- నివాస ప్రాంతంగా విస్తరిస్తున్న చేవెళ్ల పట్టణం
- ఇళ్ల కొనుగోలుకు పలువురి మొగ్గు
చేవెళ్ల.. హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చేవెళ్ల పట్టణం ఔటర్ రింగు రోడ్డు నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండల ప్రధాన కార్యాలయం కావడంతో ఇక్కడ మౌలిక వసతులు బాగానే ఉన్నాయి. చెవెళ్లకు సమీపంలో దామెరగిద్ద (4 కిలోమీటర్లు), రామన్నగూడ (5 కిలోమీటర్లు), అల్లవాడ (5 కిలోమీటర్లు), పామెన (5 కిలోమీటర్లు), పాల్గుట్ట (5 కిలోమీటర్లు) గ్రామాలు ఉన్నాయి. చేవెళ్లకు దక్షిణాన షాబాద్ మండలం, తూర్పున మొయినాబాద్ మండలం, ఉత్తరాన శంకర్ పల్లి మండలం ఉన్నాయి. అలాగే సింగాపూర్, వికారాబాద్, ఫరూఖ్ నగర్, సంగారెడ్డికి సమీపంలో ఉంది.
చేవెళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మెరుగ్గా ఉండటంతో ఈ ప్రాంతానికి చక్కని ఆదరణ లభిస్తోంది. ప్రధాన జిల్లాలకు సమీపంలో ఉన్నందున చేవెళ్ల రియల్ ఎస్టేట్ కు మంచి ఊపు వచ్చింది. పెద్ద సంఖ్యలో పలువురు రియల్టర్లు వెంచర్లను అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో కొన్ని తుది దశలో ఉండటం గమనార్హం. పలువురు బిల్డర్లు భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన నిర్మాణాలు చేస్తూ ఈ ప్రాంతాన్ని మరింతగా విస్తరణ చెందేందుకు దోహదపడుతున్నారు. సూపర్ మార్కెట్లు, పాఠశాలలు, రెస్టారెంట్లు, ఫిట్ నెస్ సౌకర్యాలు, బ్యాంకులు, వాణిజ్య సదుపాయాల వంటివి చేవెళ్ల వైపు ఇళ్ల కొనుగోలుదారులు వెళ్లేలా చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చెవెళ్ల, షాబాద్ మండలాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. గతేడాది ఎకరా రూ.కోటి లోపు ఉన్న భూములు ఇప్పుడు రూ. కోటిన్నర దాటాయి. ప్రధాన రహదారుల పక్కన ఉన్న పొలాలు ఎకరాకు రూ. 2.5కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు పలుకుతున్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న విల్లాలు రూ.1.6 కోట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో కొందరు ప్రమోటర్లు రెరా అనుమతి లేకుండా వెంచర్లను వేస్తున్నారు. అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. రెరా అనుమతి ఉన్నవాటిలో కొంటే.. భవిష్యత్తులో రియల్టర్‌తో ఎలాంటి సమస్య వచ్చినా మీకు పరిష్కారం లభిస్తుంది.