అపార్టుమెంట్లు కట్టడమంటే ఆవకాయ పచ్చడి అమ్మినంత ఈజీ కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది బిల్డర్లుగా అవతారం ఎత్తుతున్నారు. చేతిలో స్థలముంటే చాలు.. మేస్త్రీలను పట్టుకుని కొందరు అపార్టుమెంట్ కట్టొచ్చని భావిస్తున్నారు. మరికొందరు డాక్టర్లు సైతం ప్రాక్టీస్ పక్కన పెట్టేసి.. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. భారీ నగదు నిల్వలు ఉండటంతో పలువురు పారిశ్రామికవేత్తలూ బహుళ అంతస్తుల్ని కట్టేందుకు రంగంలోకి దిగారు. వీరితో బాటు మేస్త్రీలు, ఏజెంట్లు, ఛానెల్ పార్ట్ నర్లు, స్థల యజమానులు, టీచర్లు, రిటైర్డ్ బ్యాంకర్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా ఎవరు పడితే వారు సులువుగా సొమ్ము సంపాదించొచ్చనే ఉద్దేశ్యంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు.
2005-08 మధ్యకాలంలో ఇలాగే ఇతర రంగాలకు చెందినవారు రియాల్టీలోకి విచ్చేసి.. మార్కెట్ ను మొత్తం నాశనం చేసి.. అడ్డంగా ఇరుక్కుపోయి.. ఆతర్వాత పత్తా లేకుండా పోయారు. అలాంటి వారే మళ్లీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. వీరి అనాలోచిత వ్యవహారశైలి వల్ల మార్కెట్ మొత్తం కకావికలం అయ్యే పరిస్థితికి చేరుకుంది. మరికొంత ప్రతికూల పరిస్థితి ఎదురైతే చాలు.. వీళ్లంతా మార్కెట్ నుంచి నెమ్మదిగా నిష్క్రమిస్తారు. ఏదో కొందరు ధైర్యవంతులు.. తెలివిగా అడుగులు ముందుకేసేవారు మాత్రమే మార్కెట్లో నిలబడతారు. కాబట్టి, ఇలాంటి చెత్త మొత్తం మార్కెట్లో నుంచి క్రమక్రమంగా దూరం అవుతుందని పలువురు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. ఆతర్వాత మార్కెట్ మళ్లీ కోలుకుంటుందని విశ్లేషిస్తున్నారు.
దశాబ్దం క్రితం నాటి పరిస్థితికి.. ప్రస్తుతానికి తేడా ఏమిటంటే.. అప్పట్లో బయ్యర్ల నుంచి ముందస్తుగా సొమ్ము వసూలు చేసేవారు కాదు. ఇప్పుడేమో ముందే వంద శాతం సొమ్ము కొనుగోలుదారుల నుంచి తీసుకుని కొందరు జల్సాలు చేయడం ఆరంభించారు. ఆయా సొమ్మును దారి మళ్లించడం మొదలెట్టారు. అంటే, గతంలో ఢిల్లీ ఎన్సీయార్ రీజియన్‌లో కొందరు బిల్డర్లు ఎలాగైతే చేశారో.. ప్రస్తుతం హైదరాబాద్‌లో డెవలపర్లు అలాగే చేస్తున్నారు. జనాల డబ్బులతో ఆటాడుకుంటున్నారు. ఫ్రీ మనీకి అలవాటు పడిన కొందరు రియల్టర్లు.. కేవలం సొమ్మును వసూలు చేస్తున్నారు తప్ప.. అపార్టుమెంట్లను కట్టేందుకు శ్రద్ధ పడట్లేదు. కాబట్టి బయ్యర్లు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి గురించి ఆరా తీయాలి. నిర్మాణ పనుల పురోగతిని క్రమం తప్పకుండా తెలుసుకోవాలి.