(కింగ్ జాన్సన్ కొయ్యడ)
తెలివైన డెవలపర్లు ఏం చేస్తారంటే.. ఎక్కడైనా ఒక ప్రాజెక్టును ఆరంభించే ముందు, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో రేటెంత ఉందో పరిశీలిస్తారు. నిర్మాణం పూర్తయ్యేవరకూ ధర ఎంత పెరుగుతుందేమోనని ఆలోచిస్తారు. దీనికి తోడు.. అక్కడి స్థలం విలువ, నిర్మాణ ఖర్చు, అనుమతులకయ్యే ఫీజులు, మార్కెటింగ్ ఖర్చులు, పెరిగే నిర్మాణ వ్యయం, కొంత లాభాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఫ్లాట్ తుది రేటును ఖరారు చేస్తారు. కానీ, కొన్ని సార్లు కొందరు బిల్డర్లు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వాటిలో కొనేటప్పుడు ఒకట్రెండుసార్లు ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలి.
మదీనాగూడ ప్రాంతం.. పదేళ్ల క్రితంతో పోల్చితే ఇక్కడి ప్రధాన రహదారి మీద ప్రస్తుతం కొంత హడావిడి కనిపిస్తోంది. అనుకున్నంత కాకపోయినా, వాణిజ్యపరంగా మెరుగ్గానే అభివృద్ధి చెందింది. ఇక్కడి చుట్టుపక్కల ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నివాస ప్రాంతాల్లో ఫ్లాట్ల చదరపు అడుక్కీ రూ.4500 నుంచి రూ.5000 పలుకుతున్నాయి. మియాపూర్, చందానగర్లని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో.. చదరపు అడుక్కీ రూ.6000 చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థలు, వాటికున్న బ్రాండ్ విలువను బట్టి చదరపు అడుక్కీ మరో ఐదు వందలు అధికంగా వేసి అమ్ముతున్నారు. కానీ, ఇందుకు భిన్నంగా కొన్ని నిర్మాణ సంస్థలు చదరపు అడుక్కీ రూ.8500 నుంచి రూ.9000 మధ్యలో విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. సరైన ప్రాంతంలో సరైన రేటును నిర్ణయించకపోతే.. అక్కడి చుట్టుపక్కల మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ విషయం ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిరూపితమైంది.
ఎలాగో తెలుసా?
మదీనాగూడలో చదరపు అడుక్కీ రూ.8500 నుంచి రూ.9,000కు అమ్మడానికి ఎవరైనా ప్రయత్నిస్తే.. అక్కడి చుట్టుపక్కల బిల్డర్లకు గొప్ప అవకాశంగా పరిగణించాలి. వారి రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి, వీలైనంత త్వరగా అమ్ముకునే ప్రయత్నం చేయాలి. అంతేతప్ప బడా ప్రాజెక్టులో రేటెక్కువ చెబుతున్నారని.. తాము కూడా ధర పెంచుతామని అనుకోవద్దు. బడా బిల్డర్లు తొడ కోసుకుంటే..మనం మెడ కోసుకోవాలనే చందంగా కాకుండా.. డెవలపర్లు వాస్తవికంగా ఆలోచించాలి. రేటు పెంచితే కొనుగోలుదారులు కొంటారేమోనని అనుకోవద్దు. అలా ఆలోచిస్తే సకాలంలో ఫ్లాట్లు అమ్ముకోకుండా అడ్డంగా ఇరుక్కుపోతారు.
కొనుగోలుదారులూ చదరపు అడుక్కీ రూ.8,500 నుంచి 9,000 పెట్టి ఫ్లాట్లు కొనే ముందు ఆయా ప్రాజెక్టు ప్రత్యేకతలేమిటో అర్థం చేసుకోవాలి. స్పెసిఫికేషన్లు, ఎలివేషన్లు, ల్యాండ్ స్కేపింగ్, ఎమినిటీస్, ప్రాజెక్టు డిజైన్ వంటివన్నీ క్షుణ్నంగా గమనించాలి. అదే సమయంలో అక్కడి చుట్టుపక్కల ఉన్న ఇతర నిర్మాణాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి. ఈ ప్రాజెక్టులో కొనకపోతే తాను గొప్ప అవకాశం కోల్పోతానని భావించినప్పుడే.. అధిక రేటు పెట్టి కొనాలి. లేకపోతే, కాస్త దూరం వెళ్లి అయినా అంతకంటే మెరుగైన, చౌకైన ప్రాజెక్టులో ఫ్లాటు కొనుగోలు చేయడం ఉత్తమం.
This website uses cookies.