- లూలూ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ యూసఫ్ అలీ
నాట్ కాన్ ను నిర్వహించడానికి అబుదాబీని ఎంచుకోవడం బాగుందని లూలూ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ యూసఫ్ అలీ పేర్కొన్నారు. యూఏఈ, ఇండియా మధ్య చక్కని సంబంధాలు ఉన్నాయన్నారు. క్రెడాయ్ నేషనల్ అబుదాబీలో నిర్వహించిన నాట్ కాన్ సదస్సులో ఆయన మాట్లాడారు. సారాంశం ఆయన మాటల్లోనే..
‘భారత్, అరబ్ దేశాల మధ్య సంబంధాలు వందల సంవత్సరాల నాటివని మన అందరికీ తెలుసు. భారత్, యూఏఈ శాంతికాముక, లౌకిక దేశాలు. భారత్ తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల దిశగా సాగుతోంది. ఇక యూఏఈతో భారత్ కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీపా) చరిత్రాత్మకమైనది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. వివిధ దేశాల నుంచి వచ్చినవారంతా ఎలాంటి వివక్షకు గురి కాకుండా ఇక్కడ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. భారతీయులు తగిన గౌరవంతో కూడిన జీవితం గడుపుతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ దేశాన్ని తమ ఇంటికి దూరంగా ఉన్న మరో ఇల్లులా వారు భావిస్తున్నారు. భారతీయుల పట్ల ప్రేమ, సోదరభావం చూపిస్తూ ఎంతగానో ఆదరిస్తున్న యూఏఈ నాయకత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మత స్వేచ్ఛకు తగిన గౌరవం ఇస్తున్న ఈ దేశంలో చర్చిలు, ఆలయాలు, గురుద్వారాలు కూడా ఉన్నాయి. మధ్య ఆసియాలోనే అతిపెద్దదైన ఆలయాన్ని 27 ఎకరాల్లో నిర్మించబోతున్నారు. 14 ఎకరాల్లో ఆలయం, 13 ఎకరాల్లో పార్కింగ్ రాబోతోంది. ఈ భూమిని యూఏఈ అధ్యక్షుడు బహుమతిగా ఇచ్చారు. ఇవన్నీ యూఏఈ లౌకిక భావం, సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.