ఎలివేటర్లు, ఎస్కలేటర్ల విభాగంలో
40 ఏళ్లగా భారత్ లో సేవలు
అతిపెద్ద, వేగవంతమైన ఎలివేటర్లు మావే
రియల్ ఎస్టేట్ గురుతో కోనే ఎలివేటర్
కంపెనీ ఎండీ అమిత్ గొస్సేన్
(కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591)
ఎలివేటర్లు, ఎస్కలేటర్ల వినియోగం విషయంలో తమ కస్టమర్ల భద్రతే తమకు అత్యంత ప్రధానమైన అంశమని కోనే ఎలివేటర్ కంపెనీ ఎండీ అమిత్ గొస్సేన్ తెలిపారు. ఎలివేటర్లు, ఎస్కలేటర్ల తయారీలో సురక్షిత ప్రమాణాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఫిన్లాండ్ లోని హెల్సింకిలో ప్రధాన కార్యాలయంతో 140 ఏళ్ల క్రితం ప్రారంభమైన తమ సంస్థ.. భారత్ లో 40 ఏళ్లుగా సేవలందిస్తూ అగ్రగామిగా ఉన్నామని వెల్లడించారు. పలు అంశాలపై ఆయన రియల్ ఎస్టేట్ గురుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
‘ఎస్కలేటర్లు, ఎలివేటర్ల తయారీలో అగ్రగామిగా ఉన్న మా సంస్థ.. భారత్ లో 40 ఏళ్లుగా సేవలందిస్తోంది. చెన్నైలో ఎల్ జీఈ టెక్నాలజీ సెంటర్ కలిగి ఉన్నాం. పుణెలో మరో సాంకేతిక కేంద్రం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 50 కార్యాలయాలున్నాయి. వీటిని మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాం. మా కంపెనీలో ప్రస్తుతం 5800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అలాగే మరో 2 వేల మంది సబ్ కాంట్రాక్టర్లు మాతో కలిసి పని చేస్తున్నారు. ఎలివేటర్లు, ఎస్కలేటర్ల రవాణా, ఇన్ స్టాలేషన్ లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాఫీగా సాగిపోయేలా అన్ని చర్యలూ తీసుకున్నాం
క్రెడాయ్ అనేది చాలా ముఖ్యమైన సంఘం. బిల్డర్లు, డెవలపర్లను ఒకే వేదికపై కలుపుతుంది. భారత్ లో ఇది చాలా ప్రత్యేకం. ముఖ్యంగా హైదరాబాద్ కు మరీ కీలకం. ఇక్కడ బిల్డర్ల సంఘం చాలా పెద్దది. అంతేకాకుండా హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్ కు చాలా ముఖ్యమైన ప్రదేశం. అందువల్ల అందరి చూపూ ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతం మా కంపెనీ టర్నోవర్ 400 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. 2030 నాటికి లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటాం.
ప్రభుత్వం కాస్త దృష్టి పెడితే అందరికీ అందుబాటు గృహాలు అందే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ప్రజల స్థితిగతులు బాగున్నట్టు జీడీపీ చెబుతోంది. లగ్జరీ, ఇతర విభాగాలు కూడా బాగా పుంజుకున్నాయి. రిటైల్ సెక్టార్ పరిస్థితి అంత దారుణంగా ఏమీ లేదు. వాణిజ్య విభాగం బాగా పుంజుకుంది. మన ఆర్థిక వృద్ధి బాగా ఉన్నందునే దేశంలోకి చాలా పెట్టుబడులు వస్తున్నాయి. చాలా మెట్రోలు, రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు, ఎలివేటర్లు చాలా అవసరం. అందువల్ల ఈ విభాగం నిరంతరం వృద్ధి బాటలో పయనిస్తుంది. ఈ నేపథ్యంలో కోనే ఎల్లప్పుడు కొత్త ఉత్పత్తులను ప్రారంభిస్తూనే ఉంటుంది. మేం దేశంలో విశాలమైన ఉత్పత్తి శ్రేణిని కలిగి ఉన్నాం. భారతదేశంతో పాటు ప్రపంచంలోనే చిన్న ఇళ్లకు కూడా సరిపోయే ఉత్పత్తులను కలిగి ఉన్నాం. అలాగే చెన్నైతో అతిపెద్ద ఫ్యాక్టరీ ఉంది. అక్కడ చాలా ఎలివేటర్లు మరియు ఎస్కలేటర్లను తయారవుతాయి.
వినియోగదారుల అవసరాలను తీర్చే విధంగా సాంకేతికతను నిరంతరం అప్ గ్రేడ్ చేస్తుంటాం. మేం ఓ దశలో మెకానికల్ ఎలివేటర్లు కలిగి ఉన్నాం. వాస్తవానికి ప్రపంచంలోని మొట్టమొదటి డిజిటల్ కనెక్టెడ్ ఎలివేటర్ అందించింది కోనే కంపెనీయే. మేం చాలా పెద్ద ప్రాజెక్టులు చేపట్టాం. భారత్ లో అదిపెద్ద ఎలివేటర్ కోనేదే. ముంబైలోని జియో సెంటర్లో మేం ఏర్పాటు చేసిన ఈ ఎలివేటర్ ఒకేసారి 235 మందిని తీసుకెళుతుంది. భారత్ లో అత్యంత వేగవంతమైన ఎలివేటర్ రాయ్ 360 కూడా మేం ఏర్పాటు చేసిందే. భారత్ లో చాలా ఎత్తైన భవనాల్లో కోనే ఎలివేటర్లు ఉన్నాయి. ఇంకా చాలా రాబోతున్నాయి. వినియోగదారులతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండేందుకు ఏఐ ఆధారిత 24/7 సేవలను అందిస్తున్నాం. ఎక్కడైనా సమస్య వచ్చే అవకాశం ఉంటే అది ముందుగానే గుర్తించి తెలియజేస్తుంది. దీంతో మా ఇంజనీర్లు వెంటనే అక్కడకు వెళ్లి దాన్ని సరిదిద్దుతారు. అంటే మా కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా అన్నీ మేమే చూసుకుంటాం. దీనివల్ల వారు పూర్తి సురక్షితంగా, భద్రతతో ఉంటారు. మా కస్టమర్ల భద్రతే మాకు అత్యంత ప్రధానం. వారు సురక్షితంగా ఉండాలనే అంశంపైనే దృష్టి పెడతాం. అలాగే వారితో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తాం.
మా సేవలు, ఉత్పత్తులపై అభిప్రాయాలు తీసుకుంటాం. తద్వారా వారికోసం నిరంతరం కొత్త ఆవిష్కరణలు, నూతన ఉత్పత్తులు తీసుకురాగలిగాం. అలాగే చాలా అంశాలు డిజిటల్ చేశాం. చెల్లింపుల కోసం ఓ యాప్ పరిచయం చేశాం. ఇది చాలా సులభతరంగా ఉన్నట్టు ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది. సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించినందుకు, మాకు అత్యధిక లాయల్టీ స్కోర్ ఇచ్చినందుకు మా కస్టమర్లకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. బిల్డర్ కమ్యూనిటీలో క్రెడాయ్ చాలా కీలకమైనదని వ్యాఖ్యానించారు.