(కింగ్ జాన్సన్ కొయ్యడ)
హైదరాబాద్ వెలిగిపోతుంది.. న్యూయార్క్ అవుతుంది.. మన్‌హట్టన్‌గా మారుతుంది.. ప్రపంచ నగరంగా దూసుకెళుతోంది.. ఇలా రకరకాలుగా మాట్లాడేవారు.. ఒకసారి మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్లే రహదారిలోకి అడుగు పెడితే కానీ, వాస్తవమేంటో అర్థం కాదు. ఇక్కడి చిన్నారులు, ప్రజలు ప్రతిరోజు ట్రాఫిక్లో ఎంత నరకం అనుభవిస్తున్నారో ప్రత్యక్షంగా గమనించొచ్చు. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ, ఈ రోడ్డులో మాత్రం ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదిగంటల వరకూ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోతుంది.
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు ఏయే ప్రాంతాల్లో నివాసయోగ్యానికి అనుమతుల్ని మంజూరు చేయాలో స్పష్టమైన నిబంధనలు లేనట్లుగా కనిపిస్తోంది. ఎక్కడెక్కడ ఆకాశహర్మ్యాలకు అనుమతినివ్వాలో నిర్దిష్టమైన నిబంధనల్లేవు. ప్రస్తుతం మియాపూర్ నుంచి బాచుపల్లి రహదారిని భవిష్యత్తులో విస్తరిస్తారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని.. రాజకీయ ఒత్తిళ్ల మేరకు జీహెచ్ఎంసీ ఆకాశహర్మ్యాలకు అనుమతినిస్తోంది. దీని వల్ల గత ఏడాది నుంచి ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం స్కూళ్లకు వెళ్లే దాదాపు యాభైకి పైగా స్కూలు బస్సులు ఈ ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. దీంతో స్కూలు విద్యార్థులు గంటలతరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు.
మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రోడ్డును వెడల్పు చేయకుండా.. ఆకాశహర్మ్యాలకు అనుమతినివ్వడం వల్లే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షం వల్ల ఈ రోడ్డు మీద నీళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా, గంటల తరబడి వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇక్కడి చుట్టుపక్కల ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా, బయటికి వెళ్లేవారు ఇంట్లోకి వెళ్లకుండా నానా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్వయంగా రంగంలోకి దిగి.. దగ్గరుండి రోడ్డును పునరుద్ధరించే పనుల్ని పర్యవేక్షించారు. ఆతర్వాతే వాహనాలు ఈ రోడ్డు మీద తిరగడం ఆరంభమయ్యాయి. ఇక్కడి రోడ్డును విస్తరించకుండా.. ఆకాశహర్మ్యాలకు అనుమతిని మంజూరు చేయడం వల్లే రోజురోజుకీ ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. నిన్నటివరకూ సాఫీగా వెళ్లే స్కూలు బస్సులు ప్రతిరోజు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. గంటల తరబడి చిన్నారులు ట్రాఫిక్‌లోనే మగ్గిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇక, ఆఫీసుకెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులతో బాటు వివిధ ప్రాంతాల్లోని రోడ్లన్నీ ఇలాగే తయారయ్యాయి.
మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్లే రహదారి ప్రస్తుత విస్తీర్ణం ఎనభై అడుగులు. భవిష్యత్తులో 200 అడుగులు చేయాలన్నది ప్రణాళిక. ఉద్దేశ్యం మంచిదే.. కానీ, ఈలోపే మూడు వందల మీటర్ల దూరంలో దాదాపు ఐదు ఆకాశహర్మ్యాలకు అనుమతిని మంజూరు చేశారు. దీంతో ప్రజలు ప్రజలు ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతున్నారు. తాంబులిచ్చాం.. తన్నుకు చావండి అన్నట్లుగా జీహెచ్ఎంసీ వ్యవహారం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాచుపల్లి నుంచి ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేసేందుకు ఫ్లై ఓవర్ ను డెవలప్ చేసేందుకు ప్రణాళికల్ని రచిస్తున్న అధికారులు.. మియాపూర్ నుంచి బాచుపల్లిని అనుసంధానం చేస్తూ ఓ కొత్త ఫ్లై ఓవర్ ను నిర్మించాలి. ముందుగా, ఇరుకిరుగ్గా ఉన్న ప్రస్తుత రహదారిని వెడల్పు చేయాలి. ముఖ్యంగా వర్టెక్స్ విరాట్, ఆర్వీ సాయి వనమాలి, ఆర్వీ ధర్మిష్ఠ, క్యాండియర్ 40, నైలా వంటి ఆకాశహర్మ్యాలున్న రహదారి ప్రాంతాన్ని విస్తరించాలి. అప్పుడే ట్రాఫిక్ సమస్య తాత్కలికంగా కొంత తగ్గుతుంది. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ ను అంచనా వేసి.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. మియాపూర్ నుంచి బాచుపల్లి దాకా ఫ్లైఓవర్ వేసేందుకు తక్షణమే అనుమతిని మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
This website uses cookies.