభివృద్ధి చెందుతుందని, రియల్ ఎస్టేట్ డిమాండ్ అలాగే కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో అందరి మొగ్గూ బెంగళూరు వైపే ఉంది. ముఖ్యంగా ఉత్తర బెంగళూరుకు ఈ విషయంలో డిమాండ్ ఎక్కువ. మరోవైపు బెంగళూరు కంటే హైదరాబాద్ లో రియల్ ధరలు తక్కువ అయినప్పటికీ, పెట్టుబడి పెట్టడానికి ఇది కూడా మంచి ప్రదేశం. అనేక కొత్త ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది రాబోయే సంవత్సరాల్లో రియల్ డిమాండ్ ను మరింత పెంచుతుందని అంచనా. మొత్తానికి బెంగళూరు అధిక జీవన వ్యయం, చురుకైన నగర జీవితం, ఐటీ పరిశ్రమ నిపుణులకు చక్కని అవకాశాలతో విరాజిల్లుతుండగా.. హైదరాబాద్ కొత్త తక్కువ జీవన వ్యయం, గొప్ప సాంస్కృతిక వారసత్వం, కాస్త విశ్రాంతి జీవన శైలితో ముందుకెళ్తోంది.

This website uses cookies.