హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను హైడ్రా షేక్ చేసింది. సామాన్య ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఏరికోరి నియమించిన రంగనాథ్.. తన పరిధిని మించి వ్యవహరిస్తున్నారనే టాక్.. సచివాలయ వర్గాల్లోనూ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే హైడ్రా కమీషనర్ రంగనాథ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మీడియాలతో చిట్‌చాట్‌లోనూ ప్రస్తావించడం గమనార్హం. తాను చెప్పిందొకటైతే.. అతను చేస్తుందొకటన్న అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారని తెలిసింది.
హైడ్రా ఉద్దేశ్యం మంచిదే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయడంతో పాటు చెరువులను, ప్రభుత్వ భూములను రక్షించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ఉద్దేశ్యం. కాకపోతే, ఈ పనిని ప్రణాళికాబద్ధంగా చేయకుండా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వ్యవహరించారు. కొన్ని మీడియా ఛానెళ్లకు ముందస్తు లీకులిస్తూ.. సమాచారాన్ని అందజేస్తూ.. హైడ్రాపై సర్వత్రా చర్చ జరిగేలా చేశారని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఒకటి ఆరా మినహా.. నోటీసులు, ముందస్తు సమాచారం లేకుండా సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తున్నారనే ప్రచారం జరిగి హైడ్రాపై వ్యతిరేకత ఏర్పడింది. చెరువుల్ని కబ్జా చేసి కొందరు ప్రాజెక్టులను కట్టారంటూ.. కొన్ని మీడియా ఛానెళ్లు చేసిన హడావిడితో సామాన్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో, మీడియా ముందుకొచ్చి అనేక మంది సీఎం రేవంత్‌రెడ్డిపై శాపనార్థాలు పెట్టారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది.
This website uses cookies.