Categories: TOP STORIES

పెట్టుబడులు వెల్లువెత్తాయ్

  • 2025 తొలి క్వార్టర్లో 31 శాతం పెంపుతో 1.3 బిలయన్ డాలర్ల పెట్టుబడులు
  • కొలియర్స్ నివేదిక వెల్లడి

భారత రియల్ ఎస్టేట్ రంగంలోకి సంస్థాగత పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రియల్ పెట్టుబడులు 1.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన ఇది 31 శాతం అధికం కావడం విశేషం. ప్రధానంగా దేశీయ పెట్టుబడులతోనే ఇంత మొత్తం వృద్ధి కనిపించింది. ఈ త్రైమాసికంలో మొత్తం పెట్టుబడుల్లో 60 శాతం వాటాతో 0.8 బిలియన్ డాలర్లు దేశీయంగా వచ్చాయి. వార్షిక ప్రాతిపదికన దేశీయ పెట్టుబడులు 75 శాతం వృద్ది చెందాయి. సంస్థాగత పెట్టుబడులు ప్రధానంగా పారిశ్రామిక, గిడ్డంగులు, ఆఫీస్ విభాగాలపై దృష్టి సారించాయి. ఈ మేరకు వివరాలను కొలియర్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2025 మొదటి త్రైమాసికంలో సంస్థాగత ఇన్‌ఫ్లోలలో ఆఫీస్ విభాగం 0.4 బిలియన్ డాలర్లతో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉంది.

2025 మొదటి త్రైమాసికంలో ఆఫీస్ విభాగంలోని మొత్తం ఇన్‌ఫ్లోలలో సగానికి పైగా హైదరాబాద్‌ ఆకర్షించడం విశేషం. ఇక దేశంలో పారిశ్రామిక & గిడ్డంగులు, రెసిడెన్షియల్ విభాగాలు గణనీయమైన లావాదేవీలు నమోదు చేశాయి. 2025 మొదటి త్రైమాసికంలో మొత్తం ఇన్‌ఫ్లోలలో ఇవి 47 శాతంగా ఉన్నాయి. “భారతీయ రియల్ ఎస్టేట్‌లోని సంస్థాగత పెట్టుబడిదారులు విశ్వాసాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. పెట్టుబడులు 2025 మొదటి త్రైమాసికంలో సంవత్సరానికి 31 శాతం పెరిగి 1.3 బిలియన్ డాలర్లకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. విదేశీ మరియు దేశీయ పెట్టుబడిదారులు ఇద్దరూ ఆఫీస్, రెసిడెన్షియల్, ఇండస్ట్రీ అండ్ గొడౌన్ విభాగాలవైపే మొగ్గు చూపించారు. 2025 మొదటి త్రైమాసికంలో సంస్థాగత పెట్టుబడులలో 80 శాతం వాటాను ఇవి కలిగి ఉన్నాయి’’ అని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం ఇదే ఊపు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

కాగా, 2025 మొదటి త్రైమాసికంలో రెసిడెన్షియల్ విభాగంలో వచ్చిన సంస్థాగత పెట్టుబడులను పరిశీలిస్తే.. 2024లో ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 0.3 బిలియన్ డాలర్ల ఇన్‌ఫ్లోలు కలిగిన ఈ విభాగం మొత్తం త్రైమాసిక పెట్టుబడులలో 23 శాతం వాటాను కలిగి ఉంది. ఆసక్తికరంగా, ఈ త్రైమాసికంలో నివాస విభాగంలో మొత్తం ఇన్‌ఫ్లోలలో సగానికి పైగా విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. ‘‘ఇళ్ల ధరలలో స్థిరమైన వృద్ధి, లగ్జరీ గృహాలకు పెరుగుతున్న డిమాండ్, కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి రాబోయే త్రైమాసికాలలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో సంస్థాగత పెట్టుబడులను పెంచుతూనే ఉంటాయి’’ అని కొలియర్స్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అండ్ రీసెర్చ్ హెడ్ విమల్ నాడార్ అన్నారు. కాగా, 2025 మొదటి త్రైమాసికంలో దేశంలోని రియల్ ఎస్టేట్ పెట్టుబడులలో 0.3 బిలియన్ డాలర్లతో ముంబై 22 శాతం వాటా చేజిక్కించుకుని అగ్ర స్థానంలో ఉంది. బెంగళూరు 20 శాతం, హైదరాబాద్ 18 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

This website uses cookies.