తెలంగాణలో స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 100 శాతం నుంచి 400 శాతం మేర స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపు ప్రక్రియ తుది దశకు చేరుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పెంచిన స్థిరాస్తుల మార్కెట్ విలువలు ఏప్రిల్ నుంచి అమలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. ఇదే సమయంలో భూభారతిని అమల్లోకి తీసుకువస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు రెడీ అయ్యింది.
తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగనున్నాయి. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్ కు, రిజిస్ట్రేషన్ విలువలకు భారీ వ్యత్యాసం ఉండటంతో భూములు, ఆస్తుల విలువలను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత పదకొండు నెలలుగా రేవంత్ సర్కార్ భూముల మార్కెట్ విలువల పెంపుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు.. పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆరేళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15-30 శాతం, స్థలాల విలువను ఒకటి నుంచి నాలుగు రెట్లు వరకు పెంచే అవకాశం ఉంది.
ఇక వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి ప్రాంతాన్ని బట్టి 100 నుంచి 400 శాతంపైగా పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కనిష్టంగా 75 వేలుగా ఉంది. దీంతో ఇప్పుడు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను కనిష్టంగా 2 లక్షల వరకు సవరించే అవకాశం ఉంది. ఇక జాతీయ రహదారులు, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను 100 శాతం నుంచి 400 శాతం మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇక నగరాలు, పట్టణాల్లో ఇంటి స్థలాలు, అపార్ట్ మెంట్స్ లోని ఫ్లాట్స్ విలువలను సైతం సవరించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున 3200 ఉంది. దీన్ని 60 శాతం మించకుండా పెంచాలని సర్కారు భావిస్తోంది. అంటే చదరపు అడుగు ధర 5120 వరకు కానుంది.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బాగా అభివృద్ది చెందిన మోకిలా, మహేశ్వరం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. మోకిలాలో చదరపు గజం 2300 ఉండగా, మహేశ్వరంలో గజం 2100 మాత్రమే ఉంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచే అవకాశం ఉంది. హైదరాబాద్ లాంటి చోట్ల కొండాపూర్, గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ ప్రకారం ఇంటి స్థలం ప్రస్తుతం చదరపు గజం ధర 26,700 గా ఉంది. ఇదే వాణిజ్య స్థలమైతే గజం 44,900 ఉంది.
నార్సింగిలో గజం 23,800, మణికొండలో 23,900, రాయదుర్గంలో 44,900, బుద్వేల్‌లో 10,200గా ఉంది. ఇటీవల హెచ్ఎండీఏ వేలంలో బుద్వేల్‌లో ఎకరా సుమారు 40 కోట్లు పలికింది. మహేశ్వరంలో గజం 2100, వాణిజ్య స్థలం 10,200 చొప్పున పుస్తక విలువలు ఉన్నాయి. అయితే మహేశ్వరం లాంటి చోట్ల 2100 ఉన్న విలువను 300 నుంచి 400 శాతం పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా 3 వేల కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను సవరించనున్నారని అధికారులు చెబుతున్నారు.
ఇక ఇంటి స్థలాలను సైతం భారీగానే పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చదరపు గజం రిజిస్ట్రేషన్ విలువ 1000 ఉంటే దాన్ని 3 వేల వరకు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదాహరణకు శేరిలింగంపల్లి రెండు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఉంది. అక్కడ ప్రస్తుతం స్థలాల విలువ గజం ధర 26,700గా ఉంది. దీన్ని 50 నుంచి 60 వేల రూపాయల వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మోకిలాలో చదరపు గజం 2300 ఉంది. వాస్తవ విలువకు, రిజిస్ట్రేషన్ శాఖ విలువకు భారీ వ్యత్యాసం ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రస్తుత విలువను కనీసం 400 శాతం పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ఇక్కడ హెచ్ఎండీఏ లేఅవుట్ వేసిన వేలంపాటల్లో చదరపు గజం ధర 50 వేలు పలికింది. ఇలాంటి చోట్ల రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజం ధర 10 వేల వరకు పెంచే అవకాశం ఉంది.
2023-24 లెక్కల ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న మొత్తం ఆదాయంలో అపార్ట్ మెంట్స్ లోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల ద్వార వచ్చేది 35.1 శాతం(రూ.5,115 కోట్లు) కాగా, ప్లాట్ల నుంచి 22.8 శాతం (రూ.3322 కోట్లు)గా ఉంది. ఇక ఇళ్ల రిజిస్ట్రేషన్ల ద్వారా 19.5 శాతం(రూ.2838 కోట్లు), వ్యవసాయ భూములు 11.4 శాతం (రూ.1668 కోట్లు), నాన్-రిజిస్టర్ 11.3 శాతం (రూ.1645 కోట్లు)గా ఉంది. మొత్తం ప్రభుత్వానికి 14,588 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపు తరువాత 40 శాతం అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో సవరిస్తున్న స్థిరాస్థుల రిజిస్ట్రేషన్ విలువలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు అధికారులు. అయితే రిజిస్ట్రేషన్ విలువ భారీగా పెంచితే క్యాపిటల్ గెయిన్, ఇతర పన్నులతో నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
ఇక రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ధరణి స్థానంలో భూభారతిని అమల్లోకి తీసుకువస్తోంది రేవంత్ సర్కార్. భూభారతి అమల్లోకి రాగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని డిసైడ్ అయ్యింది. ఈమేరకు ఇప్పటికే కసరత్తు చేస్తున్న అధికారులు.. 1 శాతం నుంచి 1.5 శాతం మేర రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా ఆదాయం పెరగనుందని అంచనా వేస్తున్నారు.
This website uses cookies.