- 200 మిలియన్ చదరపు అడుగులు లాంచ్ అయ్యే చాన్స్
కొత్త సంవత్సరంలో దాదాపు 200 మిలియన్ చదరపు అడుగుల మేర కొత్త గృహాల సరఫరా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 2024లో 253.16 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఇళ్ల సరఫరా ప్రకటనలు రాగా, అందులో కేవలం 23 శాతమే లాంచ్ అయ్యాయి. సాధారణ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగడంతో కొత్త ప్రాజెక్టుల లాంచింగులు కాస్త మందగించాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో దాదాపు 200 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఇళ్ల సరఫరా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలు పూర్తి కావడం, రియల్ రంగం మళ్లీ ఊపందుకోవడంతో రాబోయే త్రైమాసికాల్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి డెవలపర్లు మొగ్గు చూపిస్తారని అనరాక్ అభిప్రాయపడింది.
2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టాప్ 11 లిస్టెడ్ డెవలపర్లు 253.16 మిలియన్ చదరపు అడుగుల కొత్త సరఫరా ప్రారంభిస్తారని ప్రకటించారు. అయితే, అందులో కేవలం 57.15 మిలియన్ చదరపు అడుగులు (23 శాతం) మాత్రమే లాంచ్ అయ్యాయి. దీంతో ఆ మిగిలిన కొత్త ఇళ్లు 2025లో ప్రారంభమవుతాయని పేర్కొంటున్నారు. టాప్-11లో బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ గ్రూప్ 75 మిలియన్ చదరపు అడుగులు ప్రారంభిస్తామని చెప్పగా.. 10.05 మిలియన్ అడుగుల ప్రాజెక్టులే ప్రారంభించారు. సిగ్నేచర్ గ్లోబల్ సుమారుగా 29.3 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్టులతో రెండో స్థానంలో ఉండగా.. 9.5 మిలియన్ చదరపు అడుగుల (32%) విస్తీర్ణాన్ని మాత్రమే లాంచ్ చేసింది.