- యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్టుల్లో
- ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయించొద్దు
- కంపెనీ నిర్మించకపోతే మీకే ఇబ్బంది!
- ఫ్లాట్లు కట్టడం అంత సులువు కాదు
- రెరా ప్రాజెక్టుల్లోనే మీరు విక్రయించాలి!
- ఎలాంటి సమస్య వచ్చినా రెరాదే బాధ్యత
- ఏజెంట్లూ.. ఎంతో జాగ్రత్తగా ఉండాలి!
50 లక్షల ఫ్లాట్ 20 లక్షలకే ఇస్తామని చెబుతున్నారు.. ఇంతకు మించిన బంపర్ ఆఫర్ లేదు.. తెలిసిన వాళ్లతో కొనిపిస్తే ఉత్తమం.. వాళ్లకు మంచి ఫ్లాట్ కొనిపించినట్లు ఉంటుంది. కమిషన్ కూడా ఎక్కువే వస్తుంది..
ఇలా ఆలోచించి మీకు తెలిసినవారికి మేలు చేద్దామని అనుకుంటున్నారా? అదే మీ మెడకు ఉరి తాడు అయ్యే అవకాశముంది. ఇలాగే చాలామంది ఏజెంట్లు తమకు నచ్చినవారితో ఫ్లాట్లను కొనిపిస్తున్నారు. వినడానికిది మంచిగానే ఉన్నప్పటికీ, ఫ్లాట్లు కట్టడం అంత సులువేం కాదని గుర్తుంచుకోవాలి. లేఅవుట్ డెవలప్ చేసినంత సులువుగా అపార్టుమెంట్లను కట్టలేరు. పునాదుల దగ్గర్నుంచి గృహప్రవేశం అయ్యేంత వరకూ.. ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేయడమో యజ్ఞం వంటిదని గుర్తుంచుకోవాలి. ప్లాట్లను అమ్మే రియల్టర్లు ఈ పనిని అంత పకడ్బందీగా చేస్తారని అనుకోవడం కరెక్టు కాదు. ఎందుకంటే స్థానిక సంస్థ, రెరా నుంచి అనుమతి తీసుకుని.. స్ట్రక్చరల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్టు, ఇతర నిపుణుల్ని సంప్రదించి.. వారి పర్యవేక్షణలో నిర్మాణ పనుల్ని చేపట్టడం అంత ఆషామాషీ విషయమేం కాదు. పైగా, అపార్టుమెంట్ కట్టిన తర్వాత ఐదేళ్ల దాకా అందులో ఎలాంటి నిర్వహణపరమైన సమస్యలు వచ్చినా.. పైపులు కారినా.. లీకేజీ వచ్చినా.. బిల్డరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అపార్టుమెంట్ కట్టిన తర్వాత బిల్డర్ వెళ్లిపోతే.. అందులో నివసించేవారు మిమ్మల్ని తిట్టుకుంటారు. అనవసరంగా చెత్త ఫ్లాట్ కొనపిచ్చాడంటూ శాపనార్థాలు పెడతారు. కాబట్టి, ఇలాంటి ఇబ్బందులు వద్దనుకునేవారు.. రెరా అనుమతి లేకుండా.. యూడీఎస్, ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించొద్దు. రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనిపిస్తే.. ఆతర్వాత ఎలాంటి సమస్యలొచ్చినా రెరాయే చూసుకుంటుంది.
కొందరిలో అత్యాశ..
కొనుగోలుదారులకు మంచి ప్లాట్లు, ఫ్లాట్లను అందజేసే ఏజెంట్లు రియల్ రంగంలో చాలామంది ఉన్నారు. వీరు ఓ పద్ధతి ప్రకారం తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తూ.. భవిష్యత్తులో ఉపయోగపడే ప్లాట్లను బయ్యర్లతో కొనిపిస్తారు. అధిక శాతం మంది.. దీర్ఘకాలంలో ప్రజలకు అక్కరకొచ్చేలా సేవల్ని అందిస్తున్నారు. కాకపోతే, ఈమధ్య కొందరు ఏజెంట్లలో అత్యాశ పెరిగింది. తక్కువ సమయంలో అధిక సొమ్మును ఆర్జించాలనే దురాశ అధికమైంది. అందుకే, ప్రభుత్వ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ.. రెరా అనుమతి లేని ప్రాజెక్టుల్లో.. ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి వారందరిని గుర్తించే పనిలో పడిన తెలంగాణ రెరా అథారిటీ.. వీరికి నోటీసుల్ని పంపిస్తున్నది. తెలంగాణ రెరా అథారిటీ నిబంధనల ప్రకారం..
- రెరా అనుమతి గల ప్రాజెక్టుల్ని మాత్రమే విక్రయించాలి.
- రెరా నెంబరున్న ఏజెంట్లే ప్లాట్లు, ఫ్లాట్లను అమ్మాలి.
- రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో.. రెరా నెంబరు లేని ఏజెంట్లు విక్రయించకూడదు.
- రెరా అనుమతి గల ఏజెంటు.. రెరా అనుమతి లేని ప్రాజెక్టులో అమ్మకూడదు.
కాబట్టి, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. వీలైనంత వరకూ రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో.. ఆయా ఏజెంట్ల వద్దనే కొనాలి. అప్పుడే కొనుగోలుదారుల సొమ్ముకు పూర్తి భరోసా ఉంటుంది. నిర్మాణ సంఘాలూ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల్ని రూపొందించుకోవాలి. రెరా నెంబరు గల ఏజెంట్లతోనే లావాదేవీలను నిర్వహించాలని సంఘ సభ్యులకు తెలియజేయాలి.
ఏజెంట్లకు నోటీసులు?
హైదరాబాద్ శివార్లలో దాదాపు వందకు పైగా రియల్ సంస్థలు ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తోందని తెలంగాణ రెరా అథారిటీ సమాచారాన్ని అందుకున్నది. వీరిలో ఏజెంట్లను గుర్తించే పనిలో పడింది. కొన్ని ప్రాజెక్టుల్లో ఏజెంట్లు ఫ్లాట్లను కొనిపించిన తర్వాత అవి ఆరంభం కాలేదు. దీంతో, అధిక శాతం మంది రెరా అథారిటీని సంప్రదించారు. వారి నుంచి వివరాల్ని సేకరించిన అనంతరం ఏజెంట్లకు నోటీసుల్ని పంపే పనిలో రెరా నిమగ్నమైంది.