తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. మొత్తం 765.28 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. మహేశ్వరం, ఆమనగల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ- ఎఫ్సీడీఏ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆమనగల్లులో 2 గ్రామాలు, మహేశ్వరం నుంచి 2 గ్రామాలు, మంచాల నుంచి 3 గ్రామాలు, ఇబ్రహీంపట్నంలో 8 గ్రామాలు, కడ్తాల్లోని 6 గ్రామాలు, యాచారం నుంచి 17 గ్రామాలు, కందుకూరు నుంచి 18 గ్రామాలు క్యాబినెట్ ఆమోదంతో ఇకపై ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి.
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ- ఎఫ్సీడీఏ కమిషనర్ గా ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించనుంది. ఆమేరకు ఐఏఎస్ అధికారులు కే. శశాంక, డా.ఎస్.హరీష్, బి. గోపి ల పేర్లు పరిగణనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో ఒకరినే ఎఫ్సీడీఏ కమీషనర్ గా సర్కారు నియమించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వారం రోజుల్లో ఎఫ్సీడీఏ కమీషనర్ ను నియమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఎఫ్సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా, మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎఫ్సీడీఏ కమిషనర్ నియామకం పూర్తవ్వగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం మరింత వేగం పుంజుకోనుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభమవ్వగా పనులు చకచకా సాగుతున్నాయి. ఇక వచ్చే నెలలో ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీకి అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్దమయ్యాయి. మరోవైపు ఫ్యూచర్ సిటీలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను సైతం తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీకి ఓ రూపం తీసుకువచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ క్రమంగా పుంజుకుంటోందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి.
This website uses cookies.