- రియల్టర్లు, బయ్యర్లు మెయిన్ కల్ప్రిట్..
- ఆర్కిటెక్టులకు బాధ్యత లేదా?
- ఇంత తక్కువకు ఎలా కడతారు?
- ఆ సీక్రెట్ చెబితే అందరూ ఫాలో అవుతారు!
కొందరు రియల్టర్లు, మరికొందరు బయ్యర్లు..
వీరి అత్యాశ.. అనుభవలేమి.. అవగాహనరాహిత్యం..
హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది.
బిల్డర్లు తమ స్థాయి ఏమిటో అర్థం చేసుకోకుండా.. అనాలోచితంగా..
బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తామని ప్లాన్ చేస్తున్నారు..
అందులో కొంటే మార్కెట్ రేటు కంటే తక్కువకు వస్తుందని.. గుడ్డిగా నమ్మేసి..
ఊర్లో ఉన్న పొలం, ప్లాటు వంటివన్నీ అమ్మేసి.. బంగారమంతా కుదవపెట్టి..
అప్పోసొప్పో చేసి.. సొమ్మంతా బిల్డర్ల చేతిలో పోస్తున్నారు..
ఈ ఇద్దరి అత్యాశ.. హైదరాబాద్ రియల్ రంగాన్ని కబళించేస్తోంది. ఎవరో ఒకరిద్దరూ ఆరంభించిన ఈ వికృత క్రీడ.. ఓ క్యాన్సర్ మాదిరిగా నిర్మాణ రంగమంతా పాకిపోయింది. భూమికి అడ్వాన్సు ఇచ్చి.. వాటి డైమన్షన్స్ తీసుకుని.. ఆర్కిటెక్టులతో ప్లాన్లు గీయించి.. అనుమతి తీసుకోకుండానే.. ఆ స్థలయజమానికి తెలియకుండానే.. కొందరు ప్రబుద్ధులు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. అందులో నుంచి కొంత సొమ్మును తెచ్చి స్థల యజమాని చేతిలో పోస్తున్నారు. ఈలోపు పొరపాటున.. అటు రియల్టర్‌కి, స్థలయజమానికి మధ్య ఇబ్బందులు ఎదురైతే.. అగ్రిమెంట్ కుదరకపోతే.. అందులో కొన్నవారి పరిస్థితి ఏమిటి? ఒకవేళ అగ్రిమెంట్ కుదిరినా.. ఆ భూమి టైటిల్ క్లియర్ గా లేకపోతే.. అందులో అపార్టుమెంట్ కట్టడానికి స్థానిక సంస్థ అనుమతినివ్వకపోతే? ఒకవేళ అనుమతి లభించినా.. అనూహ్యంగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల వల్ల ఆయా బిల్డర్లు నిర్మాణ పనులు చేపట్టగలరా?
సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఈ ప్రకటన చూడండి.. జి ప్లస్ 15 అంతస్తుల అపార్టుమెంట్లో ఫ్లాట్ కొంటే చదరపు అడుక్కీ రూ. 2199 మాత్రమే అట. అది పటాన్చెరు వద్ద రుద్రారంలో. ఈ ప్రకటన చూసి ఏజెంట్లు పది శాతం కమిషన్‌కి ఆశపడి.. ప్రజలతో ఫ్లాట్లను కొనిపిస్తారు. ఆ అపార్టుమెంట్ని బిల్డర్ కడతాడా? లేదా? అనేది తర్వాతి విషయం. ముందయితే టెంట్ పర్సంట్ కమిషన్ వచ్చేస్తుంది కాబట్టి.. ఆ సొమ్ముకి ఆశపడి ప్రజలను మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి, ఇంతకంటే గొప్ప అవకాశం మరోటి ఉండదని చెబుతూ హండ్రడ్ పర్సంట్ సొమ్మును కట్టిస్తున్నారు. బయ్యర్లు కూడా రేటు తక్కువనే సరికి అడుగు ముందుకేస్తున్నారు.
ఆర్కిటెక్టులకు బాధ్యత లేదా?
ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్టులకు ప్లాన్లను చూస్తుంటే.. ఆర్కిటెక్టులకూ సామాజిక బాధ్యత లేనట్లుగా కనిపిస్తోంది. యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాల్ని చేపట్టేందుకు కొందరు బిల్డర్లు ప్లాన్లు ఇవ్వమని అడగ్గానే వీరు గీసి ఇచ్చేస్తున్నారు. తమకెందుకులే.. చేతికి ఎంతోకొంత సొమ్ము వస్తుందా? లేదా? అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి, ఇలాంటి ఆర్కిటెక్టులపై ఆర్కిటెక్టుల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్టులకు ప్లాన్లను ఇవ్వకూడదని ఈ సంఘం పత్రికాముఖంగా ఒక ప్రకటన అయినా విడుదల చేయవచ్చు కదా? అలా చేస్తే.. కనీసం ఐదేళ్లు ఆర్కిటెక్టు కోర్సు చదివి ఆర్కిటెక్టులైన వారు ప్రీలాంచ్ ప్రమోటర్లకు ప్లాన్లు ఇవ్వరు కదా!