క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్ ప్రారంభోత్సవంలో తెలంగాణ గవర్నర్ డా.తమిళసై సౌందరరాజన్
క్రెడాయ్ సామాజిక సేవ ప్రశంసనీయం
ప్రజల కలను నెరవేర్చడం గర్వించదగ్గ విషయం
బిల్డర్లందరూ కలిసి అందుబాటు గృహాల్ని నిర్మించాలని గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్‌లో క్రెడాయ్ తెలంగాణ నిర్వహించిన క్రెడాయ్ స్టేట్‌కాన్ కాన్‌క్లేవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. నిరుపేద ప్రజలకు అవసరమయ్యే విధంగా అందుబాటు ధరలో గృహాల్ని నిర్మించాలని సూచించారు. ఇళ్లల్లో ధారాళమైన గాలీ, వెలుతురు వచ్చేలా కట్టాలన్నారు. విద్యుత్తును గణనీయంగా ఆదా చేసేలా నిర్మాణాల్ని డిజైన్ చేయాలన్నారు. ఇంకా ఏమన్నారో.. క్లుప్తంగా ఆమె మాటల్లోనే..
కరోనా సమయంలో క్రెడాయ్ చేసిన సామాజిక సేవను ప్రశంసిస్తున్నాను. అతి పిన్న రాష్ట్రమైనప్పటికీ, ఇతర రాష్ట్రాల కంటే స్పీడుగా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. రియల్ అనేది ల్యాటిన్ పదం.. దీనికి జెన్యూన్ అని అర్థం. ఎస్టేట్ అనేది ఫ్రెంచ్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ పదమని.. దీనికి స్టేటస్ అని అర్థం. రియల్ ఎస్టేట్ అనేది 1668లోనే మొదలైంది. రక్తదాన శిబిరాలు చేయడంపై ఒక డాక్టర్‌గా హర్షం వ్యక్తం చేస్తున్నాను. కరోనా సమయంలో డెవలపర్లంతా కలిసి బుక్ రూములనూ డిజైన్ చేయాలి. మరికొన్ని రోజుల పాటు ప్యాండమిక్ ఉంటుంది కాబట్టి, రెండు మరియు పడక గదుల ఫ్లాట్లతో బాటు ప్రత్యేకంగా బుక్ రూములను డిజైన్ చేయాలి. ఎందుకంటే, ప్యాండమిక్ సమయంలో బయటికి వెళ్లలేం కాబట్టి, ఇంట్లోనే కూర్చుని మంచి పుస్తకాలు చదివేందుకు వీలు కలుగుతుంది. ఇల్లు అంటే సిమెంటు, బీములు కాదు.. శ్రద్ధ మరియు కలలతో కూడుకున్నది. ఇల్లు కొనుక్కోవడం అనేది ప్రతిఒక్కరి జీవితపు ఆశయం. మీరందరూ ప్రజల కలలను నెరవేరుస్తున్నారు. ఇదెంతో గర్వించదగ్గ విషయం. క్రెడాయ్ ఛాప్టర్లు 20కంటే ఎక్కువగా పెరుగుతాయని ఆశిస్తున్నాను