poulomi avante poulomi avante

ప్రశ్నార్ధకంగా హైదరాబాద్ కొత్త మాస్టర్ ప్లాన్?

నూతన మాస్టర్ ప్లాన్ సిద్దం చేసిన గత బీఆర్ఎస్ సర్కార్

141 మునిసిపాలిటీలు, కార్పోరేషన్లతో మాస్టర్ ప్లాన్

మాస్టర్ ప్లాన్ లోకి 111 జీవో లోని 84 గ్రామాలు

కొత్త మాస్టర్ ప్లాన్ పై దృష్టి పెట్టని రేవంత్ సర్కార్

హైదరాబాద్ నూతన మాస్టర్ ప్లాన్ ప్రశ్నార్ధకంగా మారింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలోపెట్టుకుని గత బీఆర్ఎస్ సర్కార్ కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించగా.. అది కార్యరూపం దాల్చలేదు. కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ నూతన మాస్టర్ ప్లాన్ పై పెదవి విప్పడం లేదు. కనీసం కొత్త మాస్టర్ ప్లాన్ పై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి చెప్పడం లేదు. ఇదే సమయంలో రేవంత్ సర్కార్ ఫ్యూచర్ సిటీ ప్రకటన చేయడంతో హైదరాబాద్ కొత్త మాస్టర్ ప్లాన్ ఉంటుందా? లేదా అన్న సందిగ్దం సర్వత్రా నెలకొంది.

విశ్వనగరం హైదరాబాద్ విస్తరణపై సందిగ్దత‌ నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మహా నగరాన్ని అభివృద్ది చేయడంతో పాటు సిటీనీ విస్తరించేలా ప్రణాళికల్ని సిద్దం చేసింది. ఈ మేరకు భాగ్యనగరానికి సరికొత్త మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయాల్సిన ఆవశ్యతను గత కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. 2012–13లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ఇప్పటి హైదరాబాద్‌ విస్తరణకు ఏమాత్రం సరిపోవటం లేదని గుర్తించిన బీఆర్ఎస్ సర్కార్.. ఆ మేరకు రానున్న 25 నుంచి 30 ఏళ్ల హైదరాబాద్‌ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించే పనిని..

అంతర్జాతీయ కన్సల్టెన్సీలకు అప్పగించింది. సుమారు రెండేళ్ల పాటు కసరత్తు చేశాక హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగరం.. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను దాదాపు సిద్దం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.

హైదరాబాద్ నూతన మాస్టర్ ప్లాన్ లోకి మొత్తం 114 మునిసిపాలిటీలు, కార్పోరేషన్లను తీసుకువచ్చేలా ప్లాన్ చేసింది గత బీఆర్ఎస్ సర్కార్. ఇప్పుడున్న హైదరాబాద్ తో పాటు ప్రభుత్వం ఉపసంహరించుకున్న ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని 84 గ్రామాలు సైతం కొత్త మాస్టర్ ప్లాన్ లో భాగం చేయాలని భావించింది. అంటే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ లో కొత్తగా 1 లక్షా 32 వేల ఎకరాల భూములు వచ్చి చేరేలా ప్రణాళికలు సిద్దం చేశారు.

సుమారు 135 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని ప్రాంతం హైదరాబాద్ నూతన మాస్టర్ ప్లాన్ లోకి చేరితే విశ్వ నగరం మరింత అభివృద్ది చెందనుందని భావించారు. గత మాస్టర్ ప్లాన్ లో దొర్లిన తప్పులను సరిదిద్దుకుని, పక్కా ప్రణాళికతో హైదరాబాద్ సమగ్ర ప్రణాళిక రూపుదిద్దేలా చర్యలు తీసుకుంది కేసీఆర్ సర్కార్.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, పర్యావరణహితంగా సిద్దమైన హైదరాబాద్ నూతన మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే భాగ్య నగర రూపురేఖలు మారిపోతాయని అంతా భావించారు. కొత్త మాస్టర్ ప్లాన్ తో నగరవాసుల జీవనప్రమాణాలు పెరగడంతో పాటు.. పచ్చదనంతో పెరగడంతో పాటు, కాలుష్యరహిత వాతావరణం, ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయని ఆశించారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డుకు, రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్య నివాస, వాణిజ్య, పారిశ్రామిక క్లస్టర్స్ ఏర్పాటు చేసి.. శాటిలైట్ టౌన్ షిప్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్దం చేశారు అధికారులు.

కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే అందరికి వారి వారి బడ్జెట్ కు అనుగునంగా ఇళ్లు కూడా అందుబాటులోకి వస్తాయని రియల్ రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. గత సంవత్సరం 2023 మార్చి వరకు హైదరాబాద్ నూతన మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావించినా.. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు ముందుకొచ్చాయి. గత యేడాదిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవ్వడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ పెండింగ్ లో పడింది.

గత యేడాది డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నూతన మాస్టర్ ప్లాన్ పై ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు చేసిన మాస్టర్ ప్లాన్ పై కనీసం సమీక్ష జరపలేదు. ఇదే సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు ధీటుగా ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పాటు అక్కడ వివిధ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేస్తున్నారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ సహా ఐటీ, విద్య, వైద్య, పర్యాటక, వాణిజ్య, వినోద కేంద్రంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేసేలా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ రూపొందించిన హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ పై మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం లేదు. దీంతో అసలు హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ పై రేవంత్ సర్కార్ వైఖరేంటో తెలియక రియల్ రంగ వర్గాలతో పాటు సామాన్య జనం సైతం సందిగ్దంలో పడ్డారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles