Categories: LATEST UPDATES

60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల రద్దు

వాటికి బదులు ఇందిరమ్మ ఇళ్లను
ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి నిర్మాణం మొదలుకాని దాదాపు 60వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు రద్దు చేసింది. వీటికి బదులు ఆయా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 2.92 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయగా.. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు లక్ష వరకు అవి ఉన్నాయి. అయితే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో రూ.12,500 కోట్లు వెచ్చించి 1.54 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించింది. వీటిలో కూడా చాలా ఇళ్లు సరిగా లేవు.

లీకేజీల కారణంగా స్టక్చరల్ డ్యామేజీలు, కిటికీలు, తలుపులు మిస్ అయిపోవడం వంటి కారణాలతో చాలా ఇళ్లు ఎవరికీ కేటాయించలేదు. ఒక్క జీహెచ్ఎఎంసీ పరిధిలో లక్ష యూనిట్లు మంజూరు చేయగా.. 69వేల ఇళ్లు మాత్రమే నిర్మాణమయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీటిని లబ్ధిదారులకు కేటాయించారు. అయితే, సరైన సౌకర్యాలు లేవనే కారణంగా ఎక్కువ మంది వీటిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు నిర్మాణం కాకుండా ఉన్న దాదాపు 60వేల ఇళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

This website uses cookies.