-
- క్రెడాయ్ తెలంగాణ సెక్రటరీ జనరల్
- కె.ఇంద్రసేనారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ
వ్యవసాయం, ఐటీ, ఫార్మా, విద్యా, వైద్యం, పౌరవిమానయానం.. ఇలా ప్రతి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని క్రెడాయ్ తెలంగాణ సెక్రటరీ జనరల్ ఇంద్రసేనారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. దినదినాభివృద్ధి చెందుతోన్నఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకోవడానికి పరుగులు పెడుతోందన్నారు. కళ్ల ముందే అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుంటే.. ఎక్కడ్లేని సంతోషం వేస్తుందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల చూపు హైదరాబాద్ మీద పడేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు. నగరంలో ప్రప్రథమంగా క్రెడాయ్ స్టేట్‌కాన్ నిర్వహిస్తున్న సందర్భంగా.. ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేక ఇంటర్వ్యూనిచ్చారు.
పదేళ్ల క్రితంతో పోల్చితే.. ప్రస్తుతం నిర్మాణ రంగంలో ఎలాంటి మార్పులొచ్చాయి?
పదేళ్ల క్రితం.. సమైక్య రాష్ట్రంలో.. గలగల పారే నదులు పక్కన మలమల మాడిన తెలంగాణ మనది. రుతుపనవాల కోసం రైతన్నలు ఎదురు చూసేవారు. దాహం వేసిన తర్వాత బావి తవ్వడం ఆరంభిస్తే నీరు అందేలోపు మరణించడం ఖాయమనే విషయం పట్టించుకోలేదు. అయితే, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లతో బాటు కాస్త కృష్ణా నది నీరుతో ఈ హైదరాబాద్ ప్రజల దాహాన్ని భవిష్యత్తులో ఎలా తీర్చాలో తెలియని పాలకులు సమైక్య రాష్ట్రంలో ఉండేవారు. 1200 నుంచి 2000 ఫీట్లు బోర్లు తవ్వినా నీళ్లు పడతాయో లేదోననే సందేహముండేది. అంతెందుకు, బండ్లగూడలో ఒక ఎకరా స్థలంలో పది, పన్నెండు బోర్లు వేస్తే.. ఎందులో నుంచి నీరు వస్తుందో తెలియని పరిస్థితి. బోర్ల నుంచి వచ్చే నీళ్లు క్యూరింగ్‌కి అయినా సరిపోతుందో.. లేదోననే.. సందేహాలు చుట్టిముట్టిన సమయమది. నీళ్లు సరిగ్గా పడక అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. 125 ఫ్లాట్ల ప్రాజెక్టును నిర్మించేందుకు అవసరమయ్యే క్యూరింగ్ కోసం ఒక్క ఏడాదిలోనే 25 లక్షల్ని కేవలం బోర్ల కోసం ఖర్చు పెట్టిన రోజులవి. కానీ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే.. నిండిన చెరువులు, చెక్ డ్యాములు, పారే నదులు, పెరిగిన భూగర్భజలాలు.. ఎక్కడ చూసినా సస్యశామలంగా కనిపిస్తోంది. రుతుపనవాలు బాగుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. దాన్ని మీదే భారతదేశ ఆర్థిక ప్రగతి ఆధారపడుతుందనే విషయం తెలిసిందే. కానీ, నేడో.. రుతు పనవాలు ఆలస్యమైనా పంటలు వేసేందుకు ఆలస్యం కాకుండా సహాయం చేసే నీటిపారుదల వ్యవస్థ ఉండటం తెలంగాణ రాష్ట్రానికి కలిసొచ్చే అంశం.
తెలంగాణ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా?
ఆర్థికంగా, సాంకేతికంగా, రాజకీయంగా, సామాజికంగానే కాకుండా పర్యావరణంతో పాటు శాంతిభద్రతల పరంగా మెరుగ్గా ఉన్న రాష్ట్రం మనది. కేవలం వ్యవసాయమే కాదు.. ఫార్మా, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైసెస్, ఎయిరోస్పేస్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, ఆగ్రో కెమికల్ వంటి రంగాల అభివృద్ధిలో తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతున్నది. అదేవిధంగా, రియల్ ఎస్టేట్ రంగం కూడా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తోంది. నైపుణ్యం లేని, పాక్షిక నైపుణ్యం గల వాళ్లకు నిర్మాణ రంగం బోలెడు అవకాశాల్ని కల్పిస్తోంది. మెటీరియల్ సప్లయ్ చేసేవారు, ఇంజినీర్లు, ప్లానింగ్ ఇంజినీర్లు, క్వాలిటీ ఇంజినీర్లు, సైట్ సూపర్ వైజర్లు, పేయింట్ కంట్రాక్టర్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, టైల్ లేయర్లు, షట్టరింగ్ కంట్రాక్టర్లు, ఆర్ఎంసీసీ యూనిట్లు.. ఇవి కాకుండా 250 పరిశ్రమల వల్ల నిర్మాణ రంగం వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తోంది.
కరోనా ప్రభావం ఐటీ రంగం మీద పడిందా? ఇక్కడ ఉద్యోగాలు ఏమైనా తగ్గాయా?
సమైక్య రాష్ట్రంలో ప్రతి పది ఉద్యోగాలకు ఒక జాబ్ మన రాష్ట్రం వాళ్లకు వచ్చేది. ఇప్పుడు మూడు నాలుగు ఉద్యోగాలు మనకొస్తున్నాయి. ఐటీ ఎగుమతుల్లో చూస్తే.. 2013లో రూ.50వేల కోట్లుంటే ఇప్పుడు రూ.1.50 లక్షల కోట్లు. అంటే మూడింతలు పెరిగింది. ఏ నగరమైనా సురక్షితమా.. కాదా అనే విషయాన్ని ముందుగా చూస్తారు. దాని ఆధారంగానే అక్కడకు వలసలు పెరుగుతాయి. భారతదేశంలో ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో సగం మన దగ్గరే ఉన్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఎంత బాగుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో 2021లో ఒక్క అమెరికా నుంచే 80.4 బిలియన్ డాలర్లు రెమిటెన్స్ చేశారు. సింహ భాగం హైదరాబాద్ కే వచ్చింది. అందులోనూ ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ దే.
నిర్మాణ రంగానికి హైదరాబాద్‌లో గిరాకీ పడిపోయిందా?
ప్రస్తుతం కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరం 2030 నాటికి 1.4 కోట్లు కాబోతోంది. అంటే వచ్చే ఎనిమిదేళ్లలో 40 శాతం జనాభా హైదరాబాద్ లో పెరగబోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద మిలియన్ జనాభాకు ఇళ్లు లేవు. అలాగే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతివారానికి పది లక్షల ముంది పుడుతుంటే అదే సంఖ్యలో జనం రూరల్ ఏరియాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నారు. అంటే పట్టణీకరణ అంత వేగంగా జరుగుతోంది. 2017లో హైదరాబాద్ లో 5.20 లక్షల ఇళ్లు అవసరం ఉంటే.. అందుబాటులో ఉన్నవి కేవలం పావు వంతు మాత్రమే. భారత ఆర్థిక వ్యవస్థ కూడా వచ్చే ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్ డాలర్లకు చేరబోతోందని అంచనా. ప్రస్తుతం విపరీతంగా కొత్త కోటీశ్వరులను చూసే సమయం ఇది. ఇలాంటి సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మన అందరి అదృష్టంగా భావిస్తున్నా. రాబోయే పదేళ్లు స్వర్ణయుగం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే, యూడీఎస్, ప్రీలాంచులు తెలంగాణ నిర్మాణ రంగాన్ని సర్వనాశం చేస్తుంది కదా? మరి, మీరెందుకు కఠిన చర్యల్ని తీసుకోవడం లేదు?
ఇంత మంచి భవిష్యత్తు ఉన్న ఈ నగరాన్ని యూడీఎస్ అని, అక్రమ లేఔట్లు అని మార్కెట్ ను మనంతట మనం పాడుచేస్తే తప్ప పాడుకాని ఇండస్ట్రీ ఇది. ఈ నేపథ్యంలో ఇలాంటివాటిని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. యూడీఎస్ విషయంలో ఎందుకంత త్వరగా చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇది కంట్లో పడిన నలుసు వంటిది. దానిని జాగ్రత్తగా తీయకపోతే ఆ కన్నుకే డ్యామేజీ జరిగే పరిస్థితి తలెత్తుతుంది. కన్ను పోకుండా దానిని తీయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దలతోపాటు ప్రభుత్వం కూడా అవే ప్రయత్నాల్లో ఉంది. తొందర్లోనే దీని నుంచి బయటపడతాం.
అధిక రెస్పాన్స్..
క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో క్రెడాయ్ స్టేట్ కాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాం. మేం ఊహించిన దానికంటే ఎక్కువ డెలిగేట్లు విచ్చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఇలాంటి కార్యక్రమాలు ఇతర మెట్రో నగరాల్లోనే ఎక్కువగా జరుగుతాయి. తెలంగాణలో ప్రప్రథమంగా జరుగుతున్న ఈ స్టేట్‌కాన్ వల్ల తెలంగాణలోని బిల్డర్లందరికీ నాలెడ్జ్ షేర్ అవుతుంది. డెవలపర్ల మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఆ రోజు స్టేజీ మీద కొత్త క్రెడాయ్ చాప్టర్ల ఇంట్రడక్షన్ ఉంటుంది. పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఎస్వోపీ పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఆతర్వాత ఐటీ శాఖ ఉన్నతాధికారి జయేష్ రంజన్ తెలంగాణలో ఐటీ రంగం, భవిష్యత్తు అభివృద్ధి గురించి ప్రత్యేకంగా వివరిస్తారు.
– పాండురంగారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ
అట్టహాసంగా.. అద్భుతంగా..
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పద్నాలుగు ఛాప్టర్లు ఉన్నాయి. ఇందులో 900 కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉన్నారు. నిర్మాణ రంగంలో వస్తోన్న కొత్త టెక్నాలజీ గురించి బిల్డర్లకు అవగాహన పెరుగుతుంది. నిర్మాణ రంగంలోకి ప్రవేశించే ఒక బిల్డరు.. ప్రాజెక్టు ఆరంభం నుంచి పూర్తయ్యేవరకూ అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన అనుమతులకు సంబంధించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ప్రప్రథమంగా విడుదల చేస్తున్నాం. ప్రతిరెండేళ్లకొకసారి నిర్వహించే క్రియేట్ అవార్డుల కార్యక్రమాన్ని ఈసారి అట్టహాసంగా ప్లాన్ చేశాం.
– మధుసూదన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ
సరికొత్త ఎనర్జీ..
క్రెడాయ్ స్టేట్‌కాన్ వల్ల తెలంగాణ నిర్మాణ రంగానికి ఎంతో ఉపయోగకరం అని చెప్పొచ్చు. ప్రధానంగా బిల్డర్లందరకీ అక్కరకొచ్చే జాతీయ స్థాయి కార్యక్రమం ఇది. డెవలపర్ కమ్యూనిటీలో నెలకొన్న అనేక సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశమిది. టీఎస్ బీపాస్, ధరణీ, రెరాకు సంబంధించి కొత్త విషయాల్ని తెలుసుకోవచ్చు. అనుమతులు త్వరగా మంజూరు అవ్వడానికి పాటించాల్సిన విధివిధానాలేంటో అర్థమవుతుంది. ఆయా విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల.. తమ సమస్యల్ని వారికి విన్నవించే వీలు దొరుకుతుంది. మొత్తం రాష్ట్ర రియల్ రంగంలో నెలకొన్న కొత్త పోకడల గురించి తెలుసుకోవచ్చు. అసలు మార్కెట్ ఎక్కడికి వెళుతుంది? ఏయే ప్రాంతాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి వంటివి అర్థమవుతుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ విచ్చేసి, ఇక్కడి మార్కెట్ పోకడల గురించి ఇట్టే తెలుస్తుంది. ఇక్కడ చూసి కొత్త అంశాలు నేర్చుకుంటే.. సరికొత్త ఎనర్జీ వస్తుంది.
– అజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ
బిల్డర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ
బిల్డర్ ఎవరైనా స్థానిక మార్కెట్ అవసరాలు.. తన అభిరుచి మేరకే అపార్టుమెంట్లను డిజైన్ చేస్తారు. అయితే, అవి కొనుగోలుదారులకు ఏ స్థాయిలో నచ్చాయి? పరిశ్రమలో ఆయా నిర్మాణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి? వంటి విషయాలు తెలియాలంటే ఎవరో ఒకరు ప్రత్యేకంగా చెప్పి అభినందిస్తేనే అర్థమవుతుంది. ఆయా డెవలపర్‌కి ప్రోత్సాహం లభిస్తుంది. అందుకే, మేం రెండేళ్లకోసారి ప్రత్యేకంగా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి క్రియేట్ అవార్డ్స్ అని నామకరణం చేశాం. దీని ద్వారా మా డెవలపర్లలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది. ఈసారి అవార్డు రాని బిల్డర్లు వచ్చేసారి అయినా అవార్డులొచ్చేలా ప్రయత్నిస్తారు. ఇందుకోసం నాణ్యమైన నిర్మాణాల్ని చేపడతారు. స్టేట్‌కాన్ కార్యక్రమంలో కొత్త టెక్నాలజీల గురించి అప్‌డేట్ అవుతాం. పెద్ద డెవలపర్ల నుంచి ఔత్సాహిక డెవలపర్లకు స్ఫూర్తి లభిస్తుంది.
– జగన్మోహన్, వైస్ ప్రెసిడెంట్- క్రెడాయ్ తెలంగాణ