ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం చేసినందుకుగాను ఆయా యజమానులు కట్టాల్సిన వడ్డీ మొత్తాన్ని బిల్డరే వారికి చెల్లించాలంటూ రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. అలా చెల్లించడానికి అంగీకరిస్తేనే తాము ఈ పిటిషన్ పై వాదనలు వింటామని తేల్చి చెప్పింది. ట్రిబ్యునల్ ముందు రూ.19 కోట్లు డిపాజిట్ చేయడానికి ఐదు నెలల సమయం ఇచ్చింది. అయితే, అందులో రూ.5.5 కోట్లను నాలుగు వారాల్లో డిపాజిట్ చేయాలని సీసీఐ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఆదేశించింది. ఫ్లాట్ కొనుగోలుదారులకు చెల్లించడం కోసం తమకు జరిమానాగా విధించిన రూ.1.1 కోట్ల మొత్తంలో 30 శాతం.. అంటే రూ.33 లక్షలను నాలుగు వారాల్లోగా జమ చేస్తామని.. అలాగే ఖర్చుల నిమిత్తం చెల్లించాల్సిన రూ.10 లక్షలను కూడా చెల్లిస్తామని సదరు కంపెనీ పేర్కొంది. ఇవి చెల్లించని పక్షంలో తమ ముందున్న పిటిషన్ ను వెంటనే తోసిపుచ్చుతామంటూ ధర్మాసనం హెచ్చరించడంతో ఆ కంపెనీ ఈ మేరకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది.
ముంబై బోరివలిలో వింటర్ గ్రీన్ పేరుతో సీసీఐ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే, నిర్దేశిత గడువులోగా వాటిని ఆయా కొనుగోలుదారులకు అప్పగించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం చేసినందుకు గాను తమకు పరిహారం ఇప్పించాలని కొనుగోలుదారులు మహారాష్ట్ర రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. వాదనలు విన్న ట్రైబ్యునల్.. కొనుగోలుదారులు చెల్లించాలని వడ్డీ మొత్తాన్ని వారికి చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్వర్వులను సీసీఐ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బాంబే హోకోర్టులో సవాల్ చేసింది.