రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా రెసిడెన్షియల్ లో పెట్టాలా.. లేక కమర్షియల్ వైపు మొగ్గు చూపాలా అనేది మరింత క్లిష్టమైన అంశం. కమర్షియల్ లో పెట్టుబడులు పెట్టడం అనేది సంపన్న వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే వీలవుతుందనే భావన ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఇది నిజమే అయినప్పటికీ, అన్నిసార్లూ అలా అనుకోవడానికి వీల్లేదు. వాణిజ్యపరమైన ఆస్తిని, ముఖ్యంగా దుకాణాలు, షోరూములు వంటి వాటిని వేతనం పొందే వ్యక్తులు కూడా కొనుగోలు చేయవచ్చు. స్థిరమైన రాబడి, అధిక అద్దె విలువ వంటి వాటి కారణంగా వాణిజ్య రియల్ ఎస్టేట్ అనేది పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతోంది. ఇది అపారమైన వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా అద్దెల రూపంలో స్థిరమైన నగదు ప్రవాహం కలిగి ఉంటుంది. అందువల్లే కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ అనేది పెట్టుబడిదారుల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేయడం వల్ల కలిగే లాభాలేమిటో చూస్తే.. మీరు ఇందులోనే కచ్చితంగా పెట్టుబడి పెడతారు.
అధిక అద్దె ఆదాయం
వాణిజ్య ఆస్తి నివాస ఆస్తి కంటే ఎక్కువ అద్దె విలువ కలిగి ఉంటుంది. వాణిజ్య ఆస్తులు సగటు అద్దె రాబడి 8 నుంచి 11 శాతం కలిగి ఉంటాయి. అయితే, నివాస ప్రాపర్టీల సగటు అద్దె రాబటి నాలుగు రెట్లు తక్కువగా 1 నుంచి 2 శాతం మాత్రమే ఉంటాయి. అయితే, కమర్షియల్ పెట్టుబడులపై వచ్చే ఆదాయం ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంటుంది. అద్దె ద్వారా ఆదాయం పొందాలని భావిస్తే.. కమర్షియల్ ప్రాపర్టీపై పెట్టుబడి పెట్టడం నిస్సందేహంగా ఎంతో మంచి నిర్ణయం.
ఫర్నిషింగ్ ఖర్చు లేదు..
వాణిజ్య ఆస్తిపై పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి.. ఫర్నిషింగ్ ఖర్చు లేకపోవడం. ఎందుకంటే, ఆ ఆస్తిని అద్దెకు తీసుకున్న తర్వాత ఫర్నిషింగ్ ఖర్చులు అద్దెదారే భరించాలి. పెట్టుబడిదారుగా మీరు మీ అద్దెదారుకు ఖాళీ ఇల్లు లేదా భవనాన్ని ఇస్తే చాలు. లోపల ఫర్నిషింగ్ అంతా వారే చూసుకుంటారు.
అద్దెదారులతో డీలింగ్ సులభం
వాణిజ్య రియల్ ఎస్టేట్ అద్దెదారులు సాధారణంగా బాగా స్థిరపడిన కంపెనీలే ఉంటాయి. కార్పొరేట్ అద్దెదారులతో డీలింగ్ అనేది ఎప్పుడూ సులభంగానే ఉంటుంది. అద్దె కోసం వారి వెంటపడాల్సి అవసరం ఉండదు. ఇక బాగా పేరున్న బ్యాంకు లేదా కార్పొరేట్ అద్దెదారు మీ భవనంలో ఓ అంతస్తు అద్దెకు తీసుకన్నట్టయితే, మిగిలిన ఆస్తికి డిమాండ్ పెరిగి, అద్దె రాబడి పెరుగుతుంది.
నష్టాలేమిటో తెలుసా?
కమర్షియల్ ఆస్తులు సాధారణంగా పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు లీజుకు ఇస్తారు. అలాగే రెన్యువల్ అవకాశం కూడా ఉంటుంది. ఇంకా లీజు ఒప్పందాలు వార్షిక అద్దె విలువను పెంచే నిబంధన కలిగి ఉంటాయి. ఫలితంగా వాణిజ్య ఆస్తి ద్వారా యజమానికి సాధారణ, స్థిరమైన రాబడి వస్తుంది. కాకపోతే,
వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేయడం వల్ల కలిగే నష్టాలివీ..
అధిక పెట్టుబడి..
సాధారణంగా వాణిజ్య ఆస్తులకు ఎక్కువ పెట్టుబడి అవసరం. రెసిడెన్షియల్ ప్రాపర్టీ కంటే కమర్షియల్ ప్రాపర్టీకి ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతర ఆర్థిక అవసరాలు, కమిట్ మెంట్లను పరిగణనలోకి తీసకున్న తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. పైగా కమర్షియల్ రియల్ ఇన్వెస్ట్ మెంట్ లో కనీస పెట్టుబడి సాధారణంగా సగటు రిటైల్ పెట్టుబడిదారుడికి అందుబాటులో ఉండదు.
ఖరీదైన రుణాలు..
వాణిజ్య ఆస్తి రుణాలు రెసిడెన్షియల్ ప్రాపర్టీ రుణాల కంటే ఖరీదైనవి. ఇది వాణిజ్య ఆస్తికి పెద్ద ప్రతికూలత. వడ్డీ రేటు, నిబంధనలు, షరతులు కూడా ఆస్తి రకం, పెట్టుబడిదారు ప్రొఫైల్, స్థితి, తిరిగి చెల్లించే వ్యవధి ప్రాతిపదికన ఉంటాయి.
సంక్లిష్ట నిర్వహణ..
దుకాణం లేదా షోరూం వంటి వాణిజ్య ఆస్తికి సరైన అద్దెదారుని కనుగొనడం నివాస ఆస్తికి అద్దెదారును కనుక్కోవడం కంటే కొంచెం కష్టం. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అద్దెదారులు కార్పొరేట్లు మాత్రమే ఉంటారు. అలాగే రిటైల్ పెట్టుబడిదారులకు సంక్లిష్టమైన వాణిజ్య ఆస్తులను నిర్వహించడంలో వృత్తిపరమైన నైపుణ్యం ఉండదు.
సమగ్ర పరిశోధన అవసరం..
పెట్టుబడిదారుడు తప్పనిసరిగా ఆస్తిని సంపాదించడానికి అయ్యే మొత్తం ఖర్చు, ఇందులో ఉన్న పన్నులు, జోనల్ చట్టాలు, అద్దెకు తీసుకునే బైలాలు, ఆ భవనం లేదా దుకాణానికి ఎంత అద్దె వస్తుంది వంటి అంశాలపై సమగ్ర పరిశోధన చేయాలి. సరైన ఆస్తి, భౌగోళిక స్థానాన్ని కనుక్కోవడానికి తగిన శ్రద్ధ, మార్కెట్ పై పట్టు అవసరం. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పెట్టుబడిదారుడు వాణిజ్య ఆస్తులలో పెట్టుబడి పెట్టడం కష్టంగా ఉండొచ్చు.
పన్ను చిక్కులు..
పాక్షిక యాజమాన్యం ద్వారా వాణిజ్య ఆస్తుల్లో పెట్టుబడి అంశం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అందువల్ల ఈ ఆస్తి తరగతికి నిర్దిష్ట నిబంధనలు లేవు. ప్రస్తుత ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం.. మీరు ఆస్తిని కలిగి ఉండకపోతే, దానిని అద్దెకు ఇస్తే, వాణిజ్య ఆస్తిని అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంపై ‘ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం‘ కింద పన్ను విధిస్తారు.