ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.19వేల కోట్ల విలువైల గృహాల విక్రయం
బెంగళూరులో రియల్ ఎస్టేట్ ర్యాలీ కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.19వేల కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడయ్యాయి. మొత్తం విక్రయాల్లో 35 శాతం ఉత్తర బెంగళూరులో జరిగాయి. గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈ జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 30 శాతం పెరిగి రూ.19,631 కోట్లకు చేరుకున్నాయని ప్రాప్ టెక్ ఫ్లాట్ ఫారమ్ స్క్వేర్ యార్డ్స్ నివేదిక పేర్కొంది. అదే సమయంలో జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే మూడు నెలల కాలంలో నమోదైన లావాదేవీల సంఖ్య 19% పెరిగి 28,356కి చేరుకుందని వెల్లడించింది.
జూన్ త్రైమాసికంలో అత్యధికంగా 255 రెసిడెన్షియల్ లావాదేవీలు నమోదైన మార్కెట్లో ప్రెస్టీజ్ గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 126 లావాదేవీలతో గోద్రెజ్ ప్రాపర్టీస్ నిలిచింది. రూ.391 కోట్లతో అత్యధిక గృహ విక్రయాల విలువ కలిగిన డెవలపర్ల జాబితాలో ఎంబసీ గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. ‘వరదలు, నీటి కొరత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, గృహ కొనుగోలుదారుల డిమాండ్ స్థిరంగా ఉంది. బలోపేతం అవుతున్న ఐటీ రంగం, ఆఫీసులు పూర్తి సమయం పనిచేయడం వంటి అంశాలు దీనికి మద్దతుగా ఉన్నాయి’ అని స్క్వేర్ యార్డ్స్ ప్రిన్సిపల్ పార్టనర్ సోపాన్ గుప్తా తెలిపారు.
తూర్పు, దక్షిణ శివారు ప్రాంతాలు తమ పట్టు నిలుపుకొన్నప్పటికీ.. ఉత్తర శివారు ప్రాంతాలు అపార్ట్ మెంట్లు, ప్లాట్లు రెండింటికీ ఆసక్తిని కలిగించే కీలక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయని గుప్తా పేర్కొన్నారు. జూన్ త్రైమాసికంలో జరిగిన మొత్తం విక్రయాల్లో 35 శాతం వాటాతో ఉత్తర బెంగళూరు టాప్ లో ఉండగా.. 30 శాతం వాటాతో దక్షిణ బెంగుళూరు రెండో స్థానంలో ఉంది. కాగా, ఉత్తర బెంగళూరులోని బగలూరులో ప్రాపర్టీ ధరలు బాగా పెరిగాయి. ఇక్కడ ఆస్తి ధరలు 90 శాతం మేర పెరిగాయి. 2019లో చదరపు అడుగుకు రూ.4,300 ఉండగా.. 2024 ప్రథమార్థంలో రూ.8,151కి పెరిగింది.