Categories: TOP STORIES

ఉప్ప‌ల్‌లో నిర్మాణాల జోరు..

ఉప్పల్ నుంచి భువనగిరి వరకు రియల్ ప్రాజెక్టులు

ఉప్పల్ పరిసరాల్లో స్థిర నివాసానికి మొగ్గు

60 లక్షల నుంచి 80 లక్షల వరకు ఇంటి ధరలు

చదరపు అడుగు 4 వేల నుంచి 7,500

ఉప్పల్.. ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతం. కానీ ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది చెందుతోంది. మెట్రో రాక, మెరుగైన మౌలిక వసతులు, ఐటీ హబ్ ఎర్పాటుతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో స్థిర నివాసానికి ఇష్టపడుతున్నారు చాలా మంది. అందుకు అనుగుణంగానే ఉప్పల్ నుంచి భువనగిరి వరకు అధిక శాతం నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంటి ధరలు కూడా ఉందుబాటులో ఉండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది.

ఐటీ సంస్థల్లో పని చేసే వారంతా ఇప్పటివరకు వెస్ట్ హైదరాబాద్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడేవారు. ఐటీ కార్యాల‌యాలకు దగ్గరగా ఉండటంతో పాటు, మౌలిక‌ వసతుల అభివృద్ది, అన్ని అందుబాటులో ఉండటంతో హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో ఇల్లు కొనేందుకు అంతా మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు ఐటీ ఉద్యోగుల దృక్పదంలో స్పష్టమైన మార్పు వచ్చింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు, హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చాక ఐటీ కారిడార్ కు దూరం తగ్గిపోయింది. ఇప్పుడు ఐటీ ఉద్యోగులు సైతం ఉప్పల్ నుంచి 15 కిలోమీటర్ల వరకు స్థిర నివాసానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, పోచారం, నారపల్లి, ఘ‌ట్ కేస‌ర్, భువనగిరి వరకు కొత్త నిర్మాణాలు విస్తరించాయి.

వెస్ట్ హైదరాబాద్లో ఇంటికి వెచ్చించే వ్యయంలో సగం ధరకే మరింత ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇల్లు ఇక్కడ లభిస్తుండటంతో ఐటీ ఉద్యోగులు ఉప్పల్ పరిసరి ప్రాంతాల్లో సొంతిల్లు కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి ఈ ప్రాంతమే అనువైందని భావిస్తున్నారు. ఇదివరకు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మహబూబ్ న‌గ‌ర్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పిల్లల చదువుల కోసం, ఉపాధిరీత్యా వలస వచ్చినవారు ఎక్కువగా నివసించేవారు. కానీ, ప్రస్తుతం మెట్రో రాకతో అన్నివర్గాల వారు ఇక్కడ స్థిర నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు ఉప్పల్ పరిసరాల్లో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుండడంతో గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు ఈ ప్రాంతంలో జోరందుకున్నాయి.

మెట్రో రైల్ రాక, ఔటర్ రింగ్ రోడ్డు, లింక్ రోడ్లు, నీళ్లు, కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధితో ఉప్పల్ పరిసరాల్లో నిర్మాణ ప్రాజెక్టులు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ ను నిర్మిస్తోంది. ఉప్పల్లో ఎన్ఎస్ఎల్ ఐటీ సెజ్, పోచారంలో రహేజా మైండ్ స్పేస్‌లో ఇన్ఫోసిస్ లాంటి సంస్థల ఐటీ కార్యాలయాలు ఉన్నాయి. దీందో ఇళ్ల‌కు డిమాండ్ పెరగడంతో స్థిరాస్తి ధరలు ఉప్పల్ పరిసర ప్రాంతంలో గత రెండు మూడేళ్లలో అనూహ్యంగా పెరిగాయి. ఇదివరకు ఉప్పల్ ప్రాంతంలో 25 లక్షలు నుంచి 40 లక్షల లోపు వచ్చే ఇళ్లు ఇప్పుడు 60 లక్షల నుంచి మొదలు 80 లక్షలకు పెరిగాయి. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు 4 వేల రూపాయల నుంచి మొదలు 7,500 రూపాయల వరకు పలుకుతోంది. అయినప్పటికీ అందరికి అందుబాటు ధరలో వ్యక్తిగత ఇళ్లు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు అన్నీ లభిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత అవృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్మాణదారులు అంటున్నారు.

ఉప్పల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి కన్ స్ట్రక్షన్స్ మెట్రో పోలిస్ పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులో 67 లక్షల రూపాయల నుంచి మొదలు ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఉప్పల్ కలాన్ లో ఉదయా హైట్స్ నిర్మిస్తున్న ఉదయ స్కైవర్ట్ అపార్ట్ మెంట్ ప్రాజెక్టులలో 74 లక్షలకు డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ విక్రయిస్తున్నారు. ఉప్పల్ సమీపంలోని పోచారంలో సహస్రా డెవలపర్స్ నిర్మిస్తున్న ఆనంద రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 75 లక్షలకు డబుల్ డెబ్రూం ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. పోచారంలోనే అశోకా బిల్డర్స్ ఇండియా నిర్మిస్తున్న ఏఎస్బీఎల్ స్ప్రింగ్స్ ప్రాజెక్టులో 60 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్ విక్రయిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం సమీపంలో శ్రీ ఆదిత్య నిర్మిస్తున్న ఓపెల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 71 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ కొనుగోలు చేయవచ్చు. బోడుప్పల్ సమీపంలో డీపీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న డీపీఆర్ ప్రద్యుమ్న లో 94 లక్షలకు 1590 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలా వందలాది నిర్మాణ సంస్థలు ఉప్పల్ నుంచి మొదలు భువనగిరి వరకు నివాస ప్రాజెక్టులు చేపట్టగా.. అందరికి అందుబాటు ధరల్లో ఇల్లు లభిస్తున్నాయి.

This website uses cookies.