- హైదరాబాద్ లో జనవరి-మార్చి త్రైమాసికంలో 38 శాతం తగ్గిన సరఫరా
- దేశంలోని తొమ్మిది నగరాల్లో 34 శాతం తగ్గుదల
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కాస్త నెమ్మదించింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా తగ్గుముఖం పట్టింది. ఆ మూడు నెలల్లో 8,773 కొత్త యూనిట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో ఆ సంఖ్య 14,802 యూనిట్లుగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన నగరాల్లోనూ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా 34 శాతం తగ్గి 80,774 యనిట్లుగా ఉన్నట్టు.. రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది.
క్రితం ఏడాది మొదటి క్వార్టర్‌లో ఈ నగరాల్లో కొత్తగా 1,22,365 యూనిట్లు విక్రయానికి వచ్చినట్టు వివరించింది. నగరాల వారీగా చూస్తే కోల్‌కతాలో అత్యధికంగా కొత్త ఇళ్ల సరఫరా 62 శాతం తగ్గి 1,874 యూనిట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో ఇక్కడ సరఫరా 4,964 యూనిట్ల సరఫరా నమోదైంది. ముంబైలో 6,359 యూనిట్ల కొత్త ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో కొత్త సరఫరా 12,480 యూనిట్లుగా ఉంది. నవీ ముంబైలో 24 శాతం తగ్గి 5,810 కొత్త ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. పుణెలో కొత్త ఇళ్ల సరఫరా 48 శాతం తగ్గి. 12,479 యూనిట్లుగా ఉంది. థానేలో 11,205 కొత్త యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో సరఫరా 22,595 యూనిట్లతో పోల్చితే 50 శాతం పడిపోయింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో సరఫరా 14 శాతం తగ్గి 10,101 యూనిట్లుగా ఉంది. బెంగళూరులో భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఇళ్ల సరఫరా 2025 జనవరి-మార్చి మధ్య 17 శాతం పెరిగి 20,227 యూనిట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో సరఫరా 17,303 యూనిట్లుగా ఉంది. చెన్నైలో సరఫరా 46 శాతం పెరిగి 3,946 యనిట్లుగా ఉంది.