బిల్డర్లు, ఇంటి యజమానులకు ఊరట కలిగించేలా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు. పుణె మెట్రొపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ అథార్టీ (పీఎంఆర్డీఏ)లో అదనపు డెవలప్ మెంట్ చార్జీలను వంద శాతం తొలగించారు. 2018 జూలై నుంచి 2023 ఏప్రిల్ వరకు వీటిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వందలాది మంది బిల్డర్లు, వ్యక్తిగత ఇళ్ల యజమానులకు లబ్ధి చేకూరనుంది. హింజేవాడి-శివాజీనగర్ పుణె మెట్రో లైన్ 3 కారణంగా పీఎంఆర్డేఏలో భవన అనుమతుల కోసం అదనపు డెవలప్ మెంట్ చార్జీల కింద రూ.332 కోట్లు రికవరీ చేశారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి సంబంధించిన అదనపు డెవలప్ మెంట్ చార్జీలను రద్దు చేస్తూ సీఎం షిండే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అదనపు డెవలప్ మెంట్ చార్జీలను అందరికీ ఒకే తీరుగా కాకుండా సెక్టార్ల వారీగా విధించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.