Categories: TOP STORIES

మ‌న ఆకాశ‌హ‌ర్మ్యాలు ఎంత సేఫ్

  • బయ్యర్ల మూడ్‌కి తగ్గట్టుగా బిల్డర్ల నిర్మాణాలు
  • 40, 50, 60 అంటూ స్కే స్క్రేపర్ల నిర్మాణం
  • భూకంపాన్ని త‌ట్టుకుంటాయా?

కాళ్ల కింద భూమి కంపించింది. చూస్తుండగానే కళ్ల ముందు భారీ భవంతులు నిలువునా కుప్పకూలిపోయాయ్‌. ప్రకంపించిన భూమి- నిమిషాల వ్యవధిలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం మిగిల్చింది. రెండు దేశాలను వణికిపోయేలా చేసిన భూకంపం- ఆ విజువల్స్‌ చూసిన వారికి మ్యాన్‌ మేడ్‌ వండర్‌లా కనిపించే స్కై స్క్రేపర్లు ఎంత వరకు సేఫ్ అనే.. ఎన్నో భయాలు, ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తిస్తోంది. మయన్మార్‌- థాయ్‌లాండ్‌ తరహా భూకంపాలు హైద‌రాబాద్‌లో సంభవిస్తే పరిస్థితేంటి? ఇక్కడి భవనాలు తట్టుకోగలవా? మన బిల్డింగ్స్‌- స్కే స్క్రేపర్స్‌ ఎంత వ‌ర‌కూ స్ట్రాంగ్‌? బిల్డ‌ర్లు ఎన్‌బీసీ నిబంధ‌న‌ల్ని పాటిస్తూనే ఆకాశ‌హ‌ర్మ్యాల్ని పూర్తి నాణ్య‌త‌తో క‌డుతున్నారా? మార్కెట్ మెరుగ్గా లేద‌ని భ‌వ‌న నిర్మాణ సామ‌గ్రి ఎంపిక‌లో రాజీ ప‌డుతున్నారా?

మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భూకంపం ఎంతటి విధ్వంసం సృష్టించిందో సోష‌ల్ మీడియాలో చూశాం. పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షించే దేశం కావడంతో థాయ్‌లాండ్‌, బ్యాంకాక్‌ లాంటి చోట్ల హై రైజ్‌ బిల్డింగ్స్‌.. స్కై స్క్రేపర్‌ లగ్జరీ హోటల్స్‌ కామన్‌. అప్పటిదాకా ఎంతో గొప్పగా.. అద్భుతంగా కనిపించిన ఈ భారీ భవనాలు ఒక్క భూకంపం దెబ్బకు అందర్నీ ఆలోచనలో పడేశాయ్‌. ఎర్త్ క్వేక్‌ ఎఫెక్ట్‌తో కుదుపులకు లోనై అధిక శాతం భ‌వ‌నాల
స్ట్రక్చర్‌ దెబ్బతిన్న‌ది. ఇంకొన్ని అయితే నిర్మాణ ద‌శ‌లోనే పేక మేడల్లా కుప్ప కూలిపోయాయ్‌. స్ట్రక్చర్‌ పాడైపోయిన బిల్డింగ్‌లు వినియోగానికి పనికి వస్తాయా లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దెబ్బ తిన్న భవనాలని పరిశీలించాక పనికి రావని తేలితే వాటిని కూల్చేయాల్సిందే.

రెండోస్థానంలో ఉన్నాం
హైద్రాబాద్‌లో ఇప్పుడు ఎటు చూసినా హై రైజ్‌ బిల్డింగ్సే. స్కై స్క్రేపర్స్‌ నిర్మాణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాం. డెవలప్మెంట్‌ యాంగిల్‌లో ఇవన్నీ చెప్పుకోడానికి బానే ఉన్నా.. భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు సమాధానం దొరకాల్సిన ప్రశ్న. మరి హైద్రాబాద్‌లో ఉన్న భవనాలు ప్రకంపనల ధాటిని తట్టుకోగలవా..? అంటే ఇక్కడి నిర్మాణాలకు ఢోకా లేదంటున్నారు నిపుణులు. నగరంలోని అధిక శాతం ప్రాజెక్ట్‌లని ప్రమాదాలని తట్టుకునేలా నిర్మిస్తున్నారని.. స్ట్రక్చరల్‌ కోడ్స్‌, డిజైన్స్‌ను సిటీ ఎర్త్‌క్వేక్‌ ప్రొఫైల్‌ను అనుసరించి కఠినంగా పాటించారని.. అందువల్ల నగరంలో భవనాలు భద్రంగా ఉంటాయంటున్నారు. అలాగే పెద్ద డెవలపర్లు, బిల్డర్లు భూప్రకంపన జోన్‌కు అవసరమైన ప్రమాణాలకు మించి సేఫ్టీ స్టాండర్డ్స్‌ను పాటిస్తూ కన్‌స్ట్రక్షన్స్‌ చేస్తున్నారని.. మున్సిపల్‌ అథార్టీస్‌ ఈ మోడల్స్‌ను కచ్చితంగా పరిశీలించి.. నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా..? లేదా కఠినంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. సాధారణంగా బహుళ అంతస్థుల భవనాల్ని భూకంపాలు తట్టుకునే విధంగానే నిర్మిస్తారు. ప్రకంపనల ధాటికి భూమి షేక్‌ అయినా కదలకుండా స్ట్రక్చర్‌ ఉండేలా జాగ్రత్తపడ్తారు బిల్డర్లు. అయితే అది ఒక పాయింట్‌ వరకే. రిక్టర్‌ స్కేల్‌పై ఏడు, ఎనిమిది పాయింట్లు దాటి తీవ్రస్థాయిలో భారీ భూకంపాలు వస్తే మాత్రం ఎలాంటి స్ట్రక్చర్‌ అయినా నిలబడటం మాత్రం కష్టమే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

మ‌న‌కు భ‌యం లేదు

తెలంగాణకు భూకంపాల భయం లేదు. దక్కన్‌ పీఠభూమిలో సముద్రానికి ఎత్తులో ఉంది కాబట్టి భాగ్యనగర ప్రజలు కూడా నిర్భయంగా ఉండొచ్చంటున్నారు సైంటిస్ట్‌లు. అలాగని పూర్తిగా సేఫ్‌జోన్‌లో ఉన్నామని ధైర్యంగా కూడా ఉండలేని పరిస్థితి. జనాభా విస్పోటనం, భారీ ప్రాజెక్ట్‌లతో భూకంపాల ఎఫెక్ట్‌ తప్పకుండా ఉంటుందనే అభిప్రాయాలే ఇందుకు కారణం. పైగా భద్రతా విషయాల్ని పరిశీలించాల్సిన టౌన్‌ ప్లానింగ్‌, ఫైర్‌ సేఫ్టీ అధికారులు అవినీతిలో మునిగి తేలుతూ ఇష్టమొచ్చినట్టు పర్మిషన్స్‌ ఇచ్చేస్తున్నారనే ఆరోపణలున్నాయ్‌. అందుకే ఎన్‌బీసీ నిబంధనలు పాటిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. బ్యాంకాక్‌లో హై రైజ్‌ బిల్డింగ్స్‌ షేక్‌ అయిన విజువల్స్‌ చూసి ఇక్కడి బయ్యర్లు తమ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారు.

    • భూకంప జోన్లని మార్చనున్న కేంద్రం
    • త్వరలో కొత్త లిస్ట్‌..!
    • దేశంలో ప్రస్తుతం ఐదు భూకంప జోన్లు
    • ఆరుకి పెరగనున్న జోన్ల సంఖ్య
    • మరి తెలంగాణ ఏ జోన్‌లో ఉంది..?
    • హైద్రాబాద్‌లో భూకంపం వచ్చే అవకాశాలున్నాయా..?
    • వస్తే బహుళ అంతస్థుల భవనాలు తట్టుకోగలవా..?
    • హైద్రాబాద్‌ బిల్డర్లు, డెవలపర్లు ఎన్‌బీసీని ఫాలో అవుతున్నారా..?
    • నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ నిబంధనల ప్రకారమే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారా..?

త్వ‌ర‌లో ఆరు జోన్లు..

మన దేశంలో ప్రస్తుతం ఐదు భూకంప జోన్లు ఉండగా.. వాటి సంఖ్య త్వరలో ఆరుకి పెరగనుంది. 1962లో దేశంలో తొలిసారి ఐదు జోన్లను ఏర్పాటు చేసింది జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా. ఆ తర్వాత 1970, 1984ల్లో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌- బీఐఎస్‌ కొన్ని మార్పులు చేసి జోన్ల పరిధిలోని ప్రాంతాలను మార్చింది. 2002లో ఐఎస్‌ 1893:2002 పేరుతో వాటిని అభివృద్ధి చేశారు. అయితే భూమి లోపలి ఫలకాల కదలికలో వేగం పెరుగుతూ ఎన్నో మార్పులు చేసుకుంటుండటంతో భూభౌతిక శాస్త్రవేత్తలు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఎక్స్‌పర్ట్స్‌, భూకంపాల పరిశోధకులు, బీఐఎస్‌ అధికారులతో కొత్త జోన్ల ఏర్పాటుకు కేంద్రం ఓ కమిటీని వేసింది. వీరు ప్రస్తుతమున్న 5 జోన్లని ఆరుగా మార్చాలని నిర్ణయించారు.

రిక్టర్‌ స్కేల్‌పై 7 పాయింట్ల తీవ్రతతో భూమి కంపిస్తే జోన్‌-ఫైవ్‌గా, 6 నుంచి 7 రేంజ్‌లో వస్తే జోన్‌- ఫోర్‌గా, 5 తీవ్రతతో వస్తే జోన్‌- త్రీగా, 1 నుంచి 4 మధ్య తీవ్రతతో భూకంపం వచ్చే ఛాన్స్‌ ఉంటే దాన్ని జోన్‌- టూగా పరిగణిస్తారు. జోన్‌ ఫైవ్‌ అత్యంత భూకంప ప్రభావమున్న ప్రాంతం కాగా.. జోన్‌ టూలో సాధారణంగా భూకంపాలు రావు. కొత్త స్టాండర్డ్స్‌లోనూ ఒక్క భద్రాచలం మినహా మిగిలిన తెలంగాణ అంతా జోన్‌ టూ కిందే ఉంది. అంటే ఇక్కడ భూకంపాల ప్రభావం లేదని అర్థం. హైద్రాబాద్‌ కూడా సేఫే. అలాగని ఫ్యూచర్‌లో ప్రకంపనలు రావన్న గ్యారంటీ కూడా లేదంటున్నారు. అంతెందుకు గతేడాది డిసెంబర్‌లో ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిన భూకంప ప్రభావం హైద్రాబాద్‌లోనూ కనిపించింది. ఇక బ్యాంకాంక్‌లో వచ్చిన ఎర్త్‌క్వేక్‌కి హై రైజ్‌ బిల్డింగ్స్‌ మీద ఎఫెక్ట్‌ పడటంతో అనేక ప్రశ్నలు వస్తున్నాయ్‌. పైగా హైద్రాబాద్‌లో లగ్జరీ ఫెసిలిటీస్‌తో రాబోతున్న అప్‌ కమింగ్‌ స్కై స్క్రేపర్లన్నింటిలో అత్యంత ఎత్తులో క్లబ్‌హౌస్‌లు, టవర్స్‌ను కలిపేలా స్పెషల్‌ వాకింగ్‌ ట్రాక్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌ ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. కోకాపేటలో నిర్మిస్తోన్న దాదాపు ప్రతి ప్రాజెక్ట్‌ పైనా ఇలాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయ్‌. వీటినే తమ అపార్ట్‌మెంట్స్‌లో స్పెషల్‌ ఫీచర్స్‌గానూ ప్రమోట్‌ చేసుకుంటున్నాయి కంపెనీలు.
హైద్రాబాద్‌లో హై రైజ్‌ బిల్డింగ్స్‌ డిజైన్లపై బయ్యర్లలో కొత్తగా భయాలు ఏర్పడటానికి ప్రభుత్వ విభాగాలు.. అధికారుల తీరు కూడా ఓ కారణం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలోని అనేక విభాగాల్లో అధికారులు అవినీతి, లంచాలకి మరిగి ఇష్టమొచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌, ఫైర్‌ సేఫ్టీ అధికారులైతే బిల్డింగ్స్‌లో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయ్‌..? ప్లానింగ్‌ ప్రకారమే భవనాల్ని నిర్మిస్తున్నారా..? నిబంధనలు అతిక్రమిస్తున్నారా లాంటివి నామామాత్రంగా కూడా తనిఖీ చేయకుండా గాలికి వదిలేస్తున్నారు. కమీషన్లు, వాటాలు ఇస్తే చాలు డెవలపర్లకు అనుకూలంగా విచ్చలవిడిగా అనుమతులిచ్చేస్తున్నారు. రీసెంట్‌గా నగరంలో కొన్ని ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోవడం, కుంగిపోవడం, ఒరిగిపోవడం లాంటి సంఘటనలు అధికారుల అవినీతికి అద్దం పట్టేవే. కాబట్టి హై రైజ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్‌, ఇళ్లను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవడం మంచిదంటూ బయ్యర్లకు సూచిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- దేశంలో పట్టణాలు, గ్రామాల్లో అధిక శాతం ఇళ్ల గోడలు- ఇటుకలు, రాళ్లతో నిర్మించినవే. కాంక్రీట్‌, స్టీల్‌ నిర్మాణాలతో పోల్చితే భూకంపాలు వచ్చినప్పుడు ఈ తరహా ఇళ్లతో జరిగే ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. దీనికి పరిష్కారంగా భవన నిర్మాణాల్లో కరెక్ట్‌ టెక్నిక్స్‌ వాడితే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.
భాగ్యనగరం జోన్‌ టూలో ఉన్నప్పటికీ హైద్రాబాద్‌ చుట్టుపక్కల పెద్ద ఎత్తున హై రైజ్‌ బిల్డింగ్స్‌ నిర్మాణం జరుగుతోంది. కాబట్టి ఈ ఆకాశహర్మ్యాలను జోన్‌ త్రీ ప్రాంతాలకు నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారం నిర్మించడం మంచిదంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. అలాగే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌- బీఐఎస్‌ నిర్దిష్ట విధి విధానాలు జారీ చేసింది. ఐఎస్‌-1893 కోడ్‌ ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు చేయాలని సూచించింది బీఐఎస్‌. దీని ప్రకారం- భవన నిర్మాణ మెటీరియల్‌, స్ట్రక్చర్‌ వంటి విషయాల్లో ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. ఈ కోడ్‌ను ఉపయోగించి నాణ్యతా ప్రమాణాలు పాటించే భవనాలకు భూకంపాలు వచ్చినా దెబ్బ తినడం.. కూలిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయ్‌.
  • భవన పునాదిలో వేసే పిల్లర్ల ఎత్తు.. మిగిలిన భవనంలోనూ అదే ఎత్తులో ఉండాలి.
  • బేస్‌మెంట్‌ ఎత్తుకు తగ్గట్టు మిగిలిన అంతస్థుల ఎత్తు ఉండాలి.
  • భవనాల ఆకృతి ఒకే వరస క్రమంలో సాగాలి. అంటే అడుగు భాగంలో చిన్నగా ఉండటం.. పైకి వెళ్లే కొద్దీ పెద్దగా మారడం.. పై భాగంలో చిన్నగా ఉండి అడుగు భాగంలో పునాదులు వెడల్పుగా ఉండటం లాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి.
  • భవనాల పిల్లర్లు పునాది నుంచి.. పై అంతస్థు వరకు ఉండాలి. మధ్యలో వంపు రాకూడదు.
  • ఇప్పటికే నిర్మించిన భవనాలకు రెట్రో ఫిట్టింగ్‌ సాయంతో స్ట్రక్చర్‌లో స్వల్ప మార్పులు చేసి భూకంపాలు తట్టుకునేలా చేయొచ్చు. దీనికి సంబంధించి ట్రిపుల్‌ ఐటీ ప్రత్యేక టెక్నాలజీని సైతం డెవలప్‌ చేసింది. అయితే ఇలా 3 అంతస్థుల వరకు మాత్రమే చేసే అవకాశముంది.
  • రెట్రో ఫిట్టింగ్‌లో భాగంగా ఇప్పటికే ఉన్న భవనాలకు మరమ్మత్తులు చేసి వాటి పటిష్ఠత, జీవితకాలాన్ని పెంచుతారు.
  • ఈ విధానంలో భవనం లేదా ఇంటి గోడలకు పై భాగంలోని గోడలకు లోపలా- బయటా చుట్టూ సిమెంట్‌ తొలగిస్తారు.
  • సిమెంట్‌ స్థానంలో మెష్‌ను అమర్చి మళ్లీ ప్లాస్టరింగ్‌ చేస్తారు. తలుపులు, కిటికీలకు కూడా ఇదే విధానం అనుసరిస్తారు.
  • ఈ మెష్‌ ప్లాస్టరింగ్‌ వల్ల భూకంపాలు వచ్చినప్పుడు భవన గోడల్లో కదలికలు తగ్గి భవనం కూలిపోకుండా ఉంటుంది.
  • ఇళ్లకు రెట్రో ఫిట్టింగ్‌ చేయాలంటే నిర్మాణ వ్యయంలో 30 శాతం వెచ్చిస్తే సరిపోతుంది.
జోన్‌ టూలో ఉన్నప్పటికీ.. నిపుణుల అంచనాల ప్రకారం- జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ లాంటి ప్రాంతాలు చిన్నపాటి ప్రకంపనలకు గురయ్యే అవకాశముంది. రిక్టర్‌ స్కేల్‌పై 6 తీవ్రతతో ఎర్త్‌క్వేక్‌ వస్తే.. భూకంప కేంద్రానికి 15 కిలోమీటర్ల వరకు గోడలు కూలి.. భవనాలకు పగుళ్లు ఏర్పడవచ్చు. బోర్ల కోసం 1500 నుంచి 2 వేల అడుగులు తవ్వేస్తుండటం కూడా భూకంపాలు రావడానికి అవకాశముందని చెప్పడానికి మరో కారణం. ఒకవేళ నగరంలో భారీ భూకంపం వస్తే పరుగెత్తి ప్రాణాలు దక్కించుకోడానికి దగ్గర్లో పెద్ద మైదానాల్లాంటివి కూడా లేవు. ఇరుకు గల్లీలు, అగ్గిపెట్టెల్ని తలపించే ఇళ్లతో ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించే అవకాశాలున్నాయ్‌. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. భవన నిర్మాణాల్లో కచ్చితంగా సేఫ్టీ మెథడ్స్‌ పాటించాలని.. జోన్ త్రీ ప్రమాణాలతో ఇళ్లు కట్టుకోవాలని సూచిస్తున్నారు.

This website uses cookies.