(King Johnson Koyyada, 9030034591)
జీవో నెం. 50 వల్ల నిర్మాణ రంగానికి కలిగే నష్టమేమిటి? నిన్నటి వరకూ అందుబాటు నగరంగా ఖ్యాతినార్జించిన హైదరాబాద్ ఎందుకు హఠాత్తుగా కాస్ట్లీ నగరంగా మారిపోయింది. ఇందుకు ప్రధాన కారణాలేమిటి? అధిక శాతం బిల్టప్ ఏరియాలు రావడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి?
జీవో నెం 86ను ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో ఎఫ్ఎస్ఐ లేదా ఎఫ్ఏఆర్ లేకుండా బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వడమేమిటనే మాట చాలామంది బిల్డర్ల నోట వినపడింది. కానీ, ఆ జీవోను రూపొందించిన అధికారులు కూడా నగరంలో అధిక జనాభా గల ప్రాంతాలను గుర్తించి అక్కడ మాత్రమే ఎఫ్ఎస్ఐ నిబంధనల్ని పెట్టారు. అదేవిధంగా, జీవో నెం. 168లో హైరైజ్, స్కై స్క్రేపర్లలో బిల్టప్ ఏరియాను నియంత్రించేలా నిబంధనల్ని పొందుపరిచారు. కానీ, ఎప్పుడైతే జీవో 50 వచ్చిందో టౌన్ ప్లానింగ్ ముఖ్య సూత్రాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఎకరా స్థలంలో ఎంత జనసాంద్రత ఉండాలనే నిబంధనను తుంగలో తొక్కి.. ఇష్టానుసారంగా బిల్టప్ ఏరియాను కట్టుకునేలా నిబంధనల్ని పొందుపరిచారు. ఫలితంగా, హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇష్టం వచ్చినన్నీ ఫ్లోర్లను కట్టుకునే వీలును గత ప్రభుత్వం కల్పించింది.
2 లక్షల స్థానంలో 5 లక్షలా?
జీవో నెం. 68 ప్రకారం.. ఎకరా స్థలంలో మహా అయితే రెండు లక్షల చదరపు అడుగుల వరకూ అనుమతి లభిస్తే.. మాజీ మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన జీవో నెం. 50 కారణంగా.. ఎకరానికి 4 నుంచి 5 లక్షల చదరపు అడుగుల్లో కట్టడం అలవాటైంది. ఇక వాణిజ్య కట్టడాలైతే ఎకరానికి 8-9 లక్షలు కట్టే స్థాయికి చేరారు. ఈ కారణంగానే నగరంలో కొందరు కొత్త బిల్డర్లుగా అవతారమెత్తి.. కో వర్కింగ్ స్పేసెస్ పేరిట ముందస్తు అమ్మకాల్ని జరుపుతున్నారు. అంతేకాదు, మరి కొందరు మరో రకమైన వ్యాపారాన్ని మొదలెట్టారు. పది లక్షలో.. ఇరవై లక్షలో వాణిజ్య స్థలంలో పెట్టుబడి పెడితే నెలసరి అద్దె కూడా చెల్లిస్తామని చెబుతున్నారు. మరి, ఇలాంటి స్కీములకు తెరపడుతుందో లేదో?
నష్టమెవరికి?
ఎకరం స్థలంలో అధిక బిల్టప్ ఏరియాను నిర్మించడం వలన రహదారులు, జంక్షన్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, విద్యుత్తు వంటివి సరిపోక భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. కాబట్టి, జనాభా సంఖ్య పెరిగి.. భవిష్యత్తులో అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా ఏదైనా స్థలం డెవలప్మెంట్ నిమిత్తం వస్తే.. జీవో 86 వచ్చిన తొలిరోజుల తరహాలో.. ఎఫ్ఎస్ఐపై నిబంధనల్ని విధించే పరిస్థితి తలెత్తుతుంది.
జీవో 50 కారణంగా భూముల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఎలాగో తెలుసా? జీవో నెం 168 ప్రకారం.. ఐదెకరాల స్థలంలో.. 20 అంతస్తులకు అటుఇటుగా ప్లాన్ చేస్తే.. ఎకరానికి మహా అయితే రెండు లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా వచ్చేది. ఇందులో స్థలయజమానికి 40 శాతం షేర్ వచ్చిందునుకుందాం.. అంటే, 80 వేల చదరపు అడుగుల వాటా ల్యాండ్ లార్డ్కు వచ్చిందనుకుందాం. అక్కడ ఫ్లాట్ ధర చదరపు అడుక్కీ 5000 ఉందనుకుంటే.. ఎకరం రూ.40 కోట్ల దాకా పలికిందని చెప్పొచ్చు. అదే బిల్డర్ గనక.. జీవో 50 ప్రకారం 5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపడితే.. స్థలయజమానికి 30శాతం వాటా వచ్చిందని అనుకుంటే, 1.50 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా వస్తుంది. అక్కడ ఫ్లాట్ విలువ రూ. 5 వేలు ఉందనుకుంటే.. ఎకరం స్థలం విలువ రూ.75 కోట్లు అయినట్లు లెక్క. అందుకే అధిక శాతం మంది స్థల యజమానులు ఆకాశహర్మ్యాల్ని కట్టేందుకు బిల్డర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ జీవో నెం 50 కారణంగానే హైదరాబాద్ దేశంలోనే రెండో కాస్ట్లీయస్ట్ సిటీగా అవతరించింది.
ఆకాశహర్మ్యాల వల్ల భవిష్యత్తులో మెయింటనెన్స్ విపరీతంగా పెరిగేందుకు ఆస్కారముందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పది అంతస్తుల అపార్టుమెంట్లలో ఫ్లాటు, ఫ్లాటుకు మధ్య పది ఫీట్ల గ్యాప్ ఉంటే.. అరవై అంతస్తుల ఆకాశహర్మ్యంలోనూ అదే గ్యాప్ ఉండటం వల్ల రూములో గాలీవెలుతురు ధారాళంగా ఉండకపోవచ్చు. ఫలితంగా అందులో నివసించేవారు ఇబ్బంది పడక దప్పదు.
ప్రస్తుత నిబంధన ప్రకారం. పది అంతస్తుల భవనంలో టాట్లాట్స్ కోసం పది శాతం స్థలాన్ని వదలాలనే నిబంధన ఉంది. నలభై అంతస్తుల ఆకాశహర్మ్యంలోనూ అంతే శాతం స్థలాన్ని వదిలివేయడం ఎంతవరకూ కరెక్టు? ఎందుకంటే, పాత జీవో ప్రకారం కట్టే వాటిలో తక్కువ ఫ్లాట్లు వస్తే.. కొత్తగా నిర్మించే ఫ్లాట్లలో రెండింతలు ఎక్కువ ఫ్లాట్లు వస్తాయి. అలాంటప్పుడు, పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు సేదతీరడానికి స్థలాలు ఎక్కడుంటాయి చెప్పండి?