Categories: TOP STORIES

రియల్ మహిళా టైకూన్ కు మరణిశిక్ష

రూ.లక్ష కోట్ల మోసం కేసులో
వియత్నాం కోర్టు సంచలన తీర్పు
మ‌న ద‌గ్గ‌ర ఎంత‌మందిని ఉరి వేయ‌వ‌చ్చు?
బ్యాంకు అధికారికి జీవిత ఖైదు శిక్ష‌

బ్యాంకును రూ.లక్ష కోట్లకు పైగా మోసం చేసిన కేసులో ఓ రియల్ ఎస్టేట్ మహిళా దిగ్గజానికి వియత్నాం కోర్టు మరణశిక్ష విధించింది. ఆ దేశంలో అతిపెద్ద మోసంగా రికార్డుకెక్కిన ఈ ఉదంతంతో తాజాగా ఈ తీర్పు వెలువడింది. అదే మ‌న భార‌త‌దేశంలో అయితే, ఇలా ఎంత‌మందికి ఉరిశిక్ష వేయ‌వ‌చ్చో ఒక్క‌సారి ఆలోచించండి.

వియత్నాంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాన్ థిన్ ఫాట్ కు 67 ఏళ్ల మహిళ ట్రూంగ్ మై లాన్ చైర్ పర్సన్ గా ఉన్నారు. 2012-2022 కాలంలో అక్కడి సైగన్‌ జాయింట్‌ స్టాక్‌ కమర్షియల్‌ బ్యాంక్‌పై అజమాయిషీ చలాయించారు. ఆ కాలంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి సూట్ కేస్ కంపెనీల ద్వారా 12 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.లక్ష కోట్టు) రుణాల రూపంలో మళ్లించారు. ఈ మొత్తం వియత్నాం జీడీపీలో 3 శాతం కావడం విశేషం. ఈ నేపథ్యంలో బ్యాంకుకు పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చినందుకు ఆమెపై కేసు నమోదైంది. దీంతో 2022 అక్టోబర్‌లో లాన్ అరెస్టయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు.. బ్యాంకుకు రూ.224 కోట్లు(2.69 కోట్ల డాలర్లు) జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. అయితే, భారీ ఆర్థిక, వ్యవస్థీకృత నేరానికి పాల్పడిన లాన్ నుంచి ఆ నగదు రికవరీ చేసే పరిస్థితి లేనందున ఆమెకు మరణశిక్ష విధిస్తున్నట్టు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

ఈ కేసులో దాదాపు రూ.43 కోట్ల లంచం తీసుకున్న సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ అధికారి డో థి నహాన్‌కు జీవిత ఖైదు విధించింది. లాన్‌ సన్నిహిత బంధువు, వాన్‌ థిన్‌ ఫాట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారిణి ట్రూంగ్‌ హూయీ వాన్‌కు 17 ఏళ్ల కారాగారశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వాన్‌ థిన్హ్‌ ఫాట్‌ అక్కడి లగ్జరీ నివాస భవంతులు, కార్యాలయాలు, హోటళ్లు, షాపింగ్‌ సెంటర్లను నిర్మించడంలో మంచి పేరు ఉంది. అయితే, ఆ సంస్థ అధిపతి బ్యాంక్‌ను మోసం చేయడంతో ఈ సంస్థ విశ్వసనీయతపై మార్కెట్లో నీలినీడలు కమ్ముకున్నాయి. పైగా వియత్నాంలో రియల్ రంగం చతికిలపడింది. భారీ డిస్కౌంట్లు, బహుమతిగా బంగారం ఇస్తూ డెవలపర్లు ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నా కొనుగోలుదారులు ముందుకు రావట్లేదు.

This website uses cookies.