-
- ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవంలో
పాల్గొన్న ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
మియాపూర్ ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో ఏర్పాటు చేసిన మోడ్రన్ ఓపెన్ జిమ్ చూసి.. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో స్థలాన్ని చక్కగా వినియోగించుకుని.. ఓపెన్ జిమ్‌ను మెరుగైన రీతిలో డిజైన్ చేశారంటూ ఆయన స్కోవా సంఘాన్ని ప్రశంసించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో.. యువతీయువకులు, మహిళలు, వృద్ధులు ఆరోగ్యంగా ఉండాల్సిందేనని.. ఈ క్రమంలో ఇలాంటి ఓపెన్ జిమ్‌లు చక్కగా ఉపయోగపడతాయని తెలిపారు. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతమంతా చిన్నారులతో నిండిపోతుందన్నారు. ఇటీవల మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాల్నుంచి భాగ్యనగరానికి విచ్చేసే ప్రజలంతా కలిసిమెలిసి నివసించే కమ్యూనిటీలు కళకళలాడుతాయని.. ఇందుకు ఎస్ఎంఆర్ వినయ్ సిటీ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పార్కుల్లో ఇలాంటి ఓపెన్ జిమ్ సౌకర్యాన్ని తాము ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రధాన రహదారిలో కనీసం 17/17 అడుగుల స్థలముంటే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాకపోతే, కొందరు స్థలయజమానులు భూమిని ఇవ్వడంలో వెనకంజ వేస్తున్నారని.. అందుకే, కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం కుదరట్లేదన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తక్కువ విస్తీర్ణంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసే ప్రణాళికల్ని రచిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆవరణలోని వినాయక ఆలయంలో చందనోత్సవం పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాణిపాకం తర్వాత ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో చందనోత్సవం పూజ నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అధ్యక్షుడు కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. నివాసితులు నిత్య సంతోషంగా నివసించాలన్న ఉన్నత లక్ష్యంతో కమ్యూనిటీకి ఆధునిక సొబగులు అద్దుతున్నామని తెలిపారు. ఈ కోవలోనే ఓపెన్ జిమ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సహకరించిన కమ్యూనిటీ వాసులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సీతారామ్ కోరుకోండ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గోరంట్ల, కోశాధికారి శరత్ బాబు, సురేష్, నవీన్, హిమబిందు, తాతాజీ నాయుడు, భాస్కర్‌రావు, కుసుమ్ కుమార్, ఆదేశ్ అగర్వాల్, సందీప్తా సాహూ, వంశీ, వెంకట్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.