ప్రముఖ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ సొల్యూషన్స్ కంపెనీ యూఎస్టీ.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ టెక్ పార్కులో కొత్త ఆఫీసు ప్రారంభించింది. 1.18 లక్షల చదరపు అడుగుల పరిమాణంలో, భవిష్యత్తులో మరింత విస్తరణ సదుపాయంతో, 2వేల మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా ఈ కార్యాలయం ప్రారంభించింది. వచ్చే రెండు మూడేళ్లలో హైదరాబాద్ లో తన ఉద్యోగులను 4వేలకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో వినూత్న పరిశోధన, అభివృద్ధికి కేంద్రంగా ఇది పనిచేస్తుంది. 2018లో కేవలం 250 మంది ఉద్యోగులతో ఈ కంపెనీ తన కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటినుంచి శరవేగంగా విస్తరించింది. 2021లో వెయ్యి మంది ఉద్యోగులుకు చేరుకోగా.. ఇప్పుడు వారి సంఖ్య 2వేలు అయింది. యూఎస్టీకి హైదరాబాద్ తోపాటు బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, పుణె, కొయంబత్తూరు, హోసూర్, ఢిల్లీల్లో కూడా ఆఫీసులున్నాయి. హైదరాబాద్ లో యూఎస్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించే విషయంలో మాకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, క్యాపిటా ల్యాండ్ ఇన్వెస్ట్ మెంటుకు ధన్యవాదాలని యూఎస్టీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలెగ్జాండర్ వర్గీస్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో యూఎస్టీ విస్తరణ ఇలా జరుగుతూనే ఉంటుందని, తమ క్లయింట్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ స్థాయి నిపుణులతో కలిసి పని చేయడం గర్వంగా ఉందని హైదరాబాద్ యూఎస్టీ సెంటర్ హెడ్ వెంకట పేరం తెలిపారు.
This website uses cookies.