అబు దాబి నుంచి కింగ్ జాన్సన్ కొయ్యడ
భారతదేశంలోని నిర్మాణ రంగానికి దిక్సూచీగా వ్యవహరిస్తున్న క్రెడాయ్ నేషనల్.. మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 13 వేల మందికి పైగా క్రెడాయ్ డెవలపర్లు 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అబుదాబీలోని యాస్ ఐల్యాండ్ లో శుక్రవారం ప్రారంభమైన న్యాట్ కాన్ 2022 ఇందుకు వేదికైంది. దాదాపు మూడేళ్ల విరామం క్రెడాయ్ నేషనల్ నిర్వహిస్తున్న ఈ న్యాట్ కాన్ కు 1200కి పైగా డెవలపర్లు, 1300 మందికిపైగా డెలిగేట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2050 నాటికి వంద శాతం కార్బన్ న్యూట్రల్ గా మారడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అందరూ పేర్కొన్నారు. 2030 నాటికి 25 శాతం కర్బన ఉద్గారాలు తగ్గించే దిశగా కృషి చేయడంతోపాటు 2050 నాటికి మొత్తం కార్బన్ న్యూట్రాలిటీ పాటించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడే విషయంలో ఓ బలమైన పునాది వేసిన తొలి రియల్టీ పరిశ్రమగా క్రెడాయ్ నేషనల్ అవతరించింది.
దేశంలో రియల్ పరిశ్రమ అభివృద్ధికి హెచ్డీఎఫ్ సీతో కలసి పలు చర్యలు ప్రకటించింది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలను 3 బిలియన్ డాలర్ల నిధులతో మరింత అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న, ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ లలో రాబోయే రెండేళ్లలో వంద మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి వెంచర్ క్యాటలిస్ట్, నియోవన్ కలిసి స్పైర్ వీసీ ప్రాప్ టెక్ ఫండ్ ఏర్పాటు చేశాయి.
ఇక సాంకేతికతను స్వీకరించే అంశాన్ని మరింత వేగవంతం చేయడానికి, కొనుగోలుదారులకు మరింత చక్కని అనుభవం కలిగించడానికి వీలుగా ‘క్రైడవర్స్’ని క్రెడాయ్ ప్రారంభించనుంది. దేశ నిర్మాతలుగా తమ పాత్ర అటు ప్రజలకు, ఇటు భూమికి సమానంగా దోహదపడుతుందని భావిస్తున్నట్టు క్రెడాయ్ అధ్యక్షుడు హర్షవర్థన్ పటోడియా పేర్కొన్నారు. గ్రీన్ రియల్ ఎస్టేట్ అవసరాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిన నేపథ్యంలో పరిశ్రమ పెద్దగా రీసైక్లింగ్ ద్వారా వ్యర్థాలను తగ్గించడానికి, పునర్వినియోగం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తామని వివరించారు. భారతదేశం ఓ స్టార్టప్ హబ్ అని, చాలా కొత్త స్టార్టప్ ల ప్రపంచ సమస్యలు వేగంగా, ప్రతిభావంతంగా పరిష్కారాలు కనుగొంటున్నాయని క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ బోమన్ ఇరానీ పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత పెరిగిన డిమాండ్ కారణంగా ఈ ఏడాది రియల్ ఎస్టేట్ కు అత్యత్తమ సంవత్సరంగా మారిందని క్రెడాయ్ చైర్మన్ సతీశ్ మగర్ తెలిపారు.