హైదరాబాద్‌తో పాటు పలు ఇతర పట్టణాల్లో రిజిస్ట్రేషన్ కోసం వెళ్లినందుకే పది మంది కంటే అధిక సంఖ్యలో బిల్డర్లకు కరోనా సోకింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. వీరు కొవిడ్ బారిన పడ్డారు. అయితే, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే వారందరికీ కరోనా వస్తుందని కచ్చితంగా చెప్పలేం. కానీ, రిజిస్ట్రేషన్లకు వెళ్లినప్పుడు ప్రతిఒక్క బిల్డర్ తప్పనిసరిగా పూర్తి స్థాయి జాగ్రత్తల్ని తీసుకోవాలి.
ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపడంతో బాటు మధ్యాహ్నం ఒంటి గంట దాకా లాక్ డౌన్ మినహాయింపును ఇవ్వడంతో తెలంగాణ రియల్ రంగం రిజిస్ట్రేషన్ల మీద దృష్టి పెట్టింది. గత కొంతకాలం నుంచి పెండింగులో ఉన్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను బిల్డర్లు, రియల్టర్లు వేగవంతం చేశారు. దీంతో వీరికి కొంత నగదు చేతికొచ్చే వెసులుబాటు ఏర్పడింది.
నిర్మాణాల్ని చేసే క్రమంలో రకరకాల పనుల నిమిత్తం డెవలపర్లు కంట్రాక్టర్లకు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అసలే కరోనా సమయంలో పని చేయడానికి కార్మికులు ముందుకు రాని పరిస్థితి. ఇక, వారికి సకాలంలో సొమ్ము చెల్లించకపోతే సైటు దగ్గరకి వచ్చే ప్రసక్తే ఉండదు. అందుకే, కొందరు బిల్డర్లు వీరికి ఎక్కువ పేమెంట్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు షురూ కావడం వల్ల కొంత ఆర్థిక స్వేచ్ఛ లభించింది.
రిజిస్ట్రేషన్లకు వెళ్లేటప్పుడు బిల్డర్లు, స్థలయజమానులు, కొనుగోలుదారులు ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ముఖ్యంగా, భూముల్ని రిజిస్టర్ చేసేటప్పుడు ఎక్కువ మంది గూమికూడకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాల్లో భూమి విస్తీర్ణం తక్కువే ఉన్నప్పటికీ, వాటికి యజమానులు ఎక్కువుంటారు. ఇక తప్పదన్నట్లు, వీరంతా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాల్సిందే. ఇలాంటప్పుడు డబుల్ మాస్క్ ధరించడం, వీలైతే ఫేస్ షీల్డ్ పెట్టుకోవడం, శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం వంటివి చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని, ప్రతిఒక్కరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
This website uses cookies.