తమిళనాడులో రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఫీజుల పెంపు నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు బిల్డర్లు విన్నవించారు. ఈ అంశంలో హైదరాబాద్ మోడల్ ను అనుసరించాలని కోరారు. నిర్మాణ ఒప్పందాల కోసం రిజిస్ట్రేషన్ ఫీజును ఒక శాతం నుంచి 3 శాతానికి పెంచాలని సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవరించాలని క్రెడాయ్ కోరింది. ప్రస్తుతం రూ.10వేలు ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును మార్కెట్ విలువలో ఒక శాతానికి పెంచారు.
అయితే, క్రెడాయ్ మాత్రం ఇది రూ.30వేల నుంచి రూ.50వేల మధ్యలో ఉండాలని సూచిస్తోంది. విక్రయ, ఉమ్మడి అభివృద్ధి ఒప్పందం, సాధారణ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్ల కోసం హైదరాబాద్ మోడల్ స్వీకరించాలని, ఇది వాటాదారులందరి ప్రయోజనాలు కాపాడడంలో అత్యంత ప్రభావవంతమైన మోడల్ గా నిరూపితమైందని క్రెడాయ్ వివరించింది. దీనివల్ల భూస్వాములు, ఆస్తి యజమానుల నుంచి తలెత్తే ఎలాంటి ఇబ్బందుల నుంచైనా డెవలపర్లు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్, బ్యాంకులకు రక్షణ కల్పిస్తూనే.. ప్రభుత్వం ముందుస్తు ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొంది.
ఈ పరస్పర ప్రయోజకరమైన ఏర్పాటు అటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే కాకుండా మరింత పారదర్శకమైన, సురక్షితమైన రియల్ ఎస్టేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని.. అందువల్ల తమిళనాడులో రియల్ ఎస్టేట్ పరిశ్రమ స్థిరత్వం, అభివృద్ధి కోసం హైదరాబాద్ మోడల్ అమలును వ్యూహాత్మక చర్యగా చేపట్టాలని కోరుతున్నట్టు పేర్కొంది. రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంపు డ్యూటీ పెంపుదల రియల్ పరిశ్రమపై భారం మోపుతుందని.. అంతేకాకుండా కొనుగోలుదారులకు దాదాపు రూ.లక్ష వరకు అదనపు వ్యయం అవుతుందని వెల్లడించింది.
This website uses cookies.