ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టొచ్చా అనేది చాలామందిని వేధించే సందేహం. ముఖ్యంగా ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో రాబడి గురించి సరైన అవగాహన లేనప్పుడు ఇది మరీ కష్టసాధ్యమైన అంశం. అయితే, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అనరాక్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 3.6 లక్షల యూనిట్లు అమ్మకాలు జరగవచ్చని అంచనా. ఇప్పటివరకు 2014లో జరిగిన 3.43 లక్షల యూనిట్ల విక్రయాలే గరిష్టం. 2019లో దాదాపు 2.73 లక్షల యూనిట్ల విక్రయాలు జరగ్గా.. ఆ సంఖ్యను ఈ ఏడాది సెప్టెంబర్ లోపే దాటేశాం. అలాగే 2.65 లక్షల కొత్త లాంచింగులు కూడా జరిగాయి. ఇవన్నీ ఇళ్ల డిమాండ్ ను తెలియజేస్తున్నాయి. అయితే, రాబడి పరంగా చూస్తే రియల్ పెట్టబడులు ఎంతవరకు మంచిది?
రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులకు సురక్షితమైన రంగాల్లో ఒకటిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం సమయంలో సైతం ఆస్తిని కొనుగోలు చేయడం మంచి నిర్ణయమేనని, అద్దెలు పెరుగుతున్నందున ఈఎంల భారం పెరిగే అవకాశం లేదని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి బ్యాంకు రుణం పొందే అవకాశం ఉంటే.. అప్పుడు మొదటి లేదా రెండో ఇంటిని కొనుగోలు చేసినా లేదా వాణిజ్యపరమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టాలన్నా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. స్థిరమైన రాబడిని దీర్ఘకాలంలో అందించడంలో రియల్ ఎస్టేట్ రంగం చక్కని ట్రాక్ రికార్డు కలిగి ఉందని గుర్తుచేస్తున్నారు. మనదేశంలో ద్రవ్యోల్బణం వల్ల రియల్ రంగం ఎలాంటి ప్రభావానికి లోనుకాదని, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితంగా రియల్ రంగం పెట్టుబడులకు సురక్షితమని స్పష్టం చేస్తున్నారు. ఇతర ఏ ఆస్తులతో చూసినా భూమిపై రాబడి ఎక్కువే వస్తుందని అంటున్నారు. ద్రవ్యోల్బణ సమయంలోనూ భూమి స్థిరమైన పెట్టుబడి అంశంగా నిరూపితమైందని నిపుణులు చెబుతున్నారు.