తను ఎన్ని కలలు కన్నాడు? తన కుటుంబానికో నీడ దొరుకుతుందని పరితపించాడు. సొమ్మంతా తీసుకెళ్లి బిల్డర్ చేతిలో పోశాడు.. చివరికీ జబ్బు పడ్డ తల్లిని మంచి డాక్టరుకు చూపించలేకపోయాడు. బిల్డర్ చుట్టూ తిరిగీ తిరిగీ.. అతను చెప్పే మాటలు వినీవినీ విసిగిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక.. ఎవరికీ చెప్పాలో తెలియక.. మానసిక వేదనకు గురయ్యాడు.
భువనతేజ ఇన్‌ఫ్రా సంస్థ వద్ద ఫ్లాట్లు కొన్నవారిలో ఎవరిని కదిలించినా ఒకటే కథ. ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ. హ్యాపీ హోమ్స్ అంటే సంతోషంగా ఉంటామని భావించారు తప్ప ఇంత కుమిలిపోతామని భావించలేదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ 2020లో హ్యాపీ హోమ్స్ అనే ప్రాజెక్టును కడ్తాల్‌లో ఆరంభించగా.. చాలామంది ఫ్లాట్లు బుక్ చేశారు. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. అది ఎందుకు రద్దయ్యిందో ఎవరికీ తెలియదు. ఇన్నేళ్లు గడిచినా అందులో ఫ్లాట్లు బుక్ చేసినవారికీ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. దీంతో, కొనుగోలుదారులంతా లబోదిబోమంటున్నారు.
కొల్లూరు వద్ద మరో ప్రాజెక్టును ఆరంభించి సొమ్ము వసూలు చేశాక ప్రాజెక్టును క్యాన్సిల్ చేశాడు. అందులో ఎంతమందికి సొమ్ము వెనక్కి ఇచ్చాడో నేటికీ తెలియదు. శామీర్‌పేట్‌లో హ్యాపీ హోమ్స్‌లో కొన్నవారిలో అనేక మంది ఫ్లాట్లు రద్దు చేసుకున్నా.. వారికీ సొమ్ము వెనక్కి ఇవ్వలేదు. కొందరికి చెక్కులిస్తున్నా అవి బౌన్స్ అవుతున్నాయి. దీంతో, నేటికీ ప్రతిరోజూ గుంపులు గుంపులుగా పంజాగుట్టలోని ఆఫీసు చుట్టూ కొనుగోలుదారులు తిరుగుతూనే ఉన్నారు. అయినా, ఏదో ఒక మాయమాటలు చెప్పి.. వాళ్లని వెనక్కి పంపించడం భువనతేజ ఇన్‌ఫ్రా సంస్థ చక్కా వెంకట సుబ్రమణ్యం వెన్నతో పెట్టిన విద్య. ఇక లాభం లేదనుకుని కొందరు అతని మీద పోలీసు కేసు పెట్టడానికీ సిద్ధమవుతుండటం గమనార్హం.
మరి, ప్రీలాంచుల పేరిట అమాయకుల నుంచి సొమ్ము వసూలు చేసి విలాసవంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న భువనతేజ ఇన్‌ఫ్రా వంటి సంస్థలు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి. మరి, ఇలాంటి వారిని ప్రభుత్వం ఎందుకు చూసీచూడనట్లు వదిలేస్తుంది? కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుని.. సుబ్రమణ్యం వంటి మోసపూరిత వ్యక్తుల్ని నియంత్రించకపోతే.. మరింత మంది అక్రమార్కులు రియల్ రంగంలోకి ప్రవేశించి.. అమాయకుల నెత్తి మీద టోపి పెట్టే ప్రమాదముంది. కాబట్టి, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి.. భువనతేజ వంటి సంస్థల మీద ఉక్కుపాదం మోపాలి
This website uses cookies.