Categories: LATEST UPDATES

ఇళ్ల అద్దెల్లో.. స్వల్ప పెరుగుదల

ఈ ఏడాది క్యూ1 కంటే క్యూ2లో
2 నుంచి 4 శాతం పెరిగిన అద్దెలు

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల అద్దెలు స్వల్పంగా పెరిగాయి. జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2 నుంచి 4 శాతం మేర అద్దు పెరిగినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. అద్దె ఇళ్ల సరఫరాలో కాస్త మెరుగుదల ఉన్న కారణంగానే అద్దెలు మరీ ఎక్కువగా పెరగలేదని విశ్లేషించింది.

2023 క్యూ4తో పోలిస్తే.. 2024 క్యూ1లో ఇళ్ల సగటు అద్దెలు 4 నుంచి 9 శాతం మేర పెరగ్గా.. 2024 క్యూ1తో పోలిస్తే, క్యూ2లో 2 నుంచి 4 శాతం మేర మాత్రమే పెరిగాయని పేర్కొంది. బెంగళూరు వైట్ ఫీల్డ్ లో వెయ్యి చదరపు అడుగుల సాధారణ 2 బీహెచ్ కే అపార్ట్ మెంట్ అద్దె ఈ ఏడాది జనవరి-మార్చిలో రూ.32,500 ఉండగా.. ఏప్రిల్-జూన్ లో రూ.35 వేలకు పెరిగింది. అయితే, 2023 క్యూ4తో పోలిస్తే 2024 క్యూ1లో ఇళ్ల అద్దెలు 8 శాతం మేర పెరగడం గమనార్హం. హైదరాబాద్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో సగటు అద్దె ధరలు 2024 క్యూ2లో 3 శాతం మేర పెరిగాయి.

2024 క్యూ1లో ఇక్కడ అద్దెలు 5 శాతం పెరగడం గమనార్హం. ‘భారత్ లో ఏ త్రైమాసికంతో పోల్చినా రెండో క్వార్టర్లో మాత్రం ఇళ్ల అద్దెల్లో పెరుగుదల కనిపిస్తుంది. కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, కొత్తగా కొలువులు రావడం వంటివి ఇందుకు కారణాలు. అయితే, ఈ ఏడాది కొత్తగా హౌసింగ్ సరఫరా ఎక్కువ కావడంతో ఇళ్ల అద్దెలు మరీ అంత ఎక్కువగా పెరగలేదు’ అని అనరాక్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. 2023లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 4.35 లక్షల కొత్త యూనిట్లు సరఫరా కాగా, 2024లో ఇవి 5.31 లక్షల యూనిట్లు సరఫరా అయ్యాయి. అంటే వార్షిక ప్రాతిపదికన 22 శాతం పెరుగుదల నమోదైంది.

This website uses cookies.