(King Johnson Koyyada)
హైదరాబాద్లో పెరుగుతున్న భూముల ధరల్ని చూసి కొంతమంది డెవలపర్లు విసుగు చెందుతున్నారు. ఇంతింత రేటు పెట్టి భూమిని కొని.. అపార్టుమెంట్లను నిర్మించి.. రేటు పెంచి అమ్మలేని పరిస్థితి నెలకొంది. భూమికి సంబంధించి న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలించి.. స్థానిక సంస్థలకు అనుమతి కోసం దరఖాస్తు చేసి.. నెలల తరబడి ఎదురు చూసి.. రెరా అనుమతి తీసుకుని.. ఒక ప్రాజెక్టును ప్రారంభించాలంటే తలప్రాణం తోకకొస్తుంది.
ఇన్ని ఇబ్బందుల్ని అధిగమించి ప్రాజెక్టును ప్రారంభించినా.. అమ్మకాలు ఆశించినంత స్థాయిలో జరగని దుస్థితి నెలకొంది. ఇందుకు మొదటి కారణం.. ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్టులేనని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు అనుమతి రాక ముందే, మార్కెట్ కంటే తక్కువకే ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ఫలితంగా, రెరా అనుమతితో ఫ్లాట్లను ఆరంభించే వారి దగ్గర కొందరు కొనడం లేదు. రేటు తక్కువంటేనే కొంటున్నారు తప్ప.. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందా? లేదా? అనే విషయాన్ని ఆలోచించట్లేదు.
ఫ్లాట్లు అమ్ముడు కాకపోవడానికి మరో కారణం.. కొందరు ఐటీ నిపుణులు, ప్రవాసుల్లో రిసెషన్ భయం పట్టుకుంది. అందుకే, వీరిలో చాలామంది ఫ్లాట్లలో పెట్టుబడి పెట్టడాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. ఉద్యోగం ఊడుతుందో లేదో తెలియదు.. మాంద్యం మీద స్పష్టత ఏర్పడిన తర్వాత.. ఫ్లాట్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మంచి సంస్థ, చక్కటి ఆఫర్లను ప్రకటిస్తే.. ధైర్యం చేసే బయ్యర్లు లేకపోలేరు. కాకపోతే, ఫ్లాట్లకు సంబంధించి ఇలాంటి వారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ రెండు అంశాల కారణంగా.. కొందరు డెవలపర్లు పునరాలోచనలో పడ్డారు. అనవసరంగా, అపార్టుమెంట్లను ఆరంభించడం బదులు.. ఎక్కడో ఒక చోట భూమిని కొనుగోలు చేసి.. ఓ మూడేళ్ల తర్వాత అమ్ముకుంటే.. ఆశించిన దానికంటే అధిక లాభాలు వస్తాయి కదా అని ఆలోచిస్తున్నారు. నగరంలో కొత్త ప్రాజెక్టులు గణనీయంగా తగ్గిపోవడానికి ప్రధాన కారణమిదే.
హైదరాబాద్ రియల్ రంగంలో అనుభవజ్ఞులైన బిల్డర్ల బదులు.. ఇతర రంగాలకు చెందినవారే ఎక్కువగా రంగప్రవేశం చేస్తున్నారు. ఇందులో త్వరగా డబ్బుల సంపాదించవచ్చనే అత్యాశతో.. హైరైజ్ ప్రాజెక్టులు, విల్లా అపార్టుమెంట్లను ఆరంభిస్తున్నారు. తొలుత ప్రీలాంచ్ అంటే ఓ మేరకు అమ్ముడవుతాయి. ఆ తర్వాత అట్టి ప్రాజెక్టును పూర్తి చేయడమే అతి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఇలాంటి వారంతా రియల్ మార్కెట్ ను నాశనం పట్టించి.. డబ్బులన్నీ తీసుకుని.. చివర్లో చేతులు ఎత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి ప్రతికూల పోకడల కారణంగానే.. హైదరాబాద్లో అపార్టుమెంట్లను నిర్మించడం బదులు.. కొందరు డెవలపర్లు భూముల ట్రేడింగే సో బెటరని భావిస్తున్నారు. అపార్టమెంట్ల బదులు స్థలాల లావాదేవీలను కొనసాగించడం ఉత్తమం అని అనుకుంటున్నారు.