రియల్ ఎస్టేట్ గురుతో శ్రీ శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ వి.కృష్ణారెడ్డి
- ఇరవై శాతం మార్టిగేజ్..
- ఇదే అతి పెద్ద సమస్య
- ఓసీ నిబంధన ఉన్నాక
అదనపు మార్టిగేజ్ ఎందుకు? - మౌలికంగా వృద్ధి చేయాలి
- ఫీజుల్ని తగ్గిస్తే మేలు..
కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591 : ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎప్పుడైనా.. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించినప్పుడే ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా, మరిన్ని సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టడానికి వీలవుతుంది. మౌలిక సదుపాయాల్ని డెవలప్ చేసి.. ఫీజుల్ని హేతుబద్ధీకరిస్తే.. నిర్మాణ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తుంది. దీనిపై ఆధారపడ్డ 250 పరిశ్రమలు కళకళలాడుతాయి. అంతిమంగా, సామాన్యులకు సొంతింటి కల సులువుగా సాకారం అవుతుందని శ్రీ శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ వి. కృష్ణారెడ్డి తెలిపారు. కోకాపేట్‌లో మార్కిస్ ప్రాజెక్టును ఆరంభించిన సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఆరు దశాబ్దాలకు పైగా పట్టిందని.. 2004 తర్వాతే హైదరాబాద్ రియాల్టీలో పురోగతి ఆరంభమైందన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఏర్పడి ఆరు దశాబ్దాలు దాటేసింది.. ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడానికి సుమారు నలభై, నలభై ఐదేళ్లు పట్టింది.. 2004 తర్వాతే హైదరాబాద్ రియాల్టీలో పురోగతి ఆరంభమైంది. పైగా, కేవలం ఏపీకి చెందినవారే కాకుండా.. దేశంలోని ఇతర నగరాల నుంచి విచ్చేసి.. ఇక్కడే ఉద్యోగాలు చేసేవారున్నారు.. వ్యాపారాలు, పరిశ్రమలను విజయవంతంగా నడిపిస్తున్నవారున్నారు.. ప్రవాసులూ హైదరాబాద్‌లో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు.. కాబట్టి, ఎలా చూసినా, రానున్న రోజుల్లో.. అమరావతి వల్ల హైదరాబాద్ రియాల్టీకి ఒనగూడే నష్టమేం లేదని.. భాగ్యనగరం గణనీయంగా వృద్ధి చెందుతుంది.
ఇన్‌ఫ్రా మీద ఫోకస్..
తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలి. ఇరవై నాలుగ్గంటలు విద్యుత్తు, మంచినీరు, మురుగునీటి సౌకర్యం వంటివి డెవలప్ చేయాలి. బెంగళూరు తరహాలో హైదరాబాద్ కాకుండా ఉండేందుకు మరిన్ని ఫ్లైఓవర్లు, ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు, రేడియల్ రోడ్లను అభవృద్ధి చేయాలి. ప్రభుత్వం రియాల్టీ పరిశ్రమను ప్రోత్సహించే విధంగా నిర్ణయాల్ని తీసుకుంటేనే.. కొత్త ప్రాజెక్టులు ఆరంభం అవుతాయి. ఫలితంగా, ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది. ప్రజల సొంతింటి కల తీరుతుంది.
ఫీజుల భారం తగ్గాలి..
బెంగళూరు వంటి నగరంలో హైరైజ్ బిల్డింగ్స్ మీద చదరపు అడుక్కీ యాభై రూపాయలు చొప్పున ఫీజుల్ని వసూలు చేస్తారు. కానీ, మన వద్ద ఆకాశహర్మ్యాల మీద అధిక ఫీజుల్ని వసూలు చేస్తారు. కోకాపేట్ డెవలప్‌మెంట్ అని చదరపు అడుక్కీ రూ.35, స్లిప్ రోడ్ల కోసం చ.అ.కీ. రూ.50, ఇతరత్రా పేరిట చదరపు అడుక్కీ రూ.100.. ఇలా మొత్తం లెక్కిస్తే.. హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల్ని నిర్మించే ఒక బిల్డర్.. ల్యాండ్ ఓనర్ షేర్ కలుపుకుంటే.. చదరపు అడుక్కీ రూ.300 దాకా చెల్లిస్తున్నారు.
ఈ ఫీజుల్ని హేతుబద్ధీకరిస్తే.. మార్కెట్ సానుకూలంగా స్పందిస్తుంది. కేంద్రం ఇన్‌కం ట్యాక్స్ రూల్స్ తగ్గించినప్పుడు రెవెన్యూ గణనీయంగా పెరిగినట్టుగా, నిర్మాణాలపై ఫీజుల్ని తగ్గించి.. వాయిదా పద్ధతుల్లో వసూలు చేయాలి. అప్పుడే, డెవలపర్లు ప్రాజెక్టు డెవలప్‌మెంట్ మీద దృష్టి పెడతారు. పైగా, కొత్త ప్రాజెక్టులొస్తాయి. జీఎస్టీ, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ వంటివి పెరిగి.. ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తుంది.