Categories: TOP STORIES

లగ్జరీ ఇళ్ల కొనుగోలు షురూ!

  • వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని అంచనా

కరోనా తర్వాత గాడిన పడుతున్న రియల్ రంగం.. నెమ్మదిగా పుంజుకుంటోంది. ముఖ్యంగా విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ బాగానే పెరుగుతోంది. ఇటీవల కాలంలో హై ఎండ్ ప్రాపర్టీలపై ఆసక్తి పెరుగుతున్నట్టు వాటి అమ్మకాలు రుజువు చేస్తున్నాయి. రూ.2.5 కోట్లు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ప్రాపర్టీలపై పెరుగుతున్న ఆసక్తి ఫలితంగా రియల్ రంగం వృద్ధి చెందుతోందని, ఈ ఒరవడి 2023లోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ డైనమిక్స్, ట్రెండ్స్ ప్రకారం.. ప్రీమియం రియల్టర్లు కొత్త వినియోగదారులను పొందడమే కాకుండా మెరుగైన అప్ గ్రేడ్లను అందించడం ద్వారా ప్రస్తుత కస్టమర్లను కూడా నిలుపుకొంటున్నారు.

కరోనా నేపథ్యంలో గేటెడ్, కాంపౌండ్ ఇళ్లు, విల్లాలు, రిటైర్మెంట్ అండ్ సెకండ్ హోమ్స్, రో హౌస్ లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీని ఫలితంగానే రియల్ జోరు కొనసాగుతోంది. వాలెట్ పార్కింగ్, రూఫ్ టాప్ ఎఫ్ అండ్ బీ సౌకర్యాలు, ప్రపంచ స్థాయి గేమింగ్ జోన్లు, గోల్ఫ్ కోర్సులు, వాటర్ బాడీలు, వుడ్ అండ్ నేచుర్ వాక్ లు, బిజినెస్ మీటింగ్ రూమ్స్ వంటి ఎన్నో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన విశాలమైన గేటెడ్ కమ్యూనిటీలను కూడా చాలామంది కోరుకుంటున్నారు. వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ ట్రెండ్ పెరుగుతున్నందున ప్రజలు ఉన్నతమైన జీవనశైలి అందించే, కొత్త పనివిధాలను సజావుగా చేసుకోవడానికి అనువైన ఇళ్ల కోసం చూస్తున్నారు. సాధారణంగా చాలామంది ఎక్కువదూరం ప్రయాణించడాన్ని ఇష్టపడరు. తాము ఉంటున్న క్యాంపస్ లోనే అన్ని సౌకర్యాలూ కావాలని కోరుకుంటారు. పైగా కరోనా తర్వాత అన్నీ విశాలంగా ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ స్కూలింగ్ వంటి అంశాలు ఇందుకు కారణాలు.

గతంలో రెండు లేదా 3 బీహెచ్ కేల్లో నివసించినవారు ఇప్పుడు పెద్ద ఇళ్లకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లగ్జరీ హౌసింగ్ అనేది లాభదాయకమైన పెట్టుబడి అవకాశంగా మారింది. ఇటీవల కాలంలో ఎన్నారైలు కూడా దేశంలోని లగ్జరీ హౌసింగ్ కేటగిరిపై తమ దృష్టి సారించారు. భారతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి బాటలో సాగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్లతో అంతరం తగ్గడంతో ఎన్నారైలు భారతీయ అత్యాధునిక అపార్ట్ మెంట్లు, విల్లాలు, బంగ్లాలు తదితరాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. లగ్జరీ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. ఇది స్మార్ట్ క్యాపిటల్ రిటర్న్స్, రికరింగ్ రెంటల్ ఆదాయం రెండింటినీ అందించగలదు. త్రైమాసికవారీగా చూస్తే లగ్జరీ మార్కెట్ విభాగంలో 35 శాతం వృద్ధి నమోదైంది. ఈ నేపథ్యంలో ఇది వచ్చే ఏడాది సైతం కొనసాగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

This website uses cookies.