మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనే నిర్ణయానికి వచ్చారా? అయితే, మీరు పలు అంశాలపై దృష్టి సారించాల్సిందే.
ముందుగా ఎంత విస్తీర్ణంలో ఫ్లాట్లు కట్టారో గమనించండి. మీరు కొనే ఫ్లాటుకు అవిభాజ్యపు వాటా కింద ఎంత స్థలం వస్తుందో తెలుసుకోండి. ఆయా స్థలాన్ని అక్కడి మార్కెట్ విలువతో లెక్కించండి. తర్వాత ఫ్లాట్ సైజు ఎంతో చూసి.. చదరపు అడుక్కీ సుమారు రూ.1500 చొప్పున నిర్మాణ వ్యయాన్ని లెక్కించాలి. చివరగా.. కారు పార్కింగ్, ఎమినిటీస్ వంటి వాటికోసం ఎంత చెల్లించారో తెలుసుకోండి. ఇలా చేస్తే.. ఫ్లాటు రేటుకు సంబంధించి మీరో అంచనాకు రాగలరు
మీరు నివసించాలనుకున్న అపార్టుమెంట్ నిర్వహణ గురించి ఆరా తీయండి. అక్కడి సొసైటీ ఎంత సమర్థంగా నిర్వహిస్తుందో కనుక్కోండి. కమ్యూనిటీలో నెలకొనే సమస్యలను పరిష్కరించడానికి ఆయా నివాసితుల సంఘం ఎంత వేగంగా స్పందిస్తుందో తెలుసుకోండి. సంఘ సభ్యులు అందుబాటులో ఉంటారా? లేదా? అనే అంశాన్ని తెలుసుకోండి. ఒకవేళ మీకు సానుకూల సమాధానం లభిస్తేనే అందులోకి అడుగుపెట్టండి
దేశ రాజకీయాలన్నీ గేటెడ్ కమ్యూనిటీల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులంతా కలిసి నివసిస్తారు కాబట్టి.. నివాసితుల మధ్య ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. సొంత పనులన్నీ పక్కన పెట్టేసి.. కొందరు సమాజసేవ నిమిత్తం అసోసియేషన్‌లోకి అడుగుపెడితే.. వారి మీద నిందలు వేసేవారుంటారు. లేనిపోని ఆరోపణలు చేసేవారుంటారు. అందరూ కాదు కానీ, కేవలం ముగ్గురు నలుగురు వ్యక్తులే.. నెగటివ్ మైండ్‌సెట్‌తో ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకుండా.. నివాసితుల సంఘాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయానికి రావడం ఉత్తమం