తాను కొనుగోలు చేసిన లగ్జరీ అపార్ట్ మెంట్ లోని బాత్ రూమ్ లో బాత్ టబ్ లేదనే కారణంతో ఓ మహిళ డెవలపర్ పై ఏకంగా రూ.16.6 కోట్లకు కేసు పెట్టారు. బాత్ టబ్ లేకపోవడమే కాకుండా లగ్జరీ ప్రమాణాలకు అనుగుణంగా ఆ ఫ్లాట్ లేదని పేర్కొన్నారు. లండన్ కు చెందిన అకౌంటెంట్ మి సుక్ పార్క్ అనే మహిళ.. ఫ్యాషన్ హౌస్ వెర్సేస్ సహకారంతో నిర్మించిన ప్రాజెక్టులో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. నైన్ ఎల్మ్స్ అనే ఈ 50 అంతస్తుల ఐకాన్ లండన్ వన్ టవర్‌లో రెండు బెడ్‌రూమ్‌ల అపార్టుమెంట్, పార్కింగ్ స్థలం కోసం పార్క్ రూ.4.2 కోట్లు (3,81,000 పౌండ్లు) డిపాజిట్ చెల్లించారు.
ఉద్యోగ విరమణ చేసేవరకు ఆ ఫ్లాట్ నే ప్రధాన నివాసంగా చేసుకోవాలని భావించి.. దీని కొనుగోలు కోసం 2019లో తన పాత ఇంటిని అమ్మేశారు. వాస్తవానికి ఈ అపార్ట్ మెంట్ 2020లోనే పూర్తి కావాలి. అయితే, నిర్మాణంలో జాప్యం కారణంగా 2022 వరకు పూర్తి కాలేదు. అనంతరం ఫ్లాట్ స్వాధీనం చేసుకుని పార్క్.. అందులోకి వెళ్లిన తర్వాత కొన్ని లోపాలు కనుగొన్నారు. ఓ బెడ్ రూమ్ అనుకున్న దాని కంటే చిన్నగా ఉందని.. రెండు బాత్రూమ్ లలో ఒకదానిలో బాత్ టబ్ లేదని గుర్తించారు. తనకు తొలుత చూపించిన డిజైన్ లో ప్రత్యేకంగా కనిపించిన బాత్ టబ్ లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో ఈ వ్యవహారంపై రూ.16.6 కోట్లకు (1.5 మిలియన్ పౌండ్లు) డెవలపర్ పై దావా వేశారు. తనకు చూపించిన లే ఔట్ ప్రకారం ఫ్లాట్ లేదని పేర్కొన్నారు. దీనిని డెవలపర్లు తోసిపుచ్చారు. బ్రౌచర్లో ఇది కేవలం ఉదాహరణ అపార్ట్ మెంట్ అని స్పష్టంగా పేర్కొన్నారని కోర్టుకు తెలిపారు. కేసు ఇంకా నడస్తోంది.
This website uses cookies.