Categories: TOP STORIES

రెండు నెలల్లో.. భూభార‌తి చట్టం!

  • భూ భార‌తి అమ‌ల్లోకి వ‌స్తే..
  • రియ‌ల్ రంగానికి ప్ర‌యోజ‌న‌మే!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న భూ భారతి చ‌ట్టం అమల్లోకి రానున్న‌ది. అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి చట్టానికి గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తేవ‌డానికి రేవంత్ స‌ర్కార్ స‌మాయ‌త్తం అవుతుంది. వచ్చే రెండు నెలల్లో భూభారతి చట్టానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి.. పూర్తి స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన రెవెన్యూ చ‌ట్టం -2020 వ‌ల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్ర‌జ‌లు, రైతులు అనేక స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్నారు. ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చి నాలుగేళ్లు గ‌డ‌చినా.. విధి విధానాల‌ను రూపొందించ‌లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్వోఆర్ చట్టం 2020 వల్ల.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ వివాదాలు తలెత్తాయని, భూ స‌మ‌స్య‌లేని గ్రామం తెలంగాణ‌లో లేదని కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసింది. గ‌త ప్ర‌భుత్వం త‌మ వ్య‌క్తిగ‌త స్వార్ధం కోసం, ప్ర‌యోజ‌నాల కోసం రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను.. పూర్తిగా చిన్నాభిన్నం చేసిందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రెవెన్యూ సేవలను గ్రామ స్థాయి వరకు అందించడానికి రెవెన్యూ చట్టంలో సమూల మార్పుల్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ధరణి స్థానంలో భూభారతి పేరుతో నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందించింది. గ్రామాల్లో రెవెన్యూ పాల‌న‌ను చూడ‌టానికి ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంది. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రెవెన్యూ విభాగం ప‌ని చేయాలి, రెవెన్యూ వ్య‌వ‌స్ద‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌న్న‌దే ఈ ప్ర‌భుత్వ ఆకాంక్ష‌. ప్ర‌జాపాల‌న‌లో ప్ర‌జ‌లు కేంద్ర బిందువుగా మా ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, ఆలోచ‌న‌లు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సామ‌న్య ప్ర‌జ‌లు సంతోష‌ప‌డేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా ప‌ని చేయాలి అని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్ర‌జలకు మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన రెవెన్యూ సేవ‌లను స‌త్వ‌ర‌మే అందించాల‌న్న ఆశ‌యంతో భూభార‌తి చ‌ట్టాన్ని తెచ్చామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.
తెలంగాణలో భూభారతి చట్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో భూ వివాదాలు చాలా వరకు సమసి పోతాయని అధికారులు చెబుతున్నారు. ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. ఇకపై కోర్టుల చుట్టూ తిరగకుండా అధికారుల స్థాయిలోనే భూ వివాదాలను పరిష్కరించుకోవచ్చని రేవంత్ సర్కార్ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న భూముల రిజిస్ట్రేష‌న్ల విధానంలో.. ఎలాంటి మార్పు చేయడం లేదు కాబట్టి.. రియల్ ఎస్టేట్‌ రంగానికి భూభారతి చట్టం వల్ల ప్రయోజనమే గాని నష్టం లేదని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

This website uses cookies.