భారీ వర్షాలు, వరదలతో ఐటీ రాజధాని మునక
రియల్ రంగంపై ప్రభావం చూపిస్తుందేమోనని ఆందోళన
ఐటీ రాజధాని బెంగళూరు వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. ఎక్కడ చూసినా నీట మునిగిన కాలనీలే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్ వెంట ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. గత వేసవిలో తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిన బెంగళూరు.. ఇప్పుడు వరదల బారిన పడింది. అప్పుడు కూడా నీటి సమస్య కారణంగా కంపెనీలు వర్క్ ఫ్రం ఎనీ వేర్ పాలసీ ప్రకటించాయి. అద్దెలు కాస్త తగ్గాయి. తాజాగా వరదల ప్రభావం ప్రాపర్టీ ధరలపై ఏమైనా పడుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
బెంగళూరులో ఇలాంటి పరిస్థితి 2002లో ఓసారి ఏర్పడింది. కేవలం 12 గంటల్లో 130 మిల్లీమీటర్ల వానకు నగరం రోజుల తరబడి మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయింది. తదుపరి సంవత్సరం 71.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై.. మరోసారి నగరంలో అనేక ప్రధాన రహదారులు స్తంభించిపోయాయి. అయితే, ఈ వరదల కారణంగా బెంగళూరులో ప్రాపర్టీ ధరలు తగ్గిన పరిస్థితి లేదని గణాంకాలు చెబుతున్నాయి. యలహంకలో చదరపు అడుగు సగటు ధర 2022 క్యూ3లో రూ.8,635 ఉండగా.. తదుపరి త్రైమాసికంలో రూ.8,750కి పెరిగింది. 2023 క్యూ3లో రూ.8,900కి 2024 క్యూ3లో రూ.9,060కి పెరిగింది. అలాగే ఆగ్నేయ బెంగళూరులోని ఉన్నత స్థాయి నివాస, వాణిజ్య ప్రాంతమైన కోరమంగళలో 2022 క్యూ3లో చదరపు అడుగు ధర రూ.17,422 ఉండగా.. 2024 క్యూ3లో రూ.19,150కి చేరింది. ఈ రెండు ప్రాంతాల్లోనూ వెయ్యి చదరపు అడుగులు అపార్ట్ మెంట్ సగటు అద్దెల పెరుగుదల కూడా ఇలాగే ఉంది. అంటే వరదల ప్రభావం ప్రాపర్టీ ధరలపై పడలేదనేది అర్థమవుతోంది. “సాధారణంగా కేలండర్ సంవత్సరంలో ఈ రకమైన వరదలు నెల లేదా రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాయి.
కాబట్టి ఇది స్వల్పకాలిక సమస్య’’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా బెంగళూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంతను మజుందార్ వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ ఈస్ట్ వెంబడి ఉన్న ఐటీ కారిడార్ 2022 వరదల సమయంలో అత్యంత దెబ్బతిన్న ప్రాంతాలలో ఒకటి. అయితే, నివాస ఆస్తుల డిమాండ్ సరఫరాను మించిపోయింది. ఇంకా మెట్రో లైన్ నిర్మాణంలో ఉన్నందున, ఈ ప్రాంతంలో ప్రస్తుతం ప్రజా రవాణా కనెక్టివిటీ కూడా తక్కువే. ఇక ప్రతి వర్షాకాలంలో నీటి ముంపుతో ఇబ్బంది పడే సర్జాపూర్ రోడ్లోని ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకు 2022 జూన్-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.8,635గా ఉండగా.. 2024లో మూడో త్రైమాసికానికి వచ్చే సరికి రూ.9,060కి పెరిగింది. వాస్తవానికి కొత్తగా ప్రాపర్టీలు కొనాలనుకునేవారితోపాటు ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టిన లేదా ప్రాపర్టీలు కలిగి ఉన్నవారికి వరదలు ఆందోళన కలిగిస్తాయి. అయితే, వరదల కారణంగా ప్రాపర్టీ ధరలు మాత్రం తగ్గాయనే పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు.