తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే.. కార్నింగ్ ఇంక్ అనే సంస్థ తమిళనాడుకు వెళ్లిపోయింది. యాపిల్ గ్లాస్ తయారీ సంస్థ అయిన కార్నింగ్ ఇంక్ తెలంగాణ బదులు తమిళనాడులో వెయ్యి కోట్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు తాజాగా నిర్ణయం తీసుకుందని సమాచారం. ఫాక్స్ కాన్, పెగట్రాన్ వంటి యాపిల్ సరఫరాదారులకు చేరువగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కార్నింగ్ ఇంక్ తాజా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి, కార్నింగ్ ఇంక్ అనే సంస్థ ప్రతినిధులైన జాన్ బేన్, రవి కుమార్, సారా కార్ట్‌మెల్ తదితరులు 2023 సెప్టెంబరులో మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు గల అవకాశాల్ని చర్చించారు. అయితే, ఆ సంస్థ తెలంగాణలోనే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లుగా గత ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. తాజాగా, కార్నింగ్ ఇంక్ కంపెనీ తమిళనాడును ఎంచుకుంది.
ఫాక్స్‌కాన్ తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరి, ఆ తైవాన్ కంపెనీ ఇక్కడే ఏర్పాటవుతుందా? లేక తమిళనాడుకో ఇతర రాష్ట్రానికో తరలిపోతుందా అనే అంశం అతిత్వరలో తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా..ఏయే సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడుల్ని పెట్టేందుకు ఆసక్తి చూపించాయి? అందుకు సంబంధించిన పూర్తి డేటాను ఐటీ శాఖ అధికారుల్ని తీసుకోవాలి. కొత్త పరిశ్రమలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ఐటీ అధికారులతో తాజాగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
This website uses cookies.