Categories: TOP STORIES

ఒక్క ఫ్లాట్.. రూ.90 కోట్లు

  • దేశంలోనే అత్యంత ఎత్తైన భవనంలో కొనుగోలు

ఒకే ఒక్క ఫ్లాట్.. ఏకంగా రూ.90 కోట్లకు అమ్ముడైంది. భారత్ లో ఖరీదైన రియల్ ఎస్టేట్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ లావాదేవీ చోటు చేసుకుంది. భారత్ లోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరు పొందిన ముంబైలోని పలైస్ రాయల్ లో ఈ కొనుగోలు జరిగింది. క్యూఐసీఏపీ.ఏఐ కో ఫౌండర్ అమిత్ రాఠీ.. ఆ భవనం 62వ అంతస్తులో 7,685 చదరపు అడుగుల లగ్జరీ అపార్ట్ మెంట్ ను రూ.90 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే చదరపు అడుగు ధర రూ.1.17 లక్షలుగా పలికినట్టయింది. ఈ డీల్ కింద ఐదు కార్ పార్కింగ్ స్థలాలు కూడా వస్తాయి.

మార్చి 22న రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ.5.39 కోట్ల స్టాంపు డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. సెంట్రల్ ముంబైలోని వర్లిలో దాదాపు 320 మీటర్ల ఎత్తులో ఉన్న రాయల్ పలైస్.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన భవనం. 2007లోనే దీని నిర్మాణం ప్రారంభమైనా.. పలు సవాళ్ల కారణంగా కొన్నేళ్లపాటు పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం నిర్మాణం ముగింపు దశకు వచ్చింది. కాగా, 2011లో లోఖండ్‌వాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మహాలక్ష్మి రేస్ కోర్సుకు ఎదురుగా 300 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న మినర్వా అనే మరో నివాస ప్రాజెక్టును ప్రారంభించింది. 301 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాజెక్టు 2023లో పూర్తయింది.

This website uses cookies.