ప్రపంచంలోనే అతి ఎత్తైన జెడ్డా టవర్
నిర్మిస్తున్న సౌదీ అరేబియా
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ఏది అంటే.. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా అని ఠక్కున చెబుతారు. అయితే, ఇకపై ఈ సమాధానం మారిపోనుంది. బుర్జ్ ఖలీఫానే తలదన్నేలా సౌదీ అరేబియా జెడ్డా టవర్ నిర్మాణం సాగుతోంది. ఈ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీనిని కింగ్ డమ్ ఆఫ్ టవర్ అని కూడా పిలుస్తారు.
సౌదీ అరేబియా జెడ్డాలోని ఓబుర్ ఉత్తర భాగంలో ఉన్న జెడ్డా ఎకనామిక్ సిటీలో దీనిని నిర్మిస్తున్నారు. ఈ నగరం ఎర్ర సముద్ర తీరం వెంబడి.. మక్కా, మదీనా అనే రెండు పవిత్ర నగరాల మధ్య ఉంది. ఈ టవర్ ను ప్రముఖ ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ డిజైన్ చేశారు. బుర్జ్ ఖలీఫాను కూడా డిజైన్ చేసింది ఈయనే. జెడ్డా టవర్ పూర్తయితే.. బుర్జ్ ఖలీఫాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా నిలుస్తుంది. 3,281 అడుగుల ఎత్తైన ఈ టవర్ నిర్మాణాన్ని జెడ్డా ఎకనామిక్ కంపెనీ మళ్లీ ప్రారంభించింది.
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా కంటే ఇది 568 అడుగుల ఎక్కువ ఎత్తు ఉండనుంది. ఇందులో 170 అంతస్తులు ఉంటాయి. మొత్తం 59 ఎలివేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. విలాసవంతమైన హోటల్ తోపాటు ఆఫీస్ స్థలాలు, సర్వీస్ అపార్ట్ మెంట్లు, లగ్జరీ కండోమినియంలు, ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేటరీ కలిగి ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. ఈ టవర్ మొత్తం వైశాల్యం దాదాపు 5.30 లక్షల చదరపు మీటర్లు.. అంటే 5.7 మిలియన్ చదరపు అడుగులు. ఈ టవర్ మొదటి దశకు 20 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. ఈ భవన నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీ, గ్రీన్ మెటీరియల్స్ ఉపయోగిస్తారు. టవర్ పైకి ఎక్కి చూస్తే.. మూడు వైపులా ఎర్ర సముద్రపు అందాలు ఆస్వాదించొచ్చు.
ఇక ఈ భవనం స్కై టెర్రస్ 30 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. 157వ అంతస్తులో ఉండే ఈ టెర్రస్ ప్రజలకు తెరిచి ఉంటుంది. పైగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీ కూడా. 2010 మార్చి 10న బుర్జ్ ఖలీఫాను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా కౌన్సిల్ ఆన్ టాల్ బిల్డింగ్స్ అడ్ హాబిటాట్ గుర్తించింది. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత దానిని తలదన్నే నిర్మాణం ఓ దశకు చేరుకుంది. జెడ్డా టవర్ నిర్మాణాన్ని 2013 ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభించగా.. 2018లో పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే, కార్మికుల సమస్యలు, కరోనా మహమ్మారి కారణంగా పనులు నిలిచిపోయాయి. తిరిగి 2023 సెప్టెంబర్లో వీటిని పున:ప్రారంభించారు. ఎప్పటిలోగా పూర్తవుతాయనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.