Lakshmi Infra Occupied Road in Miyapur and made it as a dump yard
ఆ సంస్థ పేరు లక్ష్మీ ఇన్‌ఫ్రా. మియాపూర్ నుంచి బొల్లారం వెళ్లే రోడ్డులోని హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ వీధిలో లక్ష్మీ ఇంపీరియా అనే ప్రాజెక్టును నిర్మించింది. అందులో ఫ్లాట్లను కొనుక్కున్నవారికీ హ్యాండోవర్ కూడా చేసింది. అయితే, ఈ సంస్థ యజమానికో దుర్భుద్ధి పుట్టింది. ఈ ప్రాజెక్టుకు వెనక వైపు గల రోడ్డును ఎవరూ పెద్దగా వినియోగించరు. ఎందుకంటే, ఈ రోడ్డు తర్వాత మరో సంస్థ గోడను కట్టేసింది. అంటే, ఇదే ఆ రోడ్డులో చివరి అపార్టమెంట్ అన్నమాట. అందుకే, నిర్మాణం జరిగే సమయంలో అక్కడ లేబర్ క్యాంపును ఏర్పాటు చేసింది. అపార్టుమెంట్‌ను నిర్మిస్తున్నారు కదా అని స్థానికుల నుంచి పెద్దగా ఎలాంటి అభ్యంతరం రాలేదు. అదే అదనుగా భావించిందో ఏమో తెలియదు కానీ.. నిర్మాణ పనులు పూర్తి కాగానే.. లేబర్ క్యాంపును తొలగించగానే.. తొలుత ఆయా రోడ్డుకు అడ్డుగా ఒక గేటును ఏర్పాటు చేసింది. అయినా, స్థానికుల నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. జీహెచ్ఎంసీ కానీ రెవెన్యూ అధికారులు కానీ అటువైపు పెద్దగా దృష్టి సారించలేదు. అంతే, ఇక ఎవరూ రారని అనుకున్నారో.. ఆ స్థలంపై తమకు హక్కు వచ్చిందని భావించారో ఏమో తెలియదు కానీ.. ఇటీవల ఆ ఖాళీ స్థలాన్ని చెత్త డంపింగ్ యార్డుగా మార్చివేశాడు. అంత పెద్ద అపార్టుమెంట్‌ను కట్టిన బిల్డర్.. అంత కక్కుర్తి పడటమేమిటని స్థానికులు విస్తుపోతున్నారు.
* అసలెలా ప్రభుత్వ రోడ్డును కబ్జా చేస్తారోనని నిలదీస్తున్నారు. వాస్తవానికి, ఈ రోడ్డు చివర్లో ఉన్న శ్రీలా గార్డెన్స్ ఏర్పాటు చేసిన గోడను తొలగిస్తే.. ఈ రోడ్డును స్థానికులు వినియోగించుకోవచ్చు. పైగా, ఈ రోడ్డు మీదుగా వెనక వైపు నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్‌కు కనెక్టివిటీని ఏర్పాటు చేయవచ్చు. ఇలా బహుళ అవసరాల నిమిత్తం ఉపయోగపడటానికి అవకాశమున్న ఈ రోడ్డును లక్ష్మీ ఇన్‌ఫ్రా బిల్డర్ కబ్జా చేయడం ఎంతవరకూ కరెక్టు అని ప్రజలు నిలదీస్తున్నారు. ఈ రోడ్డును కబ్జా చేయడానికి ప్రయత్నించిన లక్ష్మీ ఇన్‌ఫ్రా బిల్డర్‌పై కఠిన చర్యల్ని తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
This website uses cookies.