poulomi avante poulomi avante

క్రెడాయ్ నాట్‌కాన్ @ సిడ్నీ గ్రాండ్ స‌క్సెస్‌..

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌, 9030034591)

మధ్యమధ్యలో స్పీడ్‌ బ్రేక్‌లు పడుతున్నా.. హర్డిల్స్ దాటుతూ ఉరుకులు పెడుతుంది ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌. ఈ పరుగు సాగేదే కానీ ఆగేది కాదన్నారు నాట్‌కాన్ 22వ‌ ఎడిషన్‌లో పాల్గొన్న రియల్‌ ఎస్టేట్‌ పయనీర్స్‌. సెప్టెంబర్‌ 23 నుంచి 26 వరకు 3 రోజులు జరిగిన క్రెడాయ్ నాట్‌కాన్‌ 2024- కేవలం రియాల్టీ సెక్టార్‌లో జరుగుతున్న మార్పులపై చర్చకు మాత్రమే పరిమితం కాలేదు. దూరదృష్టి, అభివృద్ధి, సాంకేతికత మరీ ముఖ్యంగా ఏఐ వంటి ఫ్యూచర్ టెక్నాలజీ వల్ల కన్‌స్ట్రక్షన్ రంగంలో ఫ్యూచర్‌లో వచ్చే మార్పులు వివరిస్తూ జరిగిన డిస్కషన్స్‌ ఈవెంట్‌కే హైలెట్ అని చెప్పొచ్చు.

ఇక రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజాల ఉపన్యాసాలతో పాటు రియాల్టీ సెక్టార్‌కు సంబంధించి కేంద్ర మంత్రి సలహాలు.. సినీ నటీ విద్యాబాల‌న్ పంచుకొన్న అనుభవాలు.. ఆర్గనైజేషన్స్‌ మధ్య జరిగిన ఒప్పందాలతో ఎంతో అట్టహాసంగా సాగింది నాట్‌కాన్‌ 2024. ఈవెంట్ హైలెట్స్‌తో పాటు.. హోస్టింగ్‌ సిటీ సిడ్నీ స్పెషాల్టీస్‌ గురించి రియల్‌ ఎస్టేట్‌ గురు అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ స్టోరీ మీకోసం..

సిల్వర్ జూబ్లీ ఇయర్‌. సిడ్నీ వేదికగా నాట్‌కాన్‌ ట్వంటీ సెకండ్ ఎడిషన్‌. తమ‌కు ఎంతో స్పెషలైన ట్వంటీ ఫిఫ్త్ ఇయర్‌లో గుర్తుండిపోయేలా నాట్‌కాన్‌ లేటెస్ట్‌ ఎడిషన్‌ను డిజైన్‌ చేసి అంతే గ్రాండ్‌గా ఆర్గనైజ్‌ చేసింది క్రెడాయ్‌. నాట్‌కాన్‌ 2024 వేడుకకు ఆస్ట్రేలియా.. తమ సంస్కృతి సంప్రదాయాలతో ఈవెంట్‌కు హజరైన డెలిగేట్స్, గెస్ట్‌లకు ఘనస్వాగతం పలికింది.

సిడ్నీలోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా జరిగిన నాట్‌కాన్‌ 2024 ఈవెంట్‌లో గవర్నమెంట్‌ అఫిషియల్స్‌ స్పీచ్‌లు, ఇంటర్నేషనల్‌ డెలిగేట్స్‌, డెవలపర్స్‌, ఆర్కిటెక్ట్స్‌, ఫైనాన్స్‌-బ్యాంకింగ్ సెక్టార్‌కు చెందిన లీడర్స్‌, ఇన్వెస్టర్లు, టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సలహాలు, సూచనలు. రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌కు చెందిన దిగ్గజాల కీలక ప్రసంగాలు, ప్యానెల్ డిస్కషన్స్‌, ఇన్నోవేటివ్ వర్క్‌షాప్స్‌, ఎగ్జిబిషన్స్‌- ఇలా 3 రోజులు జరిగింది ఈ వేడుక.

ఆరంభం అదుర్స్

రియల్‌ ఎస్టేట్‌ అంటే కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు. రియాల్టీ రంగం అంటే దూరదృష్టి, అభివృద్ధి, సహాయ సహాకారాలు కూడా. నాట్‌కాన్‌ ట్వంటీ టూ ఎడిషన్‌లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. భవిష్యత్‌లో నిర్మాణ రంగంలో ఎన్ని క్రియేటివ్ మార్పులు జరగనున్నాయో.. వాటిని అందిపుచ్చుకుని కస్టమర్లకు ఎలాంటి సర్వీస్‌లు అందించాలనే విషయంపై చర్చలు జరిగాయ్‌. ఇక మొదటి రోజు సదస్సు విషయానికొస్తే- న్యాట్‌కాన్‌ 2024 ఓపెనింగ్ సెర్మనీ ఎగ్జిబిషన్‌ హాల్‌ గ్రాండ్‌ ఓపెనింగ్‌తో ప్రారంభమైంది.

ప్రపంచ రియాల్టీ రంగంలో భారత రియల్‌ ఎస్టేట్‌ ఇండస్ట్రీ భవిష్యత్‌పై అవగాహన వచ్చేందుకు నాట్‌కాన్‌ 2024 ఈవెంట్ ఉపయోగపడుతుందన్నారు క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ. ప్యాండమిక్‌ ప్రపంచగతిని మార్చేసిందని.. కొత్త ఆలోచన విధానాలను, వ్యూహాలను మనం అడాప్ట్‌ చేసుకున్నామని.. భారత్‌లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో రెగ్యులేటరీ సంస్కరణల్లో కనివీని ఎరుగని మార్పును చూశామన్నారాయన. ఈ మార్పులు మన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు నాణ్యాత రాజీపడని తత్వం మన రియాల్టీ రంగం బెంచ్‌మార్క్‌ సెట్‌ చేయడానికి దోహదం చేసిందన్నారు. మొదటి సెషన్‌లో ప్రముఖ ఆర్థికవేత్త నీల్‌కంఠ్‌ మిశ్రా అంతర్జాతీయ భారత స్థూల ఆర్థిక వ్యవస్థ ధోరణులపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

క్రెడాయ్‌ లీడర్స్‌ పాఠశాల పేరుతో జరిగిన రెండో సెషన్‌లో క్రెడాయ్‌ పూర్వ అధ్యక్షులు, ఛైర్మన్లు ప్రసగించారు. అర్థవంతమైన ఉత్పాదక విధానాలతో వ్యాపారాన్ని మార్చుకోవడం ఎలా అనే టాపిక్‌పై జోహో స్కూల్స్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ రాజేంద్రన్‌ దండపాణి మాట్లాడారు. రియల్ ఎస్టేట్‌ రంగం భవిష్యత్‌ ఎలా ఉండనుంది..? ఫ్యూచర్‌లో ఎలాంటి మార్పులు జరగనున్నాయ్‌..? వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలియజేస్తూ పవర్‌ఫుల్‌ కీ నోట్స్‌ నుంచి డైనమిక్ డిస్కషన్స్‌ వరకు ఎంతో ఇన్ఫర్మేటివ్‌గా సాగింది డే వన్‌ షెడ్యూల్‌ అంతా. ఇక ఇండియాలోని వివిధ నగరాలకు చెందిన ఛాప్టర్ల నుంచి 11 వందల మందికి పైగా డెవలపర్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ అనుభవాలు పంచుకొన్నారు.

భార‌త్ వైపు చూపు..

రెండో రోజు ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కేంద్ర వాణిజ్య- పారిశ్రామిక మంత్రి పీయూష్ గోయల్‌. ఎంపవరింగ్‌ ఇండియా- వికసిత భారత్‌ 2047 అంశంపై ప్రసంగించిన పీయూష్‌.. ప్రపంచమంతా భారత్‌ వైపు చూసేలా దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. న్యూయార్క్‌, లండన్‌ పాత నగరాలు అని.. ఆ సిటీస్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేయాలంటే ఇండియా సహాకారం తీసుకునే స్థాయికి మనం ఎదగాలని ఆకాంక్షించారాయన.

నిర్మాణ రంగానికి అవసరమయ్యే నిధుల కోసం ఆర్‌బీఐతో చర్చిస్తానని తెలిపారు. సిడ్నీలో జరిగిన నాట్‌కాన్‌ 2024 రెండో రోజు ఈవెంట్‌కు చీఫ్‌గెస్ట్‌గా అటెండైన కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ చాలా విషయాలే ప్రస్తావించారు. క్రెడాయ్‌ పాతికేళ్ల జర్నీ ఎక్సలెంట్‌. ఈ 25 ఏళ్లలో ఎన్నో విజయాలు.. ఇంకెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని క్రెడాయ్‌ స్ట్రాంగ్‌గా నిలబడిందని సంస్థను అభినందించారాయన. సిడ్నీలో జరిగిన ఈ ఈవెంట్లో చీఫ్‌ గెస్ట్‌గా పార్టిసిపేట్ ఆనందంగా ఉందన్న కేంద్రమంత్రి- 2047 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న వికసిత భారత్ సాధనకు రియల్‌ ఎస్టేట్ రంగం వెన్నెముక లాంటిదని వ్యాఖ్యానించారు.

2010లో తాను ఇల్లు కొన్నానని.. ఫుల్ ఫర్నిషింగ్ అవడానికి రెండేళ్లు పడితే.. మరో ఐదేళ్ల తర్వాత కానీ తాను కొన్న ఇంట్లోకి అడుగుపెట్టలేకపోయానని కానీ రెరా వచ్చాక మొత్తం సీన్‌ మారిపోయిందని తన స్వీయానుభవాలని వెల్లడించారు. రెరా ఈ రంగంలోని మోసగాళ్లకు చెక్‌ పెట్టిందని.. నిబద్ధత, నిజాయితీ గల డెవలపర్లు మాత్రమే మిగిలారని మెచ్చుకొన్నారు. ఢిల్లీలో భారతమండపం, యశస్వి భూమి అనే రెండు అతిపెద్ద వరల్డ్ క్లాస్‌ ఎగ్జిబిషన్ సెంటర్స్‌ కన్‌స్ట్రక్ట్‌ అవుతున్నాయని చెప్పిన పీయూష్‌.. దాదాపు లక్ష స్క్వేర్‌ మీటర్ల విస్తీర్ణంలో లగ్జరీ ఫెసిలిటీస్‌తో వీటిని నిర్మిస్తున్నామన్నారు.

రియల్ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న రుణ లభ్యత సమస్యలను కూడా పీయూష్‌ గోయల్ ప్రస్తావించారు. ఈ ప్రాబ్లమ్స్‌ను ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారాయన. రియల్ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లకు వేగంగా అనుమతులిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీలతో మాట్లాడతానని.. రెరా చట్టం రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలో పారదర్శకతను తీసుకొచ్చిందని.. జాతి నిర్మాణ అవసరాలు, ఉపాధి కల్పన, జీడీపీలో పన్నుల వాటా పరంగా.. ఇలా ప్రత్యక్ష్యంగా పరోక్షంగా రియల్ ఎస్టేట్‌ గొప్ప పాత్ర పోషిస్తుందని మంత్రి మెచ్చుకున్నారు. ఈ పరిశ్రమలో దాదాపు 7 కోట్ల మంది కార్మికులున్నారని.. వారికి ఈఎస్ఐ, ఈపీఎఫ్‌ లాంటి సదుపాయాలు కల్పిస్తే భారతదేశంలో నిర్మాణ రంగం క్రెడిబులిటీ పెరుగుతుందన్నారు.

స్మార్ట్‌సిటీల నుండి స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పన వరకు రియాల్టీ సెక్టార్‌ విస్తరించిందని.. భారతదేశం మరింత బలంగా ఎదగడానికి సాధికారత సాధించడానికి రియల్‌ ఎస్టేట్‌ రంగమే పునాది అన్నారు. ఉపాధి హామీలో దేశ నిర్మాణంలోనూ రియల్‌ ఎస్టేట్‌ రంగం కీ రోల్ ప్లే చేస్తుందని అదే సమయంలో మన దేశంలో నిర్మాణ రంగంలో ఇంకా పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారని.. వాటి నుంచి బయటికొచ్చి కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లోనూ టెక్నాలజీ వినియోగాన్ని పెంచుకోవాలని.. స్కిల్స్‌, టాలెంట్‌, మ్యాన్ పవర్‌, టెక్నాలజీ మన దగ్గర కావాల్సినంత అందుబాటులో ఉందని వాటిని తెలివిగా వాడుకోవాలని రియల్ ఎస్టేట్‌ రంగ నిపుణులకి సూచించారు.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలు సహా చాలా నగరాల్లో ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే నిర్మాణ పనులు కొనసాగుతుండటం వల్ల పొల్యూషన్‌ విపరీతంగా పెరిగిపోయి పర్యావరణం దెబ్బతింటుందని పీయూష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి మనం కూడా యూరప్‌, అమెరికా, సింగపూర్‌, దుబాయ్‌, ఆస్ట్రేలియా తరహాలో కన్‌స్ట్రక్షన్‌లో స్టీల్ వాడకాన్ని పెంచాలన్నారు. దీనివల్ల నిర్మాణ రంగంలో ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని సూచించారు. దేశంలో కొన్ని ప్రధాన నగరాలను ఎంపిక చేసుకుని ఇలాంటి నిర్మాణాలు చేపడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని సలహా ఇచ్చారు. మూడు నాలుగేళ్లలో నిర్మాణం పూర్తయ్యేలా హై క్వాలిటీ ఎక్విప్‌మెంట్ మేకింగ్‌కు డెవలపర్స్‌ ప్రపోజల్స్ తయారు చేసుకుని వస్తే తాము సహకరిస్తామని.. రియాల్టీ సెక్టార్‌కు ఊరటనిచ్చే విధంగా డ్యూటీ రేట్స్‌ తగ్గించడానికి సిద్ధమన్నారు.

స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌..

ఇక రీల్‌ టూ రియల్ సెషన్‌లో మాట్లాడిన విద్యాబాలన్‌ ఇంటి వెదుకులాట కష్టాలు చెప్పుకొచ్చారు. డ్రీమ్‌ హౌస్‌ కోరిక నెరవేర్చడంలో రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌ కీ రోల్‌ ప్లే చేస్తుందన్నారు విద్యా బాల‌న్‌. మరోవైపు- తన సొంత ఇంటి కల ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు నటి విద్యాబాలన్‌. ఇప్పటివరకు 25 ఇళ్లు వెదికామని.. తన అభిరుచికి తగ్గ ఇల్లు మాత్రం దొరకలేదని.. దీంతో చేసేదేమిలేక అద్దె ఇంట్లో ఉంటున్నామని చెప్పారామె. న్యాట్‌కాన్‌ 2024 రీల్‌ టూ రియల్ సెషన్‌లో మాట్లాడిన విద్యా- టేస్ట్‌కు తగ్గ ఇల్లు దొరకాలంటే అదృష్టం ఉండాలన్నారు. తల్లిదండ్రులతో సొంత ఇంట్లో పెరిగిన తాను.. పెళ్లైన తర్వాత ఇప్పటికీ రెంట్‌ హౌస్‌లోనే ఉంటున్నానని అన్ని వసతులు ఉన్న ఇల్లు అస్సలు దొరకడం లేదన్నారు.

ఆస్ట్రేలియా స్పెషాలిటీ..

ఒక్కో ఎడిషన్‌ ఒక్కో దేశంలో. అలా ఈ సారి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం. మరి రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌కు సంబంధించిన కార్యక్రమానికి అతిథ్యమిచ్చిన సిడ్నీ నగరంలోని మౌలిక సదుపాయాలు.. కంగారుల దేశం రియల్‌ ఎస్టేట్‌ విధానాల గురించి మాట్లాడుకోకపోతే ఎలా..? 2047 నాటికి ఇండియన్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ 10 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్‌ చేయడం గ్యారంటీ అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి మన నిర్మాణ రంగం ప్రపంచస్థాయి పనితనాన్ని అందిపుచ్చుకోగలదా..? భారీ టన్నెల్స్‌, విశాలమైన రోడ్లు, ఎత్తైన స్కై స్ర్కాపర్స్‌ ఇలా అడుగడుగునా ఆధునికత ప్రతిబింబించే సిడ్నీ నగరం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు..! ఆస్ట్రేలియా ఆర్కిటెక్చర్‌ మన నెటివిటీకి సూట్‌ అవుతుందా..?

రోజు రోజుకు ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కంప్లీట్ అయిన కొత్త ప్రాజెక్ట్‌లు వెంటనే సేల్‌ అయిపోతున్నాయే తప్ప ఇన్వెంటరీలు లేవంటున్నారు రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌. కొత్త లాంఛ్‌లు తక్కువగా ఉండటం వల్ల రియాల్టీ సెక్టార్ స్లో అయినట్టు కనిపిస్తుందని.. వాస్తవానికి డిమాండ్‌ మరింత పెరిగిందన్నారు క్రెడాయ్‌ నేషనల్‌ ఛైర్మన్‌ మనోజ్‌ గౌర్‌. క్రెడిబిలిటీ ఉన్న డెవలపర్స్ నిర్మిస్తున్న రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్స్‌కు డిమాండ్‌ బాగా ఉందని.. లోకేషన్‌ బట్టి బడ్జెట్‌ కాస్త ఎక్కువైనా కస్టమర్లు వెనకాడటం లేదని మనోజ్‌ తెలిపారు. ప్రెస్టీజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ క్రెడాయ్‌ మాజీ అధ్యక్షుడు ఇర్ఫాన్ రజాక్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. రియాల్టీ సెక్టార్‌లో డిమాండ్ ఎవర్‌గ్రీన్‌ అని.. లోకేషన్‌, ప్రైస్‌ అనుకూలంగా ఉంటే వెంటనే సేల్ అయిపోతున్నాయని ఇన్వెంటరీలు ఉండటం లేదన్నారు.

సీఐఐ ఐజీబీసీతో ఒప్పందం

ఇదే ఈవెంట్‌లో సీఐఐ ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్ కౌన్సిల్‌- క్రెడాయ్‌ గతంలో తమ మధ్య జరిగిన ఒప్పందాన్ని పునరుద్ధరించాయ్‌. భారతదేశంలో గ్రీన్‌ అండ్ నెట్ జీరో బిల్డింగ్‌కు సంబంధించి మరో మూడేళ్లు కలిసి పనిచేయాలని సీఐఐ- ఐజీబీసీ, క్రెడాయ్‌ ఎంవోయూ కుదుర్చుకున్న‌ది. ఒప్పందంలో భాగంగా ఈ రెండు సంస్థలు తమ సభ్యులు చేపట్టే ప్రాజెక్ట్‌ల నిర్మాణాల్లో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడంలో మద్దతు ఇవ్వడంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ తమ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీస్‌ను అందిపుచ్చుకునేలా ప్రొత్సాహించనున్నాయ్‌.

కొల్లియ‌ర్స్ రిపోర్టు.

2047 నాటికి భారత రియల్‌ ఎస్టేట్ మార్కెట్‌ 10 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్‌ చేస్తుందని కొల్లియర్స్‌- క్రెడాయ్‌ రిపోర్ట్‌ తెలిపింది. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌, డిజిటలైజేషన్‌, జనాభా వృద్ధి, స్థిరత్వం, పెట్టుబడుల్లో వైవిధ్యం అన్నీ కలిసి భారత రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని రిపోర్ట్ వెల్లడించింది. 10 ట్రిలియన్ల మార్కెట్‌ అంటే భారత జీడీపీలో దాదాపు 14 నుంచి 20 శాతం వాటా రియాల్టీ సెక్టార్‌దే మరి.

ఆర్క్ గ్రూప్ ఎండీ ఏమ‌న్నారంటే..

సిడ్నీలో వాకింగ్‌ ట్రాక్స్‌, సైకిల్ ట్రాక్స్‌ చాలా అద్భుతంగా ఉంటాయంటున్నారు ఆర్క్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అండ్ ఎండీ గుమ్మి రాంరెడ్డి. అండర్ టన్నెల్స్‌.. హైవేల మీద ఇటు రెసిడెన్షియల్‌ బిల్డింగ్స్‌తో పాటు అటు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు కూడా ఉంటాయ్‌. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్ కన్‌స్ట్రక్షన్‌ సిడ్నీలో ఎక్సలెంట్‌గా ఉంటుందంటున్నారు. హైద్రాబాద్‌లోనూ భారీ నిర్మాణాలు పెరిగిపోయాయని అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మన దగ్గర అసలే ట్రాఫిక్‌ కష్టాలు ఎక్కువని.. ఈ సమస్య భవిష్యత్‌లో మరింత పెరుగుతుందని కాబట్టి సిడ్నీని ఆదర్శంగా తీసుకుని ప్లానింగ్ చేసుకోవాలన్నారు.

ఆర్‌వీ నిర్మాణ్ ఎండీ..

ఇక సిడ్నీ నగరాన్ని చూసి మనం చాలానే నేర్చుకోవచ్చంటున్నారు ఆర్‌వీ నిర్మాణ్‌ గ్రూప్‌ ఎండీ రామచంద్రారెడ్డి. సిడ్నీలో ట్రాఫిక్‌ ఇష్యూ ఉండదు. చాలా వెల్‌ప్లాన్డ్‌గా రోడ్ల నిర్మాణం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ ముఖ్యంగా మెట్రో సిస్టమ్‌ అద్భుతమంటున్నారాయన. మెట్రో ట్రాక్‌ కింద అండర్‌గ్రౌండ్‌లో మరో మెట్రో ట్రాక్‌ ఏర్పాటు ఉంటుందని.. ఇలాంటి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ హైద్రాబాద్‌ లాంటి నగరాల్లో చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మన దగ్గర కూడా సిడ్నీ లాంటి నగరాలను చూడొచ్చన్నారు. సిడ్నీ నగరం నుంచి మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఇదేనని ఆర్‌వీ నిర్మాణ్ గ్రూప్ ఎండీ రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.

భారత్‌లో పోల్చితే ఆస్ట్రేలియా విస్తీర్ణంపరంగా చాలా పెద్దది. జనాభా సంఖ్య తక్కువ. అయినప్పటికీ భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ దేశ నిర్మాణ రంగం ప్లానింగ్ ఉంది. అందుకే అక్కడి వసతులు, సదుపాయాలు అన్నీ అంత గొప్పగా కనిపిస్తాయ్‌. మన దేశం విస్తీర్ణం తక్కువ జనాభా ఎక్కువ. అందుకే మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరిపోవు. అయినప్పటికీ ఇక నుంచైనా నిర్మాణ రంగంలో ప్రపంచస్థాయి ఆలోచనలు అందుకోని అందుకు తగ్గట్టు కన్‌స్ట్రక్షన్‌ చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. ఇక ఒక్కటి మాత్రం క్లియర్‌. ఇప్పటివరకు జరిగిన న్యాట్‌కాన్‌లతో పొల్చితే సిడ్నీలో జరిగిన 22వ ఎడిషన్‌ ఇన్నోవేటివ్‌ అండ్ ఇన్ఫర్మేటివ్‌లో నెక్ట్స్‌ లెవల్‌ అనే చెప్పాలి. సిడ్నీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన న్యాట్‌కాన్‌ 2024 కేవలం ఒక ఈవెంట్‌ మాత్రమే కాదు. రియల్ ఎస్టేట్‌ రంగాన్ని మరింత అగ్రెసివ్‌గా ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన ఉత్సాహాన్నిందించే ఒక బూస్టింగ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles