poulomi avante poulomi avante

జంట జలాశయాలకు మరణశాసనం?

Just for the sake of elections, Government has lifted 111 GO. This is nothing but a death bell to twin reservoirs

  • 111 జీవో ఎత్తివేత‌ సుప్రీం కోర్టు ధిక్కార‌మేనా?
  • ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేతపై పర్యావరణవేత్తల ఆందోళన
  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని స్పష్టీకరణ
  • ఎత్తివేత నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవాలి

హైదరాబాద్ లోని జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో నెంబర్ 111ని పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయం ప‌ట్ల‌ పర్యావరణవేత్తలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదని పేర్కొంటున్నారు. జీవో నెం.111ని పూర్తిగా ఎత్తివేయడం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని స్పష్టం చేస్తున్నారు.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు కొన్నాళ్ల క్రితం వరకు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాయి. ఈ నేపథ్యంలో ఈ జలాశయాలు కాలుష్య కాసారాలు కాకుండా ఉండేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ట్రిపుల్ వన్ జీవోను తీసుకొచ్చారు. ఆ జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో అన్ని రకాల నిర్మాణాలనూ నిషేధిస్తూ ఈ జీవో జారీ చేశారు. అయితే, ఈ జీవో కారణంగా ఆ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడిందని.. దాని పరిధిలోకి వచ్చే 84 గ్రామాల ప్రజలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారని.. పైగా ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల నీటి అవసరం పెద్దగా లేనందున ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై ఆ 84 గ్రామాల్లో ఎలాంటి ఆంక్షలు ఉండవని, హెచ్ఎండీఏ కు సంబంధించిన నియమ నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా, మంజీరా నదుల నుంచి సరిపడా నీళ్లు వస్తున్నందున ఎలాంటి ఇబ్బందీ లేదని పేర్కొంది. అంతేకాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరరిక్షణతోపాటు అవి కాలుష్యం బారిన పడ‌కుండా వాటి చుట్టూ రింగ్ మెయిన్, ఎస్టీపీల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. అయితే, ఇది సరికాదని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని ప్రముఖ పర్యావరణవేత్త, జలవనరుల మండలి రాష్ట్ర అధ్యక్షురాలు డా. లుబ్నా స‌ర్వ‌త్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మరికొంతమంది పర్యావరణవేత్తలతో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. జీవో 111 ప్రాధాన్యత గురించి అందులో వివరించారు.

1996లో జారీ..

జంట జలాశయాలు కాలుష్యం కాకుండా చూసేందుకు 1996 మార్చి 8న ట్రిపుల్ వన్ జీవో జారీ చేశారు. దీని ఫలితంగానే ఈ రోజు వరకు అవి కాలుష్యం కాలేదు. వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో హోటళ్లు, పరిశ్రమలు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు నిర్మించకూడదు. వాస్తవానికి రెండు నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా జీవో నెం.111 జారీ చేశార‌నే విష‌యాన్ని ప్ర‌భుత్వం తెలుసుకోవాలి. సురానా ఆయిల్స్ జీవో 192ని ఉల్లంఘించడానికి ప్రయత్నించినప్పుడు కాలుష్య నియంత్రణ మండలి ఎన్వోసీ ఇవ్వలేదు. అనంతరం సుప్రీంకోర్టు.. హైదరాబాద్ ఎన్జీఆర్ఐ, ఐఐటీ ముంబైకి చెందిన డాక్టర్ భౌమిక్, ఢిల్లీలోని ఎన్ఈఏఏ ఇచ్చిన మూడు శాస్త్రీయ నివేదికల ఆధారంగా ట్రిపుల్ వన్ జీవోను సమర్థించింది. ఆ జలాశయాల క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి కాలుష్య పరిశ్రమలు రాకూడదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ పర్యావరణ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ సురానా ఆయిల్స్ పిటిషన్ ను తోసిపుచ్చింది.

హైకోర్టులో కేసు..

ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకున్న సూత్రప్రాయ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 111 జీవో ఏరియాపై నిషేధాన్ని తొలగించ‌లేదని.. అవి అట్లాగే కొనసాగుతున్నాయ‌ని హైకోర్టుకు రాష్ట్ర ప్ర‌భుత్వం లిఖిత‌పూర్వ‌కంగా అంద‌జేసింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగానే ట్రిపుల్ వన్ జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకోవ‌డం దారుణ‌మైన విష‌యమ‌ని ప్ర‌జ‌లు అంటున్నారు.

ఇప్పటికీ తాగునీటి సరఫరా..

వందేళ్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు ఇప్పటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నాయి. ఈ రోజు కూడా ఉస్మాన్ సాగర్ 65 మిలియన్ గ్యాలన్లు, హిమాయత్ సాగర్ 9 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేశాయి. ఇది ఇలాగే కొనసాగాలంటే 10 కిలోమీటర్ల బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాల్ని చేపట్టకూడదు. వాస్తవానికి ఈ రెండు రిజర్వాయర్ల పరిధిలో ఆక్రమణలు తొలగించడంతోపాటు ఐదేళ్లుగా ఈ జలశాయాల్లోకి చేరుతున్న మురుగు నీటిని నిరోధించాల్సిన ప్రభుత్వం.. అందుకు భిన్నంగా ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయడం ద్వారా మరింత కాలుష్యం చేయడానికి సిద్ధమైంది. ఈ ప్రాంతానికి కూడా హెచ్ఎండీఏ నిబంధనలే వర్తింపచేస్తే.. దీనిని టీఎస్ఐఐసీ ప్రాంతం కింద ప్రకటన చేసే అవకాశం ఉంది. అలా చేయడం ఈ రెండు రిజర్వాయర్లకు మరణశాసనం లిఖించడమే అవుతుంది.

అలా చెప్పి.. ఇలా చేసింది..

‘ట్రిపుల్ వన్ జీవో విషయంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని 2016లో ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్ కు నివేదించింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు చెప్పింది.. అసెంబ్లీలోనూ చెప్పింది. ప్రజలకు, మీడియాకు కూడా హైవపర్ కమిటీ నివేదిక వస్తోందని చెప్పింది. కానీ ఆ నివేదిక రాకుండానే ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తూ జీవో నెం.69 తీసుకొచ్చింది. దీని కోసం మరో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. హైకోర్టుకు, ప్రజలకు, మీడియాకు కూడా మళ్లీ ఇదే చెప్పింది. కమిటీ రిపోర్టు కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది. ఇలా ఈ వ్యవహారంలో అటు ప్రజలు, ఇటు మీడియానే కాకుండా చివరకు కోర్టులను కూడా తప్పుదోవ పట్టించింది.

హైదరాబాద్ నగరం తన 20 కిలోమీటర్ల పరిధిలోని తాగునీటి వనరులను వదులుకోకూడదు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేసే విషయంలో ఎలాంటి శాస్త్రీయపరమైన విధానాన్ని అనుసరించలేదు. పైగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు. పైగా, ఈ అంశం హైకోర్టు ప‌రిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే రిజర్వాయర్ల లోపల ఉన్న అన్ని ఆక్రమణలు తొలగించాలని విన్నవిస్తున్నాం. ట్రిపుల్ జీవో వ‌న్ ఏరియాలో డ్రై లెట్రిన్లను అమ‌ల్లోకి తీసుకు రావాల‌ని.. త‌ద్వారా ఎస్టీపీలు, సోక్‌ పిట్లు, సెప్టిక్ ట్యాంకులు అవ‌స‌ర‌ముండ‌ద‌’ని డా. లుబ్నా సర్వ‌త్‌, డా. జస్వీన్ జైరత్, ప్రమీలా కుమారి, జైపాల్ డి రెడ్డి, కవయిత్రి సంఘమిత్ర మాలిక్, తల్హా జబీన్ తదితరులు కోరారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles